తీరని వేదన.. ఆగని రోదన

Jan 2,2024 21:39

ప్రజాశక్తి-బొబ్బిలి : న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఉధృతమవుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ రోజుకో వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం జాప్యం చేయడం, మరోవైపు బెదిరింపులకు దిగడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డిమాండ్లన్నీ నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు అంగన్వాడీలకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. పలు రాజకీయ పార్టీలు, ప్రజా, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం తెలియజేస్తున్నారు.
జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 22వ రోజుకు చేరింది. సమ్మె చేపట్టి మూడు వారాలు గడిచినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అంగన్వాడీలు పోరాటాన్ని ఉధృతం చేశారు. బొబ్బిలి పట్టణంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు సిఐటియు, జనసేన మద్దతు ప్రకటించాయి.. సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి కె.సురేష్‌, జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి సందర్శించి మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు పోరాటానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, నిర్మల, పద్మ, ఉమాగౌరి పాల్గొన్నారు.విజయనగరంటౌన్‌ : కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శిబిరంలో అంగన్వాడీ యూనియన్‌ విజయనగరం అర్బన్‌ ప్రాజెక్టు నాయకులు కె.ప్రభ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధం కాబోతున్నామని తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమణ, సుధారాణి, నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జగన్‌మోహన్‌రావు, బి.రమణ సమ్మెకు మద్దతు ప్రకటించారు.భోగాపురం : భోగాపురంలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె శిబిరంలో థింసా నృత్యం చేసి నిరసన తెలియజేశారు. వివిధ రకాల పాటలతో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి.సూర్యనారాయణ, యూనియన్‌ నాయకులు కొర్లమ్మ, ప్రవీణ, శ్రీదేవి, అనిత పాల్గొన్నారు.రామభద్రపురం : రామభద్రపురంలో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శిబిరంలో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సిఎం జగన్‌, మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర ముఖ్య నేతల ముఖాలున్న మాస్కులు ధరించి, వారికి నమస్కారం చేస్తూ నిరసన చేపట్టారు. దున్నపోతుకు వినతి అందించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బి.శ్రీనివాసరావు, యూనియన్‌ నాయకులు సత్యవతి, రాధమ్మ, కుమారి పాల్గొన్నారు.గజపతినగరం : గజపతినగరంలో సమ్మెలో భాగంగా అంగన్వాడీలు దున్నపోతుకు వినతి అందించి, నిరసన తెలిపారు. అంగన్వాడీల శిబిరాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ సందర్శించి, మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు సుభాషిని, జ్యోతి, నారాయణమ్మ, రవణమ్మ, లక్ష్మి, పైడిరాజు, వాణి, నాగమణి, సన్యాసమ్మ, పద్మ, త్రివేణి, రాములమ్మ పాల్గొన్నారు.

➡️