కల్యాణ వైభోగమే

దేశంలోనే రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయ ప్రాంగణంలో సోమవారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణం భక్త జనసందోహం, శ్రీరామ నామస్మరణల మధ్య వైభవంగా జరిగింది. క్రోధినామ సంవత్సరం సందర్భంగా స్వామివారి కల్యాణాన్ని పౌర్ణమి పండు వెన్నెల్లో తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, యాత్రికులు, పర్యాటకులు, సేవకులు పెద్దఎత్తున విచ్చేశారు. అంతకు ముందు సీతారాములవారిని ఆలయం నుంచి ఊరేగింపుగా మంగళ వాయిద్యాల నడమ కల్యాణ మండపం వద్ద ఆసీనులను చేశారు. వేదపండితులు ముందుగా ప్రత్యేక పూజలను నిర్వహించి ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ వంశం గొప్పదంటే తమ వంశమే గొప్పదని కొంత మంది వేద పండితులు సీతమ్మ వైపు, శ్రీరాముల వారి వైపు మరికొందరుచేరి వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాలనడుమ శ్రీసీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. టిటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తులకు కనువిందు చేశాయి.

➡️