సుజల స్రవంతిపై వైసిపి భిన్న స్వరాలు

Feb 24,2024 21:39

విజయనగరం ప్రతినిధి: ఒకే అంశం. సమస్య కూడా ఒక్కటే… ఒకటే పార్టీ…. కానీ, దానిపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. అదేదో ప్రతిపక్షమో… లేక మైనార్టీలోవున్న ఇతర పార్టీలో కావు. సాక్షాత్తు అధికార వైసిపి. ఎటొచ్చి సమస్య రైతులకు సంబంధించింది కావడం, అదీ వేలాది మంది రైతుల జీవితాలతోనూ, జిల్లా అభివృద్ధితోనూ ముడిపడి ఉండడంతో జిల్లాలో పబ్లిక్‌టాక్‌గా మారింది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేపేరుతో ఈ జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ నిర్మాణానికి భూసేకరణకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలువ అలైన్‌మెంట్‌ వల్ల ఎక్కువ పంట భూములు కోల్పోవడంతోపాటు నిర్వహణ కష్టంగా ఉంటుందని, నీటి పంపిణీలోనూ ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు, ఎపి రైతు సంఘం చాలా కాలంగా మొత్తుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎస్‌.కోట, గజపతినగరం మండలాల్లో సభలు, సమావేశాలు అనేకం జరిగాయి. ఈనెల 2వ తేదీన ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన జరిగిన భూ నిర్వాసితుల సదస్సుకు ఈ రెండు నియోజకవర్గాల నుంచీ పలువురు తాజా, మాజీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, రైతులు తరలివచ్చారు. వైసిపి తరపున ఎమ్మెల్సీ రఘురాజు కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఇటు రైతులకు, అటు ప్రభుత్వానికి ఖర్చు తగ్గించడంతోపాటు లక్ష్యత ఆయుకట్టుకు నీరు సునాయాశంగా వెళ్లేందుకు వీలుగా కాలువ అలైన్‌మెంట్‌ ప్రత్యామ్నాయం అన్వేషించాలని, అందుకోసం కలిసికట్టుగా పోరాడాలని ఆ సదస్సు తీర్మానించింది. ఈ డిమాండ్‌ ముమ్మాటికీ న్యాయమైన దేనని, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే చట్ట సభల్లో ప్రస్తావిస్తానని కూడా ఎమ్మెల్సీ రఘురాజు హామీ ఇచ్చారు. నీటివాటం ఇంజినీర్లకన్నా రైతులకు ఎక్కువగా తెలుస్తుందని, ఇంజినీర్లు ఇక్కడ వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ఎక్కడో కూర్చొని కాలువలు లేదా ప్రాజెక్టుల అలైన్‌మెంట్లు గీసేస్తుంటారని, ఉత్తరాంధ్ర సుజల ప్రసవంతి విషయంలోనూ అటువంటి తప్పిదమే జరిగిందని చెప్పారు. రైతులను ఒప్పించి భూములు తీసు కోవాలి తప్ప, నొప్పించి తీసు కోవడం ఎవరికైనా తగదన్నారు. ‘అలైన్‌ మెంట్‌ తయారు చేసిన ఇంజి నీర్లకు బహుశా భూముల విలువ, భూములతో రైతులకు ఉన్న అను బంధం గురించి తెలీదేమో’ అని విమర్శ కూడా చేశారు. కానీ, నిన్నగాక మొన్న అదే పార్టీకి చెందిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైసిపి జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘రైతులేమైనా ఇంజినీర్లా…. కాలువల ఎలా ఏర్పాటు చేస్తుందో వారికి తెలియడానికి’ అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాం శగా మారింది. కాలువల అలైన్‌మెంట్‌ మార్చే ఆలోచనే లేదంటూ కుండబద్ధలు గొట్టినట్టు చెప్పడంతో రైతులు అగ్గిమీద గుగ్గిలమౌతున్నారు. ప్రస్తుత అలైన్‌మెంట్‌ ప్రకారం తాటిపూడి నుంచి గజపతినగరం, గుర్ల మండలాల మీదుగా సాగుతుంది. దీనికి పైన ఉన్న మెంటాడ, దత్తిరాజేరు, రామభద్రపురం, తెర్లాం, మెరకముడిదాం, బాడంగి, బలిజిపేట, బొబ్బిలి, రాజాం తదితర మండలాలకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని పంపాల్సి వస్తుంది. అదే మెంటాడ, రామభద్రపురం, బొబ్బిలి, బలిజిపేట మీదుగా అలైన్‌మెంట్‌ మార్పుచేస్తే భూదేవి జలాశయం నుంచి చిలకలగెడ్డ ఆండ్ర జలాశయం, చంపావతి, వేగావతి, ఏడొంపులగెడ్డ, పోతులగెడ్డ తదితర నదులు, గెడ్డలను అనుసంధానం చేయవచ్చు. తద్వారా నిర్థేశిత ఆయుకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించవచ్చు. ఆయుకట్టు ప్రాంతంలో 90శాతం భూమి దిగు భాగాన ఉండడం వల్ల లిఫ్ట్‌ల సంఖ్య, కాలువల నిర్మాణాకి ఖర్చు తగ్గుతుందని రైతులు, వారి తరపున సీనియర్‌ ఇంజినీరింగ్‌ నిపుణులు ఐఎస్‌ఎన్‌ రాజు తదితరులు చాలా కాలంగా చెబుతున్నారు. ఈ విషయమై సాగునీటి పారుదలశాఖ అధికారులు, ఆ శాఖకు చెందిన రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణలతో ఎపి రైతు సంఘం నాయకత్వంలో రైతులు చర్చించగా, వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక కమిటీ కూడా వేసినట్టు సమాచారం. దానిపై చిత్తశుద్ధి మాత్రం కనింపించకపోవడంతో రైతులు సంఘటితమౌతున్నారు. ఈ సమస్య జిల్లాకు చెందిన నాయకులకు చాలా చిన్నదిగాను, పట్టీపట్టనట్టుగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చేవిధంగా కాలువ అలైన్‌మెంట్‌ చేస్తే… జిల్లాకు చెందిన నాయకులు అచేతనంగా వ్యవహరించడం సిగ్గుచేటనే చర్చ జిల్లాలో సర్వత్రా సాగుతోంది. ఎన్నికల ముందే ఇలా మాట్లాడితే… ఎన్నికలు అయ్యాక అసలు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండబోదని రైతుల్లో చర్చనడుస్తోంది.

➡️