అంగన్వాడీలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం : సిపిఎం 

Dec 19,2023 14:30 #Anganwadi strike, #vijayanagaram
  • అంగన్వాడీ ల పోరాటానికి పిల్లలు,తల్లులు మద్దతు
  • 8 వ రోజుకి చేరిన అంగన్వాడీ లు సమ్మె

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ లకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇవ్వాలని,అంగన్వాడీ లు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హల్పర్స్ యూనియన్ చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 8 వ రోజుకి చేరుకుంది. అంగన్వాడీ లు పోరాటానికి మద్దతు గా అంగన్వాడీ కేంద్రాల పిల్లలు,వారి తల్లులు సమ్మెకు మద్దతు ఇచ్చి కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమం లో పాల్గొన్నారు. సమ్మె పోరాటంలో పాల్గొన్న పిల్లలు,తల్లులు అంగన్వాడీ వర్కర్స్,ఆయాలకు వేతనాలు చెల్లించాలని,ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కారం చేయాలని,మా టీచర్,ఆయాలు తో నే కేంద్రాలను నడిపించాలని కోరుతూ పలకలపై రాసి నిరసనలో పాల్గొన్నారు. నిరసన శిబిరంలో పాల్గొన్న పిల్లలు,వారి తల్లులు అంగన్వాడీ లు సమస్యలు పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ లు 8 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కారం చేసి,కేంద్రాలను తెరిపించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా కవ్వింపు చర్యలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. గ్రామాల్లో ,నగరాల్లో పేదల పిల్లలకు, గర్బీనీలకు అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడీ లు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మరో వైపు వారి సమస్యలు పరిష్కారం చేయకపోగా సచివాలయం ఉద్యోగులు,వెలుగు సిబ్బందితో తెరిపించి పని చేయడం సరికాదని,వారితో ఎన్ని రోజులు పని చేయించుకుంటారో చూస్తామన్నారు. 8 రోజులు కాదు 80 రోజులు అయినా సమస్యలు పరిష్కారం చేసే వరకు,వేతనాలు పెంచే వరకు అంగన్వాడీ లు పోరాటం జరుగుతుందని,వారికి సిపిఎం అన్ని రకాల గా అండగా ఉంటామన్నారు.అనంతరం ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. ప్రభుత్వం దిగురాకుంటే దిగి వచ్చే విధంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన శిబిరంలో అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

➡️