విజయనగరం లోకసభ ఎవరి వశం?

Apr 27,2024 22:06

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : విజయనగరం ఎంపీ ఎవరి వశం? స్థానిక సిట్టింగ్‌ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు ప్రజలు మరోసారి పట్టం కడతారా?. లేక టిడిపి నుంచి రంగంలోకి దిగిన కలిశెట్టి అప్పలనాయుడుకు ఈసారి అవకాశం కల్పిస్తారా?. ఇండియా వేదిక తరపున పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి బొబ్బిలి శ్రీను ప్రభావం ఎంత?. ఇది ప్రస్తుతం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న చర్చ. కానీ, ఈ ముగ్గురు అభ్యర్థుల జయాపజయాలు, వారి వ్యక్తిగత చరిష్మాకన్నా పార్టీలపై ప్రజలు చూపే ఆదరాభిమానాలను బట్టి ఉంటాయని చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపడం సర్వసాధారణం. కానీ, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మారుమూల ప్రాంతంలోని ప్రజానికాన్ని కూడా ప్రభావితం చేస్తుండడం, ఆ విషయాలు ఎప్పటికప్పుడే తేటతెల్లమౌతుండడంతో దేశ రాజకీయాలపైనా, అందుకు వేదికగావుండే లోక్‌ సభ అభ్యర్థుల గెలుపోటములపైన కూడా చర్చనడుస్తోంది. గత పదేళ్లలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్యాస్‌, పెట్రోల్‌, నిత్యవసర సరుకులు తదితర రూపాల్లో ప్రజలపై మోపిన భారాలు, విలువ ఆధారిత పన్ను, చెత్తపన్ను, జిఎస్‌టి వంటి రూపాల్లో ప్రజల నుంచి చేసిన భారీ వసూళ్లు సగటు పేద, మధ్యతరగతి ప్రజలతోపాటు ఎగువ మధ్యతరగతులను కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేశాయి. ఈ మేరకు మన జిల్లాలోనూ బోడికొండ, తామర కొండ, శిఖపరువు, గరివిడి, చీపురుపల్లి ప్రాంతాల్లో నిక్షిప్తమైవున్న గ్రానైట్‌, మాంగనీస్‌ గనులను కారు చౌకగా కట్టబెట్టి పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ శక్తులు భారీగా లాభాలు చేకూర్చేందుకు ప్రయత్నించారు. మరోవైపు రామతీర్థంలోని రాముని విగ్రహాన్ని ధ్వంసం ఎలా జరిగిందన్నది కాసేపు పక్కనబెడితే, ఆ ఘటనను మతం, రాజకీయాలకు ముడిపెట్టిన బిజెపి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వరకు తీసుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే మన జిల్లాలో బిజెపి మత అజెండా ముందుకు సాగించడం సాధ్యం కాలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ కూడా ఆవిరైపోయింది. వెనుకబడిన ఉత్తరాంధ్రా జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు అరకొరతో ఆపేసింది. రాజధాని, పోలవరం వంటివాటికి సాయం అందజేయక పోవడంతోపాటు గ్రామ పంచాయతీలకు కూడా చట్ట ప్రకారం నిధులు కేటాయించలేదు. ఈనేపథ్యంలో ఇవన్నీ బిజెపితో నేరుగా పొత్తుపెట్టుకున్న టిడిపికి మాత్రమే కాదు. పరోక్షంగా బిజెపికి తొత్తులా వ్యవహరిస్తూ, ప్రత్యేక హోదా కోసం కనీసం నోరు మెదపని వైసిపికి కూడా ప్రతికూల అంశాలే. పైన పేర్కొన్న అంశాలపై ప్రజలకు పూర్తిగా అర్థమైతే. ఇటు వైసిపి, అటు టిడిపి ఎంపీ అభ్యర్థులకు ఎదురు దెబ్బ తప్పదు. ఆ మేరకు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓట్ల రూపంలో లాభం చేకూరుతుంది. వాడు కాకపోతే వీడు… వీడు కాకపోతే వాడు అన్నట్టుగా టిడిపి, వైసిపి అభ్యర్థులవైపే చూస్తే ఆయా పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు వచ్చే ఓట్లను బట్టి ఎంపీ అభ్యర్థుల భవిత్వం కూడా ఉండవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులూ ఇప్పటికే తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. టిడిపి, వైసిపి అభ్యర్థులు వ్యక్తిగత ప్రచారం కంటే అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఎవరికి అవకాశం దక్కుతుందో వేచి చూడాల్సిందే.

➡️