అన్నదాత అగచాట్లు

పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు
ప్రజాశక్తి – ఆచంట     
ఆరుగాలం కష్టించి… ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి.. ఒడిదుడుకులను తట్టుకుని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకు కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం నుంచి సాయం అందక, బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరించగా రోజురోజుకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులతో కౌలు రైతులు అల్లాడిపోతున్నారు. పంటలు నష్టపోయిన సమయంలో కనీసం పరిహారం సొమ్ములు కూడా వీరికి అందడం లేదు. ఇలా ఓవైపు ప్రకృతి మరోవైపు ప్రభుత్వం కౌలు రైతులతో ఆటలాడుకుంటుంది. అటు సాగును వదులుకోలేక మరో పనులు చేయలేక కౌలు రైతులు దిక్కుతోతోచని స్థితిలో విలవిల్లాడిపోతున్నారు. తుపాన్‌ ప్రభావంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కోతకు వచ్చిన పంట పొలాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వర్షపు నీరు చేలను ముంచెత్తడంతో పండిన నాలుగు గింజలను ఒబ్బిడి చేసుకునేందుకు అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నాడు. ఆచంట మండలంలో సుమారు 10,352 ఎకరాల్లో సార్వా వరి సాగు చేస్తున్నారు. పలుచోట్ల కోతకు వచ్చిన వరిచేలు తుపాన్‌ ప్రభావంతో నేలకొరిగి ముంపునకు గురయ్యాయి. దిగుబడి సగానికి సగం తగ్గిపోయిందని ఆవేదన చెందుతున్నారు. చేతికందిన పంట తడిచిపోవడంతో దళారుల దోపిడీ తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. గ్రామాల్లో మురుగు డ్రెయిన్‌లో నీరు తగ్గకపోవడంతో పంట పొలాల్లో నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయిందని, ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగితే ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆచంట మండలంలోని ఆచంట, పెదమల్లం, కోడేరు, కొడమంచిలి, కందరవల్లి, కరుగోరుమిల్లి, భీమలాపురం, వల్లూరు, పెనుమంచిలి, ఆచంట వేమవరం, శేషమ్మ చెరువు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంట నేలకొరిగింది. ఆయా పంట పొలాల్లో మురుగునీరుపై వరి దుబ్బులు తేలియాడుతున్నాయి. దీంతో పంట కుళ్లిపోయే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టి నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన కౌలు రైతులకు, క్రాప్‌ ఇన్సూరెన్స్‌తో పాటు నష్టపరిహారం అందించాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.అప్పులే మిగిలాయిబాలం గంగాధర్‌, కౌలు రైతు, ఆచంట వేమవరంమూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని సార్వా సాగు చేస్తున్నాను. అప్పులు చేసి ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. పంట చేతికొచ్చిన సమయం లో తుపాన్‌ కారణంగా పండిన పంట అంతా నేల వాలింది. పంట అంతా ఇంకా నీటిలోనే నానుతుంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.కష్టం గంగపాలైందికాండ్రేగుల మసేన్‌, కౌలు రైతు, ఆచంట వేమవరం12 ఎకరాలు సాగు చేస్తున్నాను. తుపాన్‌ కారణంగా చేతికొచ్చిన పంట గంగపాలైంది. పెట్టుబడులు కూడా వెనకకు రావడం లేదు. బ్యాంకులో, బయటి నుంచి తెచ్చిన అప్పులు తీర్చాలంటే భారంగా మారింది. వ్యవసాయ రంగంలో రైతు ఆటుపోట్లకు గురవుతున్నాడు.ప్రభుత్వమే ఆదుకోవాలికొండేటి రామకృష్ణ, కౌలు రైతు, ఆచంట వేమవరంనాలుగు ఎకరాలు కౌలు తీసుకుని సాగు చేస్తున్నాను. ఇటీవల సాగు ఖర్చులు, పెట్టుబడులు భారీగా పెరిగాయి. వీటి కోసం రైతులు ఎక్కువగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకవైపు తుపానులో వరదల కారణంగా రైతులు సాగు పట్ల విసుగుతో ఉన్నారు. ప్రభుత్వం వ్యాపార పారిశ్రామిక రంగాలవారికి రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తుంది. అలాంటిది సన్న చిన్న కారు రైతులకు కొంత ప్రయోజనం కల్పిస్తే తప్పేమిటి. కొన్నాళ్లుగా ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవుతుంది. పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.

➡️