మోడీ మోతకు మరోవైపు నిజాలేంటి?

modi govt failures policies article telakapalli ravi

మొన్నటి శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత, బీహార్‌ యూ టర్న్‌ మాష్టర్‌ నితీశ్‌ కుమార్‌తో మళ్లీ కలిసిన తర్వాత బిజెపి నేతల హడావుడికి అంతే లేకుండా పోతున్నది. తెలుగునాట నితీశ్‌తో పోటీ పడదగిన ఒకే ఒక నాయకుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వంటివారు వారి పొత్తు కోసం పాకులాడటం దాన్ని మరింత పెంచింది. పార్లమెంటు చివరి సమావేశాలలో ప్రతిపక్షాలు లేవనెత్తిన కీలక సమస్యలపై సమగ్ర చర్చకు సిద్ధం కాలేకపో యారు గానీ 2024లో మళ్లీ గెలిచి 2028లో అవిశ్వాస తీర్మా నం ఎదుర్కొంటానని ప్రధాని మోడీ గొప్పలు పోయారు. ఈలోగా వివిధ మీడియా సంస్థలు ఒపీనియన్‌ పోల్స్‌, మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ సర్వేలు అంటూ మోడీ కీర్తనల్లో మునిగి తేలా యి. మోడీనే మరోసారి రాబోతున్నాడనీ, ‘ఇండియా’ వేదిక కూలిపోతున్నదనీ వీటి సారాంశంగా వుంది. అయితే మోడీ పాలన పీఠమైన ఢిల్లీ సరిహద్దులలో మాత్రం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి ప్రవాహంలా వచ్చిన రైతులను నిలవేసి వారి దారిలో ముళ్లు వేసి వారిపై బాష్పవాయు గోళాలు ప్రయోగించి నానా నిర్బంధానికి పాల్పడుతున్నారు. ఇవేవీ మోడియా దృష్టిలో పెద్ద విషయాలే కావు.

సుప్రీం షాకుల సంకేతం

అదే విధంగా అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడం కూడా పెద్ద విషయం కాలేకపోయింది! అక్రమ ధనంపై పోరాడే అపర విక్రమార్కుడిలా ఆకాశానికెత్తబడిన మోడీ మహాశ యుడు ఆ పేరుతో తీసుకొచ్చిన రెండు చర్యలు ఘోరంగా విఫలం కావడం సమస్య కాలేదు. నోట్ల రద్దు ప్రకటించిన పుడు నల్ల డబ్బు నివారణ అన్నారు గాని వాస్తవంలో దొంగ డబ్బు చట్టబద్దమై నోట్ల చలామణి పెరిగి సామాన్య వ్యాపారులే చితికిపోయారు. రాజకీయ పార్టీలకు రహస్య నిధులను అందజేయకుండా నిరోధించే పేరిట తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని స్వయానా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. పారదర్శకత పెంచుతామంటూ తెచ్చిన ఈ బాండ్లు వాస్తవంలో ఇచ్చేవారెవరో పుచ్చుకునేవారెవరో తెలియకుండా కార్పొరేట్లు కాషాయ దళాలకు నిధులు సమకూర్చే సదుపాయమైందనేది బహిరంగ రహస్యమే. దాన్ని కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ నిస్సిగ్గుగా సమర్థించారు. తీర్పు వచ్చాక కూడా ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆర్థికవేత్తలు స్వాగతించారు గాని బిజెపి ప్రతినిధి, మాజీ న్యాయమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వంటి వారు బాహాటంగా విభేదించారు. రాజ్యాంగ పరంగా అత్యున్నత న్యాయస్థానం గనక తీర్పును గౌరవిస్తాము గాని తమ చట్టం సరైందనన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన మొత్తం నిధులలో 90 శాతం బిజెపికే దక్కాయంటే దాని వెనక వ్యూహమేమిటో తెలుస్తుంది. ఇంత భారీ మొత్తాలు ఇచ్చిన వారు ఊరికే వదిలిపెడతారా? క్విడ్‌ ప్రోకో తరహాలో పనులు చేయించుకోవడానికే కదా అని సుప్రీంలో ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ప్రశ్నించారు. అయినా సరే, ఈ వైరుధ్యాన్ని మన మీడియాలో ఎక్కడా ప్రముఖంగా చెప్పకుండా మామూలు వార్తగా నివేదించడం విచిత్రమేమీ కాదు. టిడిపి అధ్యక్షుడు అచ్చెంనాయుడు కూడా వైసిపి కోణంలో తప్ప బిజెపి ప్రధానమని అనలేకపోయారు. వాస్తవానికి నోట్ల రద్దుపై కూడా సుప్రీం కోర్టు సాంకేతికంగా ఏమీ చేయలేమన్నది కానీ సమర్థించిందని చెప్పలేము. అవినీతిపై పోరాడే మహాయోధుడుగా కీర్తించబడుతున్న మోడీ వాస్తవంలో రహస్య లావాదేవీలను చట్టబద్దం చేయడానికే కారకులయ్యారని ఈ రెండు ఉదంతాలు స్పష్టం చేశాయి. రామమందిర ప్రాణప్రతిష్టను శంకరాచార్యులే తిరస్కరించారు. బిజెపి ఎం.పి బ్రిజ్‌భూషణ్‌ బాక్సింగ్‌ క్రీడాకారిణుల పట్ల తప్పుగా ప్రవర్తించారంటూ ఇదే సుప్రీంకోర్టు ఆయనపై వేటు వేసింది. బిల్కిస్‌ బానోపై అమానుషకాండ కేసులో నిందితులను అడ్డగోలుగా విడుదల చేయడాన్ని అభిశంసించింది. కేరళ, తమిళనాడు వేసిన కేసుల విచారణలో గవర్నర్ల పెత్తనాన్ని తప్పు పట్టింది. ఇవన్నీ కూడా కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానానికి మధ్య జరిగినవే. అయినా సరే మోడీని గానీ ఆయన పార్టీ బిజెపిని గానీ ఆక్షేపించేందుకు ఇవేవీ అక్కరకు రాలేదు.

