ప్రయివేటుకు మాంగనీస్‌ ధారాదత్తం

Apr 19,2024 22:46

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  విజయనగరం జిల్లాలో నిక్షిప్తమైవున్న మాంగనీస్‌ గనులను కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. పర్యావరణ పరిరక్షణ పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో, ఓవైపు గనుల దోపిడి, మరోవైపు కాలుష్యంతో ప్రజానీకం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, తెర్లాం మండలాలు మాంగనీస్‌ గనులకు పెట్టింది పేరు. ఇక్కడి భూగర్భంలో నిక్షిప్తమైవున్న గనులకు ప్రపంచ స్థాయిలో మంచి డిమాండ్‌ ఉంది. ఎపిలో మాంగనీస్‌ గనులనేసరికి ఈ ప్రాంతాలే గుర్తుకు వస్తాయి. గడిచిన 50ఏళ్ల క్రితం నుంచి సుమారు 30బ్లాకుల్లో మాంగనీస్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. దేశ, విదేశాల్లో వీటిని వినియోగిస్తున్నారు. ఇనుము, కాపర్‌ వంటి రకరకాల లోహాలను కరిగించడంతోపాటు వివిధ రకాల తయారీకి మాంగనీస్‌ ఎంతో దోహదపడుతుంది. ఈ ప్రాంతంలోని మాంగనీస్‌ అత్యంత నాణ్యతగా ఉండడంతో సెయిల్‌, గెయిల్‌ వంటి ప్రభుత్వ రంగ స్టీల్‌ప్లాంటులకు కేటాయించాలన్న ఉద్ధేశంతో ఈ ప్రాంతంలోని సుమారు రెండు దశాబ్దాల కితం ఇక్కడి మాంగనీస్‌ గనులను కొత్తగా లీజుకు ఇవ్వకుండా నిలిపివేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి సహజ వనరుల లీజు పద్ధతిని పెట్టుబడిదారులకు మరింత సులభతరం చేసి, ఓపెన్‌ బిడ్‌ రూపంలో కేటాయిస్తోంది. ఈ క్రమంలో ఎపి ఎంఎంసి (ఆంధ్రప్రదేశ్‌ మైనర్‌ మినరల్‌ కనస్ట్రక్షన్‌) 1966ను సరళతరం చేసి, 2022 మార్చి 14న ఎపి ఎంఎంఎఆర్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జిఒ నెంబర్‌ 30, 14లను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలోని వివిధ మండలాల్లోవున్న మాంగనీస్‌ గనులను వివిధ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. 56లక్షల మెట్రిక్‌ టన్నులు మాంగనీస్‌ గల గిరివిడి మండలం దేవాడ బ్లాక్‌ను మహాలక్ష్మీ మినరల్స్‌ అనే ప్రైవేట్‌ కంపెనీ దక్కించుకుంది. జిల్లాలోని సుమారు 19మాంగనీస్‌ బ్లాకులను ఆర్‌బిఎస్‌ఎస్‌డి-2, మోర్‌ ఎల్లాయీస్‌ వంటి కంపెనీలు దక్కించుకుంది. 2022 నవంబర్‌ 22న కొండపాలెం బ్లాక్‌ తవ్వకాలకు డిసెంబర్‌ 21న అధికారులు ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. గరిడివి మండలం దేవాడ బ్లాక్‌ తవ్వకాలపైనా ఇప్పట్లో ఆందోళన వ్యక్తమైంది. జిల్లా అత్యంత వెనుకబడి ఉన్నందున స్టీల్‌, ఫెర్రో ఎల్లాయీస్‌ వంటి పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటుచేసి, వాటికి స్థానికంగావున్న మాంగనీస్‌ గనులను కేటాయించాలని ఈ గ్రామాల్లోని ప్రజలు, కార్మికులు డిమాండ్‌ చేశారు. నివాసాలకు కేవలం 500మీటర్ల దూరంలో తవ్వకాలు చేపడితే కాలుష్య సమస్య ఎదుర్కోవాల్సివస్తుందని, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని అధికారులు చెప్పినప్పటికీ ఆచరణలో అటువంటి చర్యలేవీ కనిపించడం లేదు. మరోవైపు తవ్వకాలకు అనుమతులు చకచకా ఇచ్చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం, గతంలో చంద్రబాబు ప్రభుత్వం బిజెపి విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయని, ప్రస్తుత ఎన్నికల్లో పాలకపార్టీలకు బుద్ధిచెప్పాలని జనం చర్చించుకుంటున్నారు.

మాంగనీస్‌ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

అత్యంత విలువైన, నాణ్యమైన మాంగనీస్‌ గనులు నిక్షిప్తమైవున్న చీపురుపల్లి నియోజకవర్గంలో స్టీల్‌, ఫెర్రోఎల్లాయీస్‌ తదితర మాంగనీస్‌ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. తద్వారా విజయనగరం జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది. వలసలు నివారించవచ్చు. ఇక్కడి విలువైన గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల ఈ ప్రాంతం మరింత దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవాల్సివస్తుంది.

– అంబళ్ల గౌరినాయుడు,సిఐటియు 

➡️