యుద్ధాన్ని ఎగదోయొద్దు!

పశ్చిమాసియా నేడు పెను యుద్ధ విపత్తు అంచున ఉందన్నది నిజం. దీనికి అగ్గి రాజేసే పని చేయొద్దని పశ్చిమ దేశాల ప్రభుత్వాలు ఇజ్రాయిల్‌కు విజ్ఞప్తి చేశాయి. ఇటువంటి పైపై విజ్ఞప్తుల వల్ల ప్రయోజనం ఉండదు. దీనికి కచ్చితంగా అంగీకరించేలా యుద్ధోన్మాది నెతన్యాహు మెడలు వంచాలి. గత వారాంతంలో 300 డ్రోన్లు, క్షిపణులతో తