జగన్‌కు అక్కచెల్లెమ్మల ఉసురు తగులుతుంది

Jan 2,2024 21:44

ప్రజాశక్తి – జామి, కొత్తవలస, శృంగవరపుకోట : ‘ఇంట్లో ఆడపిల్ల కంటతడి పెడితేనే మంచిది కాదంటారు… కానీ రాష్ట్రంలోని వేలాది మంది అంగన్వాడీలు 22 రోజులుగా రోడ్డుకెక్కి పోరాడుతుంటే… సిఎం జగన్మోహన్‌ రెడ్డి కనికరం చూపించడం లేదు. కచ్చితంగా అక్కచెల్లెమ్మల ఉసురు తప్పక జగన్‌ ప్రభుత్వానికి తగులుతుంది’ అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం జామి, కొత్తవలస, శృంగవరపుకోట మండల కేంద్రాల్లో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాలను ఆయన సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ అంగన్వాడీలు 22 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. చర్చల పేరుతో కాలయాపన తప్ప అంగన్వాడీలకు ప్రయోజనమేమీ చేకూర్చడం లేదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఈ నెల ఐదో తేదీలోగా విధులకు హాజరు కాకుంటే కొత్తవారిని నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులిస్తూ బెదిరింపులకు దిగడంపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేసే ప్రశ్నే లేదని స్పష్టంచేశారు. వెంటనే డిమాండ్లన్నీ పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం అంగన్వాడీలతో కలిసి దున్నపోతుకు వినతులు అందించారు. అంగన్వాడీల సమ్మెకు జనసేన నాయకులు ఒబ్బిన సన్యాసినాయుడు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి, జిల్లా నాయకులు గాడి అప్పారావు, మద్దిల రమణ, చెలికాని ముత్యాలు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పైడిరాజు, నాయకులు కనకమహాలక్ష్మి, వెంకటలక్ష్మి, శ్రీదేవి, విష్షుణమ్మ, కాకర తులసి, శంకరావతి, డి.శ్యామల, డి.జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️