గవర్నర్ల ఒంటెత్తు పోకడలను అరికట్టాలి

Article 200

చట్టసభలు ఆమోదించిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్లు తొక్కిపట్టడం ద్వారా సమాఖ్యవాదం, ఎన్నికైన రాష్ట్రాల శాసనసభల అధికారాలు దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు అనుసరిస్తున్న అనేక మార్గాల్లో ఇదొకటి.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం, రాష్ట్రాల చట్టసభలు ఆమోదించిన బిల్లులు చట్టరూపం దాల్చాలంటే వాటికి గవర్నర్‌ ఆమోద ముద్ర వేయాల్సి వుంటుంది. రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం, చట్టసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్‌ తన ఆమోదం తెలియజేేయవచ్చు. లేదా అది ద్రవ్య బిల్లు కాకపోతే నిలుపు చేయవచ్చు. లేదా ఈ బిల్లు హైకోర్టు న్యాయ సమీక్ష అధికారానికి ముప్పు కలిగించేదిగా ఉందనో లేదా చిన్నబుచ్చుతోందనో అనుకుంటే ఆ ప్రతిపాదిత బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం కొంత కాలం నిలిపివుంచవచ్చు.
గవర్నర్‌ బిల్లుకు తన ఆమోదం తెలియచేయకుండా నిలుపు చేయాలనుకున్న పక్షంలో ఆ బిల్లును పున:పరిశీలించాలని అసెంబ్లీని కోరుతూ ఒక సందేశాన్ని జోడించి వెనక్కి పంపాలి. లేదా బిల్లుకు నిర్దిష్ట నిబంధనలు, సవరణలు ఏవైనా చేయాలనుకుంటే సూచించవచ్చు. ఒకవేళ ఆ బిల్లును అసెంబ్లీ తిరిగి పరిశీలించి మళ్ళీ ఆమోదించి పంపితే తన సమ్మతిని తెలపకుండా గవర్నరు ఇక ఎంతమాత్రం నిలుపుచేయరాదు. అంటే, దీనర్థం రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి అయిన గవర్నర్‌ ప్రజలచే ఎన్నికైన చట్టసభ పరిశీలించి తీసుకున్న నిర్ణయాన్ని తప్పనిసరిగా ఆమోదించాలి.
మోడీ ప్రభుత్వ హయాంలో, ప్రతిపక్ష ప్రభుత్వాలు వున్న రాష్ట్రాల్లో అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలియచేయకుండా గవర్నర్లు జాప్యం చేస్తూ మొత్తంగా రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తున్నారు. కేరళలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, అసెంబ్లీ ఆమోదించిన 8 బిల్లులను ఆమోదం తెలపకుండా తొక్కిపట్టారు. వాటిలో మూడు బిల్లులు రెండేళ్ళ నుండీ అలాగే పెండింగ్‌లో పడి ఉన్నాయి.. తమిళనాడులో, గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి 12 బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా నిలిపివుంచారు. పంజాబ్‌లో, గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏడు బిల్లులను తొక్కిపట్టారు. ఆమోదం తెలపకుండా అట్టిపెట్టుకున్న వాటిలో ప్రజారోగ్యం, వైస్‌ ఛాన్సలర్ల నియామక పద్ధతులు, ఉన్నత విద్య, లోకాయుక్త, సహకార సంఘాలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.
తొలుత గవర్నర్‌ నిష్క్రియాపరత్వంపై పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు దానినే అనుసరించాయి. ”చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్య సుపరిపాలనతో సహా మన రాజ్యాంగం మౌలిక సూత్రాలను, పునాదులను నాశనం చేసేలా గవర్నర్‌ వ్యవహార శైలి వుంది. బిల్లుల ద్వారా అమలు చేయాలని భావిస్తున్న సంక్షేమ చర్యలకు సంబంధించి ప్రజల హక్కులను హరించేలా వుంది.” అని స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో