వాలంటీర్లు, ఫీల్డు అసిస్టెంట్లలో గుబులు

Jun 18,2024 21:43

తమకు అవకాశం కల్పించాలంటున్న తెలుగు తమ్ముళ్లు

గతంలో జీవనోపాధిని దెబ్బతీశారంటూ మరికొందరు

గ్రామ స్థాయిలో సిద్ధమవుతున్న జాబితాలు

ఎమ్మెల్యేలకు, అధికారులకు విజ్ఞాపనలు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఇప్పుడే కాదు… కొన్ని దశాబ్ధాలుగా ప్రభుత్వాలు, పాలకులు చూపిన పక్షపాత వైఖరి, కక్షసాధింపు చర్యలు, బంధుప్రీతితో గ్రామ స్థాయిలోని గ్రామ వాలంటీర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, యానిమేటర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశావర్కర్లు నలిగిపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం మారడంతో కొందరి గుండెల్లో గుబులు మొదలైంది. ప్రతి ఐదేళ్లకోసారి ఇటువంటి దుస్థితి ఉంటోంది. జిల్లాలో ఈసారి మరీ ఎక్కువగానే కనిపిస్తోంది. గత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ చొప్పున నియమించారు. మన్యం జిల్లా వ్యాప్తంగా ఉన్న 350 వార్డు, గ్రామ సచివాల యాల పరిధిలో 5340 మంది వాలంటీర్లను నియమించి, వారికి రూ.5వేల చొప్పున పారితోషికం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్ని గ్రామాల్లో మినహా మిగిలిన అన్నిచోట్లా వైసిపి కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారు. వీరిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో వైసిపి ప్రభుత్వం నాలుక కొరుక్కుంది. పార్టీ కోసం వాలంటీర్లంతా రాజీనామాలు చేసి వైసిపి గెలుపునకు కృషి చేయాలంటూ అప్పట్లో జగన్‌ ప్రభుత్వం చెప్పింది. జగన్‌ పిలుపే తడువుగా ‘మాంసం తిన్నామంటూ దుమ్ములు మెడలో వేసుకున్న చందంగా’ జిల్లా వ్యాప్తంగా 2800 మంది రాజీనామాలు చేశారు. ఇటీవల టిడిపి ప్రభుత్వం మారడంతో తమను తొలగించి, టిడిపి కార్యకర్తలను పెట్టుకుంటారనే భయం చాలా మంది వాలంటీర్లలో వ్యక్తమౌతోంది. అందుకు తగ్గట్టే ‘రాజీనామా చేయని వాలంటీర్లందర్నీ కొనసాగిస్తాం’ అంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఓ కార్యక్రమంలో మంగళవారం ప్రకటించారు. దీంతో, జిల్లాలోని మెజార్టీ వాలంటీర్లలో ఆందోళన నెలకొంది. ఈనేపథ్యంలోనే కురుపాంతో పాటు మరికొన్ని మండలాలకు చెందిన వాలంటీర్లు రాజీనామా చేసిన తమను కొనసాగించాలని కోరుతూ అధికారులకు వినతినిచ్చేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. వాలంటీర్ల నియామకాల్లో పేదలని చూడకుండా వైసిపిలో ఉన్నవారికి మాత్రమే ఇచ్చారనేది గ్రామ స్థాయి టిడిపి నాయకుల వాదన. నిరుపేదలకు కూడా అవకాశం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. అలాగే ఉపాధి హామీలో పనిచేస్తున్న మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లలో చాలా మందిపై గత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడింది. దీంతో పలువురు కోర్టులకు కూడా వెళ్లినట్టుగా సమాచారం. కొమరాడ మండలం కోటిపాం జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన కార్మికులను కూడా ఇలాగే అర్ధాంతరంగా తొలగించారు. ఇవి మచ్చుకు మాత్రమే జిల్లా ఎంతో మంది గత ప్రభుత్వ హయాంలో వేధింపులతో జీవనోపాధి కోల్పోయారు. వీరంతా ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో తమను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే, మంత్రులకు విన్నపాలు చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి సమస్య లేనిచోట కూడా తమ కోసం పనిచేసినవారికి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో చాలా కాలంగా పనిచేస్తున్న మేట్‌లను, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకు లను మార్పుచేసేందుకుతహతహలాడు తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో పార్టీల ప్రాతిపదికన జాబితాలు తయారు చేసి స్థానిక ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు సన్నద్దమౌతున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ మద్యంషాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది తమను కొనసాగించాలంటూ ఎమ్మెల్యే లకు, మంత్రులకు వినతులు ఇస్తున్నారు. వారిలో కూడా తొలగిస్తారేమోనన్న ఆందోళన నెలకొంది.

➡️