ప్రజలు అది కూడా చెప్పారే?

మోడీ సర్కారు విజయాలకు తప్ప విమర్శలకు మన మీడియాలో ఫోకస్‌ వుండదు. రాష్ట్రాల స్థాయిలోనూ బిజెపికి అనుకూలంగా వుండే వారికే ఇతోధిక ప్రచారం. అయితే నిజాలు పూర్తిగా దాచడం కూడా కుదిరేపని కాదు. ఉదాహరణకు ఎంతో ప్రచారంలో పెట్టిన ‘మూడ్‌’ సర్వేలో కూడా బిజెపి పాలన నిజ స్వరూపాన్ని చెప్పే అనేక అంశాలు న్నాయి. విశ్వగురు ప్రపంచమంతా మనకేసి చూడటం వంట ివన్నీ నిరాధారమైన క్యాప్షన్లు మాత్రమే. ప్రధానిగా మోడీకి అనుకూలంగా సర్వే వచ్చిందన్నారు. కాని అందులోనే తర్వాత ఎవరనే ఓటింగు కూడా తీసుకున్నారు. 25 శాతం అమిత్‌ షాను, 19 శాతం యోగి ఆదిత్యనాథ్‌ను ఎన్నుకున్నారట, మోడీకి తిరుగులేదంటూనే వారసుడి గురించిన అభిప్రాయ సేకరణ దేనికి చేసినట్టు? మోడీని రాహుల్‌గాంధీని పోటీగా చూపితే సహజంగా మోడీ రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ మోడీ పాలనపై ఏమంటున్నారో తెలుసా! ఉదాహరణకు ఇదే ‘మూడ్‌’ సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని స్పష్టంగా చెప్పారు. వారిలోనూ 33 శాతం మంది తమ పరిస్థితి 2014 కన్నా (అంటే మోడీ రాకముందు కన్నా) అధ్వాన్నమైందన్నారు. మరో 29 శాతం మంది కటాకటిగా నెట్టుకొస్తున్నామన్నారు. ఈ రెండు రకాల స్పందనలు కలిపి చూస్తే 95 శాతం మంది ధరల దెబ్బతో తల్లడిల్లుతున్నారన్నమాట. ఇంత పెద్ద సంఖ్యలో స్పందన వచ్చిన ప్రశ్న ఈ సర్వేలో మరేదీ లేదు. ప్రస్తుత పరిస్థితి మాత్రమే గాక భవిష్యత్‌ గురించి కూడా చాలామందిలో పెద్ద అంచనాలు లేవు. ఎందుకంటే 66 శాతం మంది తమ ఆదాయాలు పెరుగుతాయనే ఆశ లేదన్నారు. 30 శాతం మంది ధరల కారణంగా తమ జీవన స్థితి ఇంకా క్షీణిస్తుందని భయపడుతున్నారు. ధరల నియంత్రణలో వైఫల్యమే మోడీ సర్కారు పెద్ద లోపమని ‘కోహర్ట్‌’ చేసిన సర్వేలో 26 శాతం మంది చెప్పారట. విశేషమేమంటే రిజర్వుబ్యాంకు వినియోగదారుల విశ్వాస స్థాయిపై ఫిబ్రవరి 8న విడుదల చేసిన సర్వే ఫలితాలలో కూడా 9.2 శాతం పెరుగుదలే కనిపించింది. ఆర్‌బిఐ అధికారి మైఖేల్‌ దేవవ్రత ఇదే విషయం వివరిస్తూ వినియోగదారులలో భవిష్యత్‌పై అవిశ్వాసమే ఎక్కువగా వుందన్నారు.

