అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి

Feb 2,2024 15:01 #Vizianagaram
mm naidu as new commissioner

 కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎంఎం నాయుడు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అందరి సహకారంతో నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నగరపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.మల్లయ్య నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పురోహితుల చేత వేదాశీర్వచనాలను పొందారు. అనంతరం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమన్వయంతో నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. గతంలో ఇక్కడ సేవలందించిన అనుభవంతో మరింత మెరుగైన పాలనను అందిస్తానన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, మేయర్ విజయలక్ష్మి సలహా సూచనలతో నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. అలాగే సచివాలయాల పనితీరును మరింతగా మెరుగుపరిచి ప్రజలకు సులభతరమైన సేవలు అందే విధంగా కృషి చేస్తానన్నారు. పారిశుద్ధ్యనికి అధిక ప్రాధాన్యతనిచ్చి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించి మెరుగైన పారిశుద్ధ్య విధానం అమలయ్యే విధంగా చూస్తానన్నారు. ప్రజా ప్రతినిధుల ఆకాంక్షలకు అనుగుణంగా అనుసరణీయమైన సేవలను అందించేందుకు సంసిద్ధంగా ఉన్నానన్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ విజయలక్ష్మి లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

➡️