బిల్లుల కోసం ఎదురుచూపులు

Mar 3,2024 20:51

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర పాలక సంస్థలో చేపడుతున్న అభివృద్ధి పనులకు బిల్లుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 2021 నుంచి రోడ్లు, కాలువలు, వాటర్‌ ట్యాంక్‌లు, పార్కులు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులను నగర పాలక సంస్థలో సుమారుగా 30 మందికి పైగా ఉన్న కాంట్రాక్టర్లు టెండర్లు వేసి చేపడుతున్నారు. అయితే నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నంత వేగంగా బిల్లులు చెల్లింపు కావడం లేదు. నగర పాలక సంస్థలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 600 పైగా అభివృద్ధి పనులు చెయ్యాలని కౌన్సిల్‌లో తీర్మానించారు. చేసిన పనులకు మాత్రం సకాలంలో బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోంది. 600 పైగా పనులు చేయాలని నిర్ణయిస్తే వాటిలో 400 వరకు పనులు పూర్తి చేశారు. వాటిలో కూడా ఎక్కువగా నగర పాలక సంస్థ ఆదాయం నుంచి చేసినవే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లించాల్సిన బిల్లులు చెల్లించక పోవడంతో రోజురోజుకూ పనులు చేసే కాంట్రాక్టర్లు సంఖ్య తగ్గుతూ వస్తుంది. కొంతమంది కాంట్రాక్టర్లు ఇప్పటికే ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు. విజయనగరం నగర పాలక సంస్థ గత ఏడాది జూన్‌ నుంచి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు సుమారుగా రూ.8.50 కోట్లు మేర ఉన్నాయి. దీనిలో సాధారణ నిధుల నుంచి రూ.4.45 కోట్లు, 2021 సంవత్సరంలో వచ్చిన 15వ ఆర్థిక సంవత్సరం నిధులు రూ.3.59 కోట్లు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద రావాల్సింది రూ.52 లక్షలు ఉన్నాయి. వీటితోపాటు విద్యుత్తు శాఖకు చెల్లించాల్సిన బిల్లులు రూ.6.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు గత ఏడాది జూన్‌ నుంచి చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.40 కోట్లతో చేపట్టాల్సిన 200కు పైగా పనులు నిలిచి పోయాయి. మరో వైపు ఆర్ధిక సంవత్సరం ముగుస్తుండటంతో బిల్లులు వస్తాయో? రావోనని భయంతో కాంట్రాక్టర్లు ఉన్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉండటంతో నగర పాలక సంస్థ కార్యాలయం చుట్టూ కాంట్రాక్టర్లు తిరుగుతున్నారు.విద్యుత్తు బిల్లులు బకాయి రూ.6.10 కోట్లు నగర పాలక సంస్థ విద్యుత్తు బిల్లు బకాయి రూ.6.10 కోట్లు విద్యుత్తు శాఖకు చెల్లించాల్సి ఉంది. బిల్లు చెల్లించక పోవడంతో అదనంగా మరో రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షలు సర్‌ఛార్జి భారం పడింది. పుండు మీద కారం చల్లిన చందంగా మరో 15 లక్షలు జరిమానా చెల్లించాల్సి వస్తుందని నగర పాలక సంస్థ అధికారులు వాపోతున్నారు.
మరో రూ.3 కోట్ల బిల్లులు సిద్ధం
ఇప్పటికే రూ.14 కోట్లు పైగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా, నగర పాలక సంస్థ అధికారులు మరో మూడు కోట్లు నిధులకు బిల్లులు అప్‌లోడ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా రావాల్సిన నిధులు రాకపోవడంతో కొత్త బిల్లులు అప్‌లోడ్‌ చేసేందుకు సాహసం చేయడం లేదు. మరోవైపు ఏ క్షణంలోనైనా ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుందేమోనని కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్‌ రానుండడంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.

➡️