భారాల భారతం, కుబేరులకు సమర్పణం

నిరుద్యోగ సమస్య తీవ్ర సవాలుగా వుందని 71 శాతం మంది చెప్పారు. అందులోనూ 54 శాతం మంది చాలా తీవ్రంగా వుందన్నారు. ఈ సమస్య ఎంత తీవ్రంగా వుందంటే అయిదేళ్ల కిందటే 2019 లోనే కేంద్రం నిరుద్యోగం తాలూకూ డేటాను తొలగించేసింది. ఎన్నికల తర్వాతనే ఆ వివరాలు వెల్లడిస్తామన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా కేంద్ర గణాంక విభాగం నుంచి ఇద్దరు రాజీనామా చేశారు. అసలు ఉద్యోగాల భర్తీ అనే ప్రక్రియనే నిరవధికంగా నిలిపేశారు. ఒక తరం యువత కేవలం పోటీ పరీక్షలకు సిద్ధం కావడమే తప్ప పాల్గొనే అవకాశమే లేకుండా గడిపారు. వున్న ఉద్యోగాల నాణ్యత కూడా దారుణంగా పడిపోయింది. కనీసం సైన్యంలో చేరాలనుకుంటే అక్కడా అగ్నివీర్‌ పథకం వంటివే తప్ప దీర్ఘకాల నియామకాలు కరువైనాయి. 2020లో ఉద్యోగాలలో చేరే సగటు వయసు మాధ్యమం 32.4 ఏళ్లుగా తేలింది. ఇదే 1970లలో 17.3గా వుండేది. ఇందుకు కారణాలేమిటనే దానిపైనా ప్రజల్లో స్పష్టత వుందని సర్వే నిర్ధారిస్తున్నది. సమాధానాలు ఇచ్చినవారిలో 52 శాతం మోడీ విధానాలు బడా కార్పొరేట్లకు అనుకూలంగా వున్నట్టు చెప్పారు. రైతాంగానికి మేలు చేస్తున్నట్టు కేవలం 9 శాతం మాత్రమే భావించారు. ఇలాంటి స్పష్టత వారిలో వుంది గనకే ఢిల్లీ పొలిమేరలలో రైతుల పొలికేకలు ప్రతిధ్వనిస్తున్నాయి. అలాగే చిన్న వ్యాపారులకు కూడా ఇవి మేలు చేయడం లేదని తెలుసు గనకే కేవలం 11 శాతం మోడీకి అనుకూలంగా జవాబిచ్చారు. బడాబాబులకూ గరీబులకు మధ్య అంతరాలు మరింత పెరుగుతున్నాయని 45 శాతం మంది చెప్పారు. ఈ మేరకు ఇండియా రేటింగ్స్‌ రిసెర్చి సంస్థ చేసిన విశ్లేషణను కూడా ‘ఇండియా టుడే’ ఉటంకించింది. బడా కార్పొరేట్లు అందులోనూ అదానీ గ్రూపు గురించే ఈ కాలమంతా చర్చ జరిగిందని పేర్కొంది. బడా కార్పొరేట్ల మొత్తం లాభాల శాతం 2018-2022 మధ్య కాలంలో 144 శాతం పెరిగినట్టు ఆర్థికవేత్త వివేక్‌ కౌల్‌ సిఎంఐఇ నివేదికను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు. ఇదే కాలంలో మధ్య తరగతిపై పన్ను పెంచి కంపెనీలకు రాయితీలివ్వడం వల్ల పన్ను అనంతర లాభాలు 244 శాతం పెరిగాయని లెక్కలు తేల్చారు. కేవలం పెట్రోలు వంటి వాటినే పన్నులకు లక్ష్యంగా చేసుకుని అత్యధిక లాభార్జనాపరులను వదిలేయడం వల్ల సామాన్యులపై పన్ను భారం పెరిగి వినియోగం పెరుగుదల 2023లో అతి తక్కువగా వుండిపోయింది. కరోనా కాలంలో తప్ప ఎప్పుడూ లేనంత తక్కువగా కేవలం 4.4 శాతం మాత్రమే వుంది. ఈ విధంగా ప్రజల వినియోగశక్తి తగ్గడమంటే ఆర్థిక వ్యవస్థ ఉద్యోగాలు దైనందిన కార్యకలాపాలు స్తంభించడమే, ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ 57 శాతం ప్రజల వినియోగంపైనే ఆధారపడి వుంది. కనుక మహత్తర అభివృద్ధి కథ (గ్రోత్‌ స్టోరీ) వట్టి కల్పన మాత్రమే. ప్రస్తుత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం యుపిఎ హయాంపై శ్వేతపత్రం ప్రకటించడంలో దాగి వ్నున వ్యూహమదే. ఈ ప్రభుత్వ హయాంలో దేశం అప్పు కోటిన్నర కోట్లు పెరిగిందనేది తరచూ చెప్పుకుంటున్నదే గాని ధరలు, పన్నులు, నిరుద్యోగం వ్యవసాయ చిరు వ్యాపారాల వెనకబాటుపై కూడా ప్రజల మూడ్‌ వంటి వివరాలు విదితం చేస్తున్నాయి.

