తొలిరోజు ప్రశాంతం

Mar 1,2024 20:23

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. వారందరినీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించలేదు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి లేదని ముందే ప్రకటించడంతో పరీక్ష రాసే విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్దులు పరీక్ష రాసేందుకు హాల్‌ టికెట్‌,పెన్‌ , అట్ట తప్ప ఎటువంటి ఇతర వస్తువులు లోపలికి అనుమతించలేదు. మొదటి ఏడాది పరీక్ష రాస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరుండి ఆటోలు, బైక్‌లపై కేంద్రాలకు తీసుకొచ్చారు. శుభాకాంక్షలు చెప్పి పంపించారు. తొలి రోజు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 22253 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 20852 మంది హాజరయ్యారు. 1401 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తొలి రోజు పరీక్ష తెలుగుకు 8230 మంది, సంస్కతం 8610 మంది, హిందీ పరీక్షకు 3785 మంది హాజరయ్యారు. గజపతినగరం శ్రీకృష్ణ జూనియర్‌ కాలేజిలో జరిగిన సంస్కత పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన ఒక విద్యార్థిని అధికారులు డిబారు చేశారు. 73కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగిందని ఆర్‌ఐఒ ఎం.ఆదినారాయణ తెలిపారు.వేపాడ : వేపాడలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సర విద్యార్థులు 222 మందికి గాను 211 మంది హాజరైనట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ బి.భాస్కర్‌ తెలిపారు. ఈ పరీక్షలకు డిపార్ట్మెంట్‌ అధికారిగా జి.మోహనరావు వ్యవహరించారు. నెల్లిమర్ల : ఇంటర్‌ పరీక్షలకు తొలి రోజు 689 మంది విద్యార్థులు హాజరయ్యారు. శుక్రవారం స్థానిక సికెఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల కేంద్రంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సికెఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 437 మందికి 21మంది గైర్హాజర్‌ కాగా 416 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల కేంద్రంగా 282 మందికి 9మంది గైర్హాజరు కాగా 273 మంది పరీక్షలకు హాజరయ్యారు.వంగర: మండలంలోని మడ్డువలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్ష మొదటిరోజు ప్రశాంతంగా జరిగింది. 178 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా 170 మంది విద్యార్థులు హాజరయ్యారు. 8 మంది విద్యార్థులు గైర్వాజరైనట్లు చీప్‌ సూపరింటెండెంట్‌ కొరటాన నారాయణరావు తెలిపారు. ఈ పరీక్షా కేంద్రంలో ఇక్కడ విద్యార్థులతోపాటు మడ్డువలస గురుకులం, వంగర కేజీబీవీ, రేగిడి మండలంలో గల ఉంగరాడ, దేవుదల కళాశాలల విద్యార్థులు పరీక్ష రాసినట్లు ఆయన వెల్లడించారు.

➡️