లిఫ్ట్‌ ఇరిగేషన్లను మూలన పడేసిన వైసిపి : పవన్‌

May 6,2024 00:50

ర్యాలీగా సభ వద్దకు వస్తున్న పవన్‌కల్యాణ్‌
ప్రజాశక్తి-పొన్నూరు/తెనాలిరూరల్‌ :
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. స్థానిక పొన్నూరు ఐలాండ్‌ సెంటర్‌లో వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభలో పవన్‌ పాల్గొన్నారు. భారీ ర్యాలీ మధ్య సభావేదికకు చేరుకున్న ఆయన మాట్లాడుతూ పొన్నూరు నియోజకవర్గంలో 12 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులుంటే ఏ ఒక్కటీ రైతులకు అందుబాటులో లేదని, కాల్వల పూడిక తీసిన దాఖలాల్లేవని అన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కేంద్రం అందించే తాగునీటి పనులు కూడా ప్రజలకు చేరువకాలేదన్నారు. అమెరికాలో ఉండి తెలుగును మాతృభాషగా చేసుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అని, ఎంతో మందికి ఉపాది కల్పించారన్నారు. నిశ్శబ్ధ విప్లవంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన పెమ్మసానిని, అలాగే పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండి ఏడో దఫా అసెంబ్లీకి పోటీ చేస్తున్న ధూళ్ళిపాళ్ళ నరేంద్రలను గెలిపించాలని కోరారు. డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేదన్నారు. పరిశ్రమలు, ఉద్యోగాలు జాడలేదని, పోలవరం అటకెక్కిందని, తాగునీరు లేదని, సామాన్యుడి భవిష్యత్‌కు భరోసా లేదన్నారు. కులాలను అడ్డుపెట్టుకుని నీచమైన రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. గుణం లేని పాలకులు కులం గొడుడు పడతారని మానవత్వం లేనివారు మతాల మధ్య చిచ్చుపెడతారన్నారు. అభివృద్ది కావాలో, అహంకార పాలన కావాలో ప్రజలు నిర్ణయించే సమయం ఆస్నమైందన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దూళిపాళ్ళ నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అరాచకాన్ని, దోపిడీని నిలువరించేందుకు వచ్చిన మహాశక్తి పవన్‌ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌ వైసిపి అరాచకపర్వానికి పరాకాష్టగా చెప్పారు. వైసిపి అరాచకాలను సమాధి చేసేందుకు ప్రజలు సిద్దం కావాలని, ఏడో సారి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న తనను, ఎంపీగా పోటీచేస్తున్న డాక్టర్‌ చంద్రశేఖర్‌ను ఆశీర్వదించాలని కోరారు. జనసేన నాయకులు, క్రికెటర్‌ అంబటి రాయుడు మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో అభివృద్దిని దిగజార్చి, యువతకు ఉపాది లేకుండా చేసిన వైసిపి ప్రభుత్వాని క్లీన్‌ బౌల్డ్‌ చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే కూటమిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వి.మార్కండేయబాబు, జిల్లా అధ్యక్షులు జి.వెంకటేశ్వరరావు, బిజేపి నాయకులు వనమా నరేంద్ర, వి.సుధాకర్‌, కూటమి పార్టీల నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పవన్‌ కల్యాణ్‌కు టిడిపి, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలకడంతోపాటు గజమాలలు వేశారు.

➡️