తీరంలో రెడ్‌ అలెర్ట్‌

మత్స్యకారులతో మాట్లాడుతున్న తహశీల్దార్‌ బంగార్రాజు

ప్రజాశక్తి-పూసపాటిరేగ : బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. మిచౌంగ్‌ ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఈదురుగాలులుతో కూడిన వర్షం పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర గ్రామాల్లో సముద్రం ఒడ్డున ఎర్రజెండాలు ఎగురవేశారు. తుపాను ముప్పు పొంచి ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రంలో లంగరు వేసిన బోట్లు వెంటనే బయటకు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టారు. తీరం ఒడ్డున కూడా బోట్లు దూరంగా పెట్టుకోవాలని అధికారులు సూచించారు. మంగళవారం తుపాను తీరం దాటే అవకాశం ఉందని, దాని ప్రభావం తీరంపై ఉంటుందని తెలిపారు. తహశీల్దార్‌ భాస్కరరావుతోపాటు రెవెన్యూ అధికారులంతా తీరంలో మకాం వేశారు. మత్స్యకార నాయకులతో సమావేశమై, సూచనలు చేశారు. భారీవర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. ఎక్కడ, ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భోగాపురం : తుపాను తీవ్రతకు వర్షాలు పడుతుండడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత గ్రామాల్లో తహశీల్దార్‌ చింతాడ బంగార్రాజు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా తోటపల్లి వద్దనున్న తుపాను షెల్టర్‌ను పరిశీలించారు. అవసరమైతే మత్స్యకారులను తరలించేందుకు ఏర్పాట్లను చేశారు. ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేెరు గ్రామాల్లో ఆయన పర్యటించి తుపాను తీవ్రత గురించి వివరించారు. తీవ్రత ఎక్కువగా ఉంటే షెల్టర్‌కు తరలిరావాలని మత్స్యకారులకు సూచించారు. తీరప్రాంత గ్రామాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని ఆర్‌ఐ కిషోర్‌కు సూచించారు. ఇప్పటికే మత్స్యకారులు తమ బోట్లను తీరానికి దూరంగా చేర్చి వలలను భద్రపరచుకున్నారు. సోమవారం ఉదయం నుంచి మండల వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. రైతులు కోసిన వరిచేనును పొలాల్లోని గాలి దిబ్బలు వేసి ఉంచారు.

➡️