టిడిపిలోకి మక్కువ శ్రీధర్‌?

Mar 30,2024 21:37

 ఆయన వెంట పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు

నేడో రేపు ముహూర్తం

ప్రజాశక్తి-గజపతినగరం : వైసిపి నాయకుడు, మాజీ ఎంపిపి మక్కువ శ్రీధర్‌ వైసిపిని వీడి టిడిపిలో చేరనున్నారు. చాలా కాలంగా వైసిపిలో కొనసాగుతున్న ఆయనకు ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య తగిన స్థానం కల్పించకపోవడంతో మనస్థాపం చెందిన ఆయన తన అనుచరులతో కలసి పార్టీని వీడుతున్నట్లు సన్నిహితులకు తెలిపారు. ఇందుకు నేడో, రేపు ముహూర్తం పెట్టనున్నారు. ఆయనతో పాటు పలు గ్రామాలకు చెందిన తాజా, మాజీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు కూడా టిడిపిని వీడనున్నారు. మక్కువ శ్రీధర్‌ 2001లో జెడ్‌పిటిసి సభ్యుడిగా, 2006 ఎంపిపిగా, 2014లో జెడ్‌పిటిసి సభ్యుడిగా పదువులు చేపట్టారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన తరువాత టిడిపిలో చేరారు. వైసిపి ఆవిర్భావం తరువాత జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆ తరువాత 2014లో టిడిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో తిరిగి వైసిపిలో చేరినప్పటికీ ఆయనకు ఎమ్మెల్యే అప్పలనర్సయ్య తగిన ప్రాధాన్యతను కల్పించలేదు. అప్పటి నుంచి ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీధర్‌ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మండలంలోని పలు గ్రామాల్లో శ్రీధర్‌కు పట్టుంది. ఆయనతో పాటు వారంతా టిడిపిలో చేరడంతో వైసిపికి గట్టి దెబ్బే తగులుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

➡️