కేరళ ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఏ బిల్లునూ వీటో చేసేందుకు గవర్నర్‌కు ఎలాంటి విచక్షణాధికారాన్ని రాజ్యాంగం కల్పించలేదు. అయితే, బిల్లును ఆమోదించే విషయంలో గవర్నర్‌కు ఎలాంటి నిర్దిష్ట కాలపరిమితిని కూడా రాజ్యాంగంలోని 200వ అధికరణ విధించలేదు. ‘సాధ్యమైనంత త్వరగా’ అనే పదాలను మాత్రమే ఉపయోగించింది. కానీ, గవర్నరు ‘పాకెట్‌ వీటో’ (ఆమోదించడం కానీ, తిరస్కరించడం కానీ చేయకుండా అలా తొక్కిపట్టి ఉంచడం)ను ఉపయోగించి. బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారు.
గవర్నర్‌ పది బిల్లులకు ఆమోద ముద్ర వేయలేదంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలుత సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసింది. గవర్నర్‌ ఆమోదం కోరుతూ పంపిన బిల్లులను సాధ్యమైనంత త్వరగా వెనక్కి పంపాలని, అంతేకానీ, రాష్ట్రాల అసెంబ్లీలు నిరవధికంగా వేచి వుండేలా వాటిని ఊరికే పెండింగ్‌లో పెట్టవద్దని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహలతో కూడిన బెంచ్‌ ఏప్రిల్‌ 23న స్పష్టంగా ఆదేశించింది.
అయితే, సుప్రీంకోర్టు జారీ చేసిన ఈ ఆదేశాలు కేరళ, తమిళనాడు, పంజాబ్‌ గవర్నర్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపినట్లు కనిపించడం లేదు.
సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైన తర్వాత మాత్రమే గవర్నర్లు పని చేయడం ఆరంభించరాదని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను విచారించే సందర్భంగా నవంబరు 6వ తేదీన ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. తాము ఎన్నికైన ప్రజా ప్రతినిధులం కాదన్న వాస్తవాన్ని గవర్నర్లు మరిచిపోరాదని కూడా ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌ పిటిషన్‌తో పాటుగా కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లు కూడా నవంబరు 10న విచారించడానికి ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు.
రాజ్యాంగంలోని 200వ అధికరణ నిబంధనల ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఈ రాష్ట్రాల గవర్నర్లు నిరాకరించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్‌ నిరవధికంగా జాప్యం చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పించడం లేదు. పైగా ‘సాధ్యమైనంత త్వరగా’ అన్న పదం ఉపయోగించారంటేనే అనవసరమైన జాప్యం వుండకూడదన్నది స్పష్టమవుతోంది. వాస్తవానికి, 2020లో కేశం మేఘా చంద్ర సింగ్‌ కేసులో జస్టిస్‌ రోహింగ్టన్‌ నారిమన్‌ ఇచ్చిన తీర్పు ప్రకారం సహేతుకమైన సమయం అంటే మూడు మాసాలని పేర్కొన్నారు.
ఎన్నికైన ప్రజా ప్రతినిధి అధికారాలను గవర్నర్‌ ఉపయోగించలేరని, రాజ్యాంగం ప్రకారం ఈ విషయంలో ఆయనకు విచక్షణాధికారాలు లేవని సప్రీం కోర్టు ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై గవర్నర్‌ ఒక నిర్ణయం తీసుకోవడానికి సహేతుకమైన సమయం అంటే ఎంత అనేది నిర్వచించాల్సిన బాధ్యత సుప్రీం కోర్టుదే.
మోడీ ప్రభుత్వ హయాంలో ఎన్నికైన రాష్ట్ర అసెంబ్లీ అధికారాలను పట్టించుకోకుండా గవర్నర్లు యథేచ్ఛగా వ్యవహరించే పద్ధతికి ఇక స్వస్తి పలకాల్సి వుంది.
( ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

➡️