విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణానికి నెలరోజుల్లోగా శంకుస్థాపన చేయాలి

Jun 28,2024 00:39 #distlaibrary, #mvssharma
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :

విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణానికి టిడిపి కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని, నెల రోజుల్లోగా శంకుస్థాపన చేయాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ, పౌర గ్రంథాలయ సేవా సమితి యాక్షన్‌ టీం నాయకులు ఎంవిఎస్‌.శర్మ డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పౌరగ్రంథాలయాల సేవా సమితి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయం భవనం పునర్నిర్మాణం కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక, పోరాటాన్ని పౌర గ్రంథాలయాల సేవా సమితి ద్వారా ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తున్నామని తెలిపారు. గ్రంథాలయ భవనం నిర్మాణానికి అవసరమైన ఎకరా స్థలం, నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. జివిఎంసి వద్ద రూ.200 కోట్లు ఉన్నాయని, అందులో రూ.2 కోట్లు గ్రంథాలయ భవనం నిర్మాణానికి ఖర్చు చేయడం పెద్ద సమస్య కాదని తెలిపారు. పౌర గ్రంథాలయాల సేవా సమితి అధ్యక్షులు బిఎల్‌.నారాయణ మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి మహారాణిపేట దండుబజారులోని జిల్లా గ్రంథాలయ సంస్థకు చెందిన సుమారు ఎకరం స్థలంలో ఏళ్ల కాలంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం నడుస్తుండేదని, 2010లో ఆ స్థలాన్ని మాజీ మంత్రి, ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష ప్రైవేటు సంస్థకు 33 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారని, ఆ సంస్థ గ్రంథాలయ భవనాన్ని నేల మట్టం చేసిందని తెలిపారు. అనంతరం పౌరగ్రంథాలయాల సేవా సంస్థ చేసిన పోరాటం ఫలితంగా 2014లో ఆ లీజు ఒప్పందం రద్దు అయిందన్నారు. ఇప్పటికి 13 సంవత్సరాలు గడిచిపోయినా కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలు జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన పునర్నిర్మాణం చేపట్టలేదన్నారు. జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర ప్రజానీకం నగరంలో సరైన గ్రంథాలయం లేక అనేక ఇక్కట్ల పాలవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం జివిఎంసికి ప్రజలు ఆస్తి పన్నుల రూపంలో రూపాయికి 8 పైసలు చొప్పున గ్రంథాలయం పన్ను కూడా చెల్లిస్తున్నారని, రూ.200 కోట్లకు పైబడి జివిఎంసి దగ్గర ఆ నిధులు ఉన్నాయని, వాటిలో కొన్ని కోట్ల రూపాయలు జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థకు సమకూరుతుందని, అందులో 2 కోట్ల రూపా యలు వెచ్చించి జిల్లా కేంద్ర గ్రంథాలయానికి భవనం నిర్మించవచ్చునని తెలిపారు. దీనిపై అనేకసార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేకపోయిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టామని ప్రకటించిందని, దీనికి గీటురాయిగా విశాఖ కేంద్ర గ్రంథాలయ భవనాన్ని వెంటనే నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఈ అంశాన్ని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో తాము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఇతర మంత్రుల దృష్టికి ఆ సమస్యను తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో పౌర గ్రంథాలయ సేవా సమితి కార్యదర్శి కె.త్రిమూర్తులు, కోశాధికారి మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

 

➡️