చెక్‌పోస్టుల్లో పటిష్ట నిఘా : ఎస్‌పి

Mar 30,2024 21:33

బొబ్బిలిరూరల్‌ : ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో పటిష్ట నిఘా పెట్టాలని ఎస్‌పి దీపిక.. పోలీసు సిబ్బందికి సూచించారు. పాత బొబ్బిలి జంక్షను వద్ద ఏర్పాటు చేసిన అంతర జిల్లా చెక్‌ పోస్టును ఎస్‌పి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది చేపడుతున్న వాహన తనిఖీలను పరిశీలించారు. ఇరు జిల్లాల మధ్య వచ్చి, పోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వాహనాల వివరాలను రిజిష్టరులో నమోదు చేయాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు తరలించే మద్యం, నాటుసారా, గంజాయి, నగదు, ప్రోత్సాహక బహుమతులు, చీరలు, వాచీలు వంటి ఇతర వస్తువుల అక్రమ రవాణాను నియంత్రించాలన్నారు. వాహన తనిఖీల్లో అక్రమ రవాణాకు వినియోగించే వాహనాలను, వస్తువులను సీజ్‌ చేయాలన్నారు. అనంతరం మెట్టవలస, పారాది పోలింగు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగు కేంద్రాల వద్ద ఇప్పటి వరకు చేపట్టిన భద్రత చర్యలను బొబ్బిలి డిఎస్‌పి పి.శ్రీనివాసరావు, సిఐ ఎం.నాగేశ్వరరావు.. ఎస్‌పికి వివరించారు.

➡️