గెలుపుపై ఎవరి ధీమా వారిదే

May 14,2024 22:18

ప్రజాశక్తి-పార్వతపురంరూరల్‌ : నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి అభ్యర్థులు విజయం తమదేనంటే కాదు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో 1,89,817 మంది ఓటర్లకు గాను రిటర్నింగ్‌ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు 78.23 శాతం అంటే 1,48,502 ఓట్లు పోలైనట్లు చెపుతున్నప్పటికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో సహా పూర్తి గణాంకాలు తెలియాల్సి ఉంది. మంగళవారం వైసిపి అభ్యర్థి, ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో పాటు టిడిపి అభ్యర్ధి బోనెల విజయచంద్ర క్యాంపు కార్యాలయాలకు నియోజవకర్గంలోని 233 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించిన ఏజెంట్లు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున హాజరై ఫారం-17సి ఫారాలను అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఎవరికి వారే ఎన్నికలపై సమాచారం అందిస్తూ పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయని, గెలుపు తమదేనంటూ ఇరువురు నాయకులకూ భరోసా కల్పిస్తున్నారు. దీంతో ఇరుపార్టీలకు చెందిన శిబిరాల్లో సందడి వాతావరణం నెలకొంది. బలిజిపేట, సీతానగరంతో పాటుగా పార్వతీపురం రూరల్‌, మున్సిపాలిటీల్లో కూటమిలోని జనసేన కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి టిడిపికి ఓట్లు ఎక్కువగా పడేలా కృషి చేయడం కనిపించింది. అలాగే వైసిపి కేడర్‌కూ అన్ని గ్రామాల్లో తమ అభ్యర్ధి విజయానికి అంకితభావంతో పనిచేసి ఓటర్లను బూత్‌లకు రప్పించడంలో విజయవంతమయ్యారు. అయితే టిడిపి పట్ల ప్రజలు ఆకర్షితులై, సైకిల్‌ హవా అన్ని మండలాల్లోనూ నడిచిందనే చర్చ కొనసాగుతుంది. పార్వతీపురం మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లోనూ టిడిపికి ఎక్కువ ఆదరణ లభించిందని చెబుతున్నారు. ఇరుపార్టీ నాయకులు ఓట్లు కొనుగోలు చేయడానికి విరివిగా డబ్బులు వెదజల్లినప్పటికీ వైసిపి నాయకులు నగదు పంపిణీ సక్రమంగా నిర్వహించలేదని, ఇచ్చిన డబ్బును నాయకులు, కౌన్సిలర్లు దిగమింగి, అక్కడక్కడా అంతంత మాత్రంగా పంచారని, దీనివల్ల పట్టణంతో పాటు మండలాల్లోని పలు గ్రామాల్లో నాయకులు నమ్మక ద్రోహానికి పాల్పడి, నగదు పంపిణీ సక్రమంగా జరగలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి వారి అనుయాయులు తీసుకెెళ్లడంతో ఆయన నాయకులపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గానికి అంతగా పరిచయం లేకపోయినా, సీనియర్‌ నాయకుల సహకారం లేకపోయినా టిడిపి అభ్యర్థి తనదైన శైలిలో వ్యూహాలను రచిస్తూ, కూటమిలోని నాయకులను, యువతను కలుపుకుని నియోజకవర్గంలో పార్టీ ఉనికిని నిలబెట్టారని టిడిపి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరువురు అభ్యర్థులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలింగ్‌ జరిగిన తీరును చూస్తుంటే ఫలితం టిడిపికి అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి.

➡️