సంక్షోభంలో మైనారిటీల సంక్షేమం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారని శాసన మండలి మాజీ చైర్మన్‌ ఎంఎ షరీఫ్‌, టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. శనివారం యర్రగొండపాలెం పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో టిడిపి ఆధ్వర్యంలో ముస్లిం, నూర్‌ బాషాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభ లో వారు మాట్లాడారు. ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వారికి తీవ్ర అన్యాయం చేసిందని మండి పడ్డారు. జగన్మోహన్‌రెడ్డి పాలనలో ముస్లిములపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికా రం కోసం, ముస్లింల ఓట్ల కోసం మొసలి కన్నీరు కార్చిన జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిముల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. టిడిపి ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దుచేసి ముస్లిములను దగా చేశారని అన్నారు. రాష్ట్రంలో మైనారిటీ వర్గాలపై వందమంది కిపైగా దాడులు, హత్యలు, ఆత్మహత్యలకు వైసిపి ప్రభుత్వం వేధింపులే కారణమని అన్నారు. మైనారిటీ వర్గాలను చిత్రహింసలకు గురిచేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. ముస్లిం మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేశారని అన్నారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి టిడిపి కట్టుబడి ఉందన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ముస్లిములకు అనేక రకాల అభివృద్ధి ఫలాలు అందించామని గుర్తు చేశారు. 50 శాతం సబ్సిడీతో రూ.2 లక్షల వరకు రుణాలు రూ.50 కోట్లతో నూర్‌ బాషా ఫెడరేషన్‌ ఏర్పాటు చేశామని అన్నారు. పేద ముస్లిం విద్యార్థు లకు ఉర్దూ ఇంగ్లీష్‌ మీడియంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి స్కాలర్‌ షిప్పులు అందించినట్లు తెలిపారు. పేద ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్యకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేసినట్లు గుర్తు చేశారు. దుల్హన్‌ పథకం ద్వారా రూ.50 వేలను ఎలాంటి షరతులు లేకుండా 38 వేల మంది కి ఆర్థిక సహకారం అందించినట్లు తెలిపారు. 300కుపైగా షాదీఖానాలను ఏర్పాటు చేసి అత్యాధునిక హంగులతో నిర్మించామని అన్నారు. ఇళ్ల నిర్మాణం, ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు, వేలాది మసీదులకు మరమ్మతులు, పునర్నిర్మాణం, ఉర్దూ భాషకు అధికార భాషగా గుర్తింపునకు టిడిపి కృషి చేసిందని అన్నారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. ముస్లిముల అభ్యున్నతి లక్ష్యంగా టిడిపి పనిచేస్తుందని అన్నారు. తొలుత అతిథులకు ముస్లిములు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నేత డాక్టర్‌ మన్నె రవీంద్ర, టిడిపి ముస్లిం మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్‌ ఇస్మాయిల్‌, టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు షేక్‌ మాబు, ఎస్‌ఎండి యూసఫ్‌, గఫూర్‌, షేక్‌ సుభాని, షేక్‌ మస్తాన్‌వలి, షేక్‌ వలి, గురిజేపల్లి జిలానిలతో పాటు ఐదు మండలాల్లోని ముస్లిం, నూర్‌ బాషాలు పాల్గొన్నారు.

➡️