కొత్తవారిని నియమిస్తారా? పాతవారిని కొనసాగిస్తారా?

Jun 18,2024 21:46

 ప్రజాశక్తి-సీతంపేట : ఆశ్రమ వసతి గృహాల్లోనూ, పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌లో ఎఎన్‌ఎం నియమాకాలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తొలి సంతకం పెట్టడం సంతోషకరమని పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ వసతి గృహాల గిరిజన సంక్షేమం రాష్ట్ర అధ్యక్షులు బిడ్డిక రామ్మోహన్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గిరిజన విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం చాలా సంతోషకరమన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ పోస్టులు భర్తీ కాలేదన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య కార్యకర్తలను నియమిస్తామని కొత్తగా బాధ్యతలు చేపట్టిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత మొదటి సంతకం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహిస్తూ ఆరోగ్య కార్యకర్తల నియామకానికి హామీ ఇవ్వడం పట్ల గిరిజన నాయకులు అభినంది స్తున్నారు. అయితే పాత వారినే కొనసాగిస్తారా లేదా కొత్త వారిని నియమిస్తారా అనే ప్రశ్న వినిపిస్తోంది. మంత్రి ప్రకటనతో గతంలో పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిలో ఆశలు చిగురించాయి. ఐటిడిఎల పరిధిలో పనిచేస్తున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉంటున్న గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశ్యంతో టిడిపి హయాంలో ఆదివాసీ ఆరోగ్యం పేరుతో థర్డ్‌ పార్టీ ద్వారా ఔట్‌ సోర్సింగ్‌పై ఆరోగ్య సిబ్బందిని నియమిం చారు. ఉమ్మడి జిల్లాల్లో ఐటిడిఎ పరిధిలో 55 ఆశ్రమ పాఠశాలలు, 17 కళాశాల వసతి గృహాలు ఉన్నాయి. వీటి పరిధిలో 163 మంది సిబ్బంది పని చేశారు. ఇందులో హెల్త్‌ కోఆర్డినేటరులు పది మంది, ఒక వైద్యాధికారి, ఆశ్రమ పాఠశాలల్లో 87 ఎఎన్‌ఎంలు, గురుకులంలో నలుగురు, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్లో 16, హాస్పిటల్లో 13, జెడ్‌పి పాఠశాలలో 43విధులు నిర్వహించేవారు. విద్యార్థికి అనారోగ్యం వాటిల్లితే వెంటనే వైద్యం అందించేవారు. సీరియస్‌ కేసులను పార్వతీపురం, విజయనగరం, విశాఖ వంటి దూర ప్రాంత ఆసుపత్రికి తరలిస్తే అక్కడ ఉన్న ఆరోగ్య సిబ్బంది విద్యార్థిని రిసీవ్‌ చేసుకుని ఉన్నత వైద్యం అందించేవారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లపాటు కొనసాగించి ఆ తర్వాత వీరిని విధుల నుంచి తొలగించింది. దీంతో విద్యార్థులకు వైద్య సేవలు సక్రమంగా అందకపోవడంతో ప్రతి ఏటా విద్యార్థుల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఆరోగ్య కార్యకర్తలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎన్నో సార్లు ఐటిడిఎ, కలెక్టరేట్‌, విజయవాడలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేసినా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ప్రస్తుతం వసతి గృహ సంరక్షకులు ఆరోగ్య కార్యకర్తలను నియమించి తమ జీతంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనైనా ఆశ్రమ పాఠశాలల్లో ఆదివాసీ ఆరోగ్య కార్యకర్తలను తిరిగి నియమించి విద్యార్థులకు స్థానికంగా వైద్యం అందిస్తే మరణాల నివారణకు అవకాశం ఉంటుందని గిరిజన సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

పాతవారినే కొనసాగించాలి

టిడిపి హయాంలో పనిచేసిన ఔట్సోర్సి ంగ్‌ ఆరోగ్య సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పించాలి. ఆరోగ్య సిబ్బందిని నియమిం చడం ద్వారా విద్యార్థులకు స్థానికంగా మెరుగైన వైద్యం అందించడానికి వీలుంటుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రకటనతో సాధ్యమై నంత త్వరగా ఆరోగ్య సిబ్బందిని నియమించాలి.

పల్లా సురేష్‌ , గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు

➡️