మాట నిలబెట్టుకునే నాయకుడు జగన్

May 20,2024 10:19 #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగనేనని జిల్లా పరిషత్ చైర్మన్, డిప్యూటీ రీజనల్ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) సోమవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వివిధ సంక్షేమ లబ్ధిదారులకు సుమారు రూ.10 వేల కోట్లు అందితే సీఎం జగన్ ప్రజల్లో మరింత ప్రజాదరణ పెరిగి, గుండెల్లో పెట్టుకుని జగన్ కు ఓట్లు వేస్తారన్న అక్కసుతో కొంతమంది కుట్రదారులు పన్నాగం పొందారన్నారు. ముందే జమ కావాల్సిన డబ్బులపై కోర్టులకు వెళ్లడం, ఎన్నికల కమీషన్ కు పిర్యాదులు చేసి నిలబెట్టారన్నారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి జగన్ ముందు నుంచి ఇస్తున్న పథకాలును నిలుపుదల చేయవద్దని కోర్ట్ ద్వారా ఎన్నికల కమీషన్ కు ఆదేశాలు ఇప్పించారన్నారు. ఇప్పుడు సుమారు రూ.1400 కోట్లను ప్రజల ఖాతాలలో జమ చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆసరా క్రింద పెండింగ్ లో ఉన్నరూ.1200 కోట్లను గతంలో రాని మహిళలందరికీ వాళ్ళ వాళ్ళ సిసిల ద్వారా బ్యాంకుల యందు నాలుగైదు రోజుల్లో చేతికి తీసుకునే అవకాశం కలిగిందన్నారు. అలాగే ఈ బిసి నేస్తం క్రింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న అర్హత ఉన్న ఓసి మహిళల ఖాతాలలో సోమవారం నుంచి జమ అవుతుందన్నారు. కళాశాలల విద్యార్థుల ఫీజులు చెల్లింపుల విషయంలో ఆలస్యం అయితే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం ముందుగానే విన్నవించినా కూడా కుట్రదారులు ఇవేమీ పట్టించుకోలేదన్నారు. విద్యాదీవెన క్రింద నిధులు తల్లుల ఖాతాలలో జమ అయ్యాయన్నారు. చెప్పిన మాట ప్రకారం రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ నిధులు కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యాయన్నారు. రైతులకు పెట్టుబడి నిధులు జమ అయ్యాయన్నారు. అలాగే ఎస్ సి, ఎస్ టి, బిసి,మైనారిటీ మహిళలకు నాల్గవ విడత చేయూత పథకానికి సబందించి రూ.18,750లు లబ్ధిదార్లు వాళ్ళ ఖాతాలలో జమ అవుతాయన్నారు. ఇవన్నీ కూడా విద్యాదీవెన,ఈ బిసి నేస్తం,పెండింగ్ ఉన్న ఆసరా, చేయూత, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ, రైతులకు పెట్టుబడి నిధి తదితర పథకాల నిధులు వారం పదిరోజుల్లో అక్క చెల్లెమ్మలు, రైతులందరి ఖాతాలలో జమ కానుండడంపై సంతోషంగా ఉందన్నారు. ఇవి మూడు నెలల ముందే లబ్ది దారుల ఖాతాలలో జమ కావాల్సి ఉందన్నారు. కొంతమంది ఎన్ని కుట్రలు పన్నినా బెదరకుండా సీఎం జగన్ చెప్పిన మాట ప్రకారం ప్రతి మాటను నెరవేర్చిన వ్యక్తిగా దేశంలోనే పేరొందారన్నారు. ఎన్నికల సమయంలోనే కాదు ఎన్నికైన మరుసటి రోజు నుంచే ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనన్నారు. జగన్ కు మద్దతుగా నిలిచిన అక్క చెల్లెమ్మలు కృతజ్ఞతలను జిల్లా పరిషత్ చైర్మన్, డిప్యూటీ రీజనల్ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలియచేశారు. ఒక వారం రోజుల్లో ఖాతాలలో జమ అవుతున్న డబ్బులను మీ కుటుంభ అవసరాల నిమిత్తం, భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలని కోరారు. రైతులు, మహిళలు, విద్యార్థుల తరపున సీఎం జగన్ కు జిల్లా పరిషత్ చైర్మన్, డిప్యూటీ రీజనల్ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

➡️