మంటలు రాజేసేందుకే!

భిన్నత్వంలో ఏకత్వం కలిగిన లౌకిక భారతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వినాశకర పౌరసత్వ చట్ట సవరణ -2019ని ఎన్నికల ముంగిట మోడీ ప్రభుత్వం మళ్లీ ముందుకు తెచ్చింది. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం దేశ సమగ్రత, సమైక్యతకు గొడ్డలిపెట్టు. ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న యావతో వివాదాస్పద సిఎఎ అమలుకు అది తెగబడింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా 2019-20లో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వ రాక్షసత్వానికి దాదాపు వంద మంది బలయ్యారు. అప్పట్లో తాత్కాలికంగా వెనక్కితగ్గి… ఇన్నాళ్లూ కోల్డ్‌ స్టోరేజిలో పెట్టిన ఈ చట్టాన్ని ఎన్నికల ముంగిట అందునా రంజాన్‌ ఉపవాసాలు ప్రారంభమైన ముందురోజున నోటిఫై చేయడం దాని దుష్ట ఎజెండాలో భాగమే. విచ్ఛిన్నం చేసే మత విభజనను తెచ్చి రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం, కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ లాంటి అంశాలన్నీ పక్కనపెట్టి భావోద్వేగ అంశాలను, మతపరమైన అంశాలను రెచ్చగొట్టడం వల్లే ప్రయోజనం పొందాలనేది బిజెపి కుతంత్రం. 2019లో ఎన్నికల ముందు పుల్వామా, సర్జికల్‌ స్ట్రైక్స్‌, దేశభక్తి లాంటి అంశాలను ముందుకుతెచ్చినట్టే… ఇప్పుడూ సిఎఎ లాంటి అంశాలతో లబ్ధిపొందాలని ఆ పార్టీ చూస్తోంది.
పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 డిసెంబర్‌ 11న పార్లమెంట్‌లో ప్రతిపక్షాల బహిష్కరణ మధ్య అత్యంత అప్రజాస్వామిక రీతిలో ఆమోదింపజేసుకుంది. ఎన్‌డిఎ భాగస్వాములతోపాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల ఎంపిలు ఆనాడు దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ చట్టం ప్రకారం 2014 డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుండి మనదేశానికి వలస వచ్చిన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలకు భారత పౌరసత్వం ఇస్తారు. ఈ చట్టం అమలును జాతీయ పౌర పట్టిక ఏర్పాటుతో ముడిపెట్టడం ముస్లిం పౌరులను లక్ష్యంగా చేసుకునేందుకే. రాష్ట్రాల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారి గుర్తింపు, పేర్ల నమోదు క్రమం నుండి రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా చేయడం చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించింది. ఇది భారత ఫెడరల్‌ వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధం.
ఈ చట్టాన్ని మూడు దేశాలకే పరిమితం చేయడం, మతం ఆధారంగా తీసుకురావడం 1955లో తీసుకొచ్చిన సిఎఎ చట్టానికి, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం. రాజ్యాంగంలోని 19వ అధికరణం మతపరమైన స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ముస్లిములకు తప్ప ఇతరులకే పౌరసత్వం ఇస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? శ్రీలంకలో దశాబ్దాలుగా మతపరమైన హింసను ఎదుర్కొంటున్న శ్రీలంక హిందువులను ఎందుకు మినహాయించారు? తమిళుల పట్ల వివక్షా? ఇప్పుడు ముస్లిములను మినహాయించిన వారు తరువాత క్రైస్తవులను, ఇతర మైనార్టీలను మినహాయించరా? వంటి ప్రశ్నలనేకం.
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కులం, మతం, రంగు, జాతి, ప్రాంతం, భాష ఆధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండకూడదు. కాని సిఎఎ మత ప్రాతిపదికన వివక్ష పాటిస్తుంది కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ మౌలిక సూత్రాలను (బేసిక్‌ స్ట్రక్చర్‌ను) మార్చే అధికారం పార్లమెంట్‌కు కూడా లేదని కేశవానంద భారతి కేసు తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇవేవీ పట్టని మన పాలకులు మతాన్ని అడ్డగోలుగా రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో ‘జై భజరంగి’ అంటూ ఓట్లు వేయాలని ప్రధాని స్వయంగా పిలుపునిచ్చారు. ‘పాకిస్తాన్‌కు వెళ్లండి.. లేదా కబరిస్థాన్‌కు వెళ్లండి…’ అంటూ వీరంగం వేయడం, బుల్డోజర్లతో నివాసాలను కూల్చివేయడం.. కమలం పార్టీకి, ఆ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాలకు నిత్యకృత్యమే. 400 సీట్లు ఇవ్వండి… రాజ్యాంగాన్నే మార్చేస్తాం.. సెక్యులర్‌ దేశంగా భారత్‌ను ఉంచం అని బిజెపి ఎంపి అనంత హెగ్డే అన్నారు. సిఎఎను అమలు చేయబోమని ఇప్పటికే కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ప్రకటించగా, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. భిన్న మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులకు నియమైన మన దేశానికి ఈ చట్టం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మత మారణహోమాన్ని రగిలించే మతోన్మాద శక్తుల ఆట కట్టించేందుకు యావద్భారత జాతి ఐక్యంగా ముందుకు ఉరకాలి. సిఎఎను తిప్పికొట్టాలి.

➡️