వైట్‌ కాలర్‌ క్రిమినల్‌.. ప్రత్తిపాటి పుల్లారావు : మల్లెల రాజేష్‌

Mar 2,2024 15:32 #coments, #pattipati pullarao, #YCP

ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు) : తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు శాఖల మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైట్‌ కాలర్‌ క్రిమినల్‌గా అవతరించారని వైసిపి చిలకలూరిపేట నియోజవకర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్‌ నాయుడు విమర్శించారు. వైసిపి కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మల్లెల రాజేష్‌ నాయుడు ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు, టిడిపి నేతలు ప్రభుత్వంపై బురదజల్లి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రత్తిపాటి పుల్లారావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని హత్యా రాజకీయాలు, కుంభకోణాలకు పాల్పడిన మాట వాస్తవమేకదా అన్నారు. హత్యారాజకీయాలు, కుంభకోణాలకు పాల్పడి తామేదో సత్యహరిశ్చంద్రులమని.. నీతి, నిజాయతీ పరులమని రోడ్డెక్కి గగ్గోలు పెడితే భయపడేవారు ఎవరూ లేరని తెలుగుదేశం పార్టీ వారి చేష్టలు చూస్తున్న ప్రజలందరూ హేళన చేస్తున్నారన్నారు. ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో జరిగిన కుంభకోణాల్లో భారీ అవినీతి బయటపడింది కాబట్టే కేసు ఎప్పుడో నమోదైందన్నారు. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ), రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఏపీ డీఆర్‌ఐ) సోదాల్లో ఈ వ్యవహారం మొత్తం బయటకొచ్చిందన్నారు. అవెక్సా కార్పొరేషన్‌కు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం, విజయనగరం జిల్లా మానాపురం తదితర ప్రాంతాలలో బ్రాంచి కార్యాలయాలున్నాయని తెలిపారు. ఆ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టిందని, దేశవ్యాప్తంగా అక్రమంగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందిన కంపెనీలపై డీజీజీఐ విచారణ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు అవెక్సా కంపెనీ అక్రమంగా ఐటీసీ పొందిందని వెల్లడి కావడంతో ఆ కంపెనీకి డీజీజీఐ రూ.16 కోట్ల జరిమానా విధించిందని, అవినీతిని నిగ్గుతేల్చి అందులో ప్రమేయం ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువుల పేరుమీద బోగస్‌ కంపెనీలు సష్టించి ప్రణాళికాబద్ధంగా నల్లడబ్బును దారిమళ్లించి ప్రత్తిపాటి పుల్లారావు లబ్దిపొందారన్నారు. సీసీఐ తదితర కుంబకోణాలు కూడా పుల్లారావు మెడకు చుట్టుకున్నాయన్నారు ప్రత్తిపాటి పుల్లారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ లబ్ది, ఎన్నికల్లో సానుభూతికోసం అబద్ధాలను ప్రచారం చేసి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నారు. దిష్టిబొమ్మ దగ్దాలు చేయడం సిగ్గు చేటని అన్నారు. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడని.. సరైన సమయంలో తప్పకుండా బుద్ధి చెబుతాడని ప్రత్తిపాటిని హెచ్చరించారు. అధికారంలో ఉన్న మేము ఇబ్బంది పెట్టాలంటే ప్రత్తిపాటి పుల్లారావును నాలుగు సంవత్సరాలక్రితమే ఇబ్బంది పెట్టేవాళ్లమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ధర్యాప్తు సంస్థలు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి పూర్తి ఆధారాలతో చట్టపరమైన చర్యలకు పాల్పడ్డాయని వివరించారు. ప్రత్తిపాటి పుల్లారావు ఇకనుంచైనా తీరు మార్చుకోవాలని లేకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

➡️