అటు ఇటూ చూడాల్సిందే!

రాజకీయంగా ప్రాంతీయ పార్టీలు అవకాశవాదంతో మోడీతో చేతులు కలపడానికి పాకులాడుతున్న మాట నిజమే. ‘చంద్రబాబు నాయుడు ఎందుకో ఈ మధ్య మా వైపు చూడటం లేదని’ సిపిఐ నాయకుడు రామకృష్ణ తాజాగా ఒక సభలో అన్నారు. కానీ బాబు బిజెపి కటాక్షం కోసం చూస్తున్నారనే వాస్తవం ఆయన అక్కడ చెప్పకపోయినా తెలియనిది కాదు. కాని పరిశీలకులెవరైనా ప్రత్యామ్నాయ వేదికల ప్రయత్నాలను, పోరాటాలను తక్కువగా చూడటం సరికాదు. సవాలు తీవ్రతను బట్టి ఈ ప్రయత్నాలను మరింత పెంచవలసి వుంటుంది. ఈ ప్రయత్నాలతో పాటు ప్రజల వాస్తవానుభవాలు కూడా అదే దిశలో వున్నాయని ‘మూడ్‌’ పరిశీలన చెబుతుంది. అది ఓటింగులో ప్రభావం చూపదని ఎవరు చెప్పగలరు? రామమందిరమే చాలని నమ్మితే మోడీ గాని బిజెపి గాని ఇన్ని తంటాలు పడటమెందుకు? 2028, 400 సీట్లు ఇలా ఎన్ని చెప్పుకున్నా వారి సవాళ్లు వారికి వున్నాయి. కనక నాణేనికి ఒకవైపునే చూడటం, చూపడం తప్పదవుతుంది. ఏ బాబులు ఎటు చూసినా జీవితానుభవాలు రాజకీయ వాస్తవాలే చరిత్రను నడిపిస్తాయి.

  • తెలకపల్లి రవి
➡️