బిజెపితో జతకట్టే పార్టీల్లో ఉండలేను

Feb 15,2024 21:33

కురుపాం: మతతత్వ పార్టీ అయిన బిజెపితో జత కట్టిన ఏ పార్టీలోనూ ఉండలేనని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ అన్నారు. గురువారం సాయంత్రం తన కోటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపికి రాజీనామా చేయడానికి ముఖ్య కారణం బిజెపితో జతకట్టడమేనన్నారు. అప్పట్లో తాను టిడిపిలోకి చేరడానికి కారణం ఆ పార్టీ ఎన్‌డిఎ నుంచి బయటకి రావడమేనని అన్నారు. చంద్రబాబు అరెస్టుకు కారణమైన పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లలేదని, మనకు ప్రజలు ఓట్లు వేసి న్యాయ బద్ధంగా గెలిపించినప్పుడు అసెంబ్లీలో ప్రజల గొంతును వినిపించాలని, అలాంటిది చంద్రబాబు విస్మరించారని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్‌ వెనుక బిజెపి ఉందని తనకున్న సమాచారమని, అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న టిడిపి పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు. బిజెపి హయాంలో హింస మతఘర్షణలు ఎక్కువయ్యాయని, మత విద్వేషాలు సష్టిస్తున్న బిజెపికి ఇలా లొంగిపోయి టిడిపి పొత్తు పెట్టుకుంటుందని తాను అనుకోలేదని అన్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు మోడీని కలవడానికి వెళ్ళలేదనీ కానీ చంద్రబాబు ఎందుకు అన్ని సార్లు వెళ్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. టిడిపి కనుసన్నల్లో నడుస్తుందని, అటువంటిప్పుడు న్యాయం రాష్ట్రానికి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. టిడిపి, వైసిపి ఇక్కడ తిట్టుకుంటూ కొట్టుకుంటూ కేంద్రంలో మోడీకి మద్దతు చేస్తున్నాయని అటువంటి పార్టీకి దాసోహం అవ్వాల్సిన అవసరమేంటని అన్నారు. కారణాలు ఆలోచించకుండా పొత్తు పెట్టుకోవడం వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటని విలేకరులు ప్రశ్నించగా, ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు.

➡️