16న జాతీయ లోక్ అదాలత్

Mar 11,2024 15:46 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం : రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నరసాపురం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నరసాపురం కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని నరసాపురం పదవ అదనపు జిల్లా జడ్జి మరియు సంస్థ ఛైర్మన్ పి.విజయ దుర్గ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో అన్ని పెండింగ్ సివిల్ కేసులు, రాజీ దగ్గ క్రిమినల్ కేసులు, మోటార్ యాక్సిడెంట్ కేసులు, చెక్కు బాకీ కేసులు, మనోవర్తి కేసులు, అదనపు వరకట్న వేధింపు కేసులు, చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీ కేసులు, బ్యాంకు, బీఎస్ ఎన్ ఎల్ మొండి బాకీ కేసులు తదితర కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. ఎక్సైజ్ కేసుల్లో కాంపౌండ్ ఫీజు కట్టి రాజీ  పడవచ్చన్నారు. కక్షిదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయకుండా తమ కేసులను రాజీ చేసుకొనుటకు ప్రయత్నించాలన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో రాజీ చేసుకుంటే ఇరు పార్టీలు గెలిచినట్టేననీ, పైగా అప్పీలు చేసుకునే అవకాశం లేనందున ఇదే అంతిమ తీర్పు అవుతుందన్నారు. సివిల్ కేసుల్లో ఇదివరకే కట్టిన కోర్టు ఫీజు కూడా వాపసు వస్తుందన్నారు. ప్రతిరోజూ రాజీకి ఆస్కారం ఉన్న కేసుల్లో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్ నిర్వహించి ఏలూరులోని పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో ఇరు పార్టీలతో నేరుగా మాట్లాడి కేసులను రాజీ చేస్తున్నారన్నారు. అంతే కాకుండా స్థానిక న్యాయమూర్తులు కూడా ప్రతిరోజూ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్ నిర్వహించి కేసులను రాజీ చేస్తున్నారన్నారు. కాబట్టి కక్షిదారులు తమ కేసులను ఈ నెల 16న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో రాజీ చేసుకుని విలువైన కాలాన్ని, ధనాన్ని ఆదా చేసుకోవాల్సిందిగా న్యాయమూర్తి తెలియజేశారు. కక్షిదారులకు ఈ విషయాల పట్ల అవగాహన కల్పించి కేసుల సత్వర రాజీకి తమ వంతు సహకారం అందించవలసినదిగా న్యాయవాదులను, పోలీసు అధికారులను కోరారు.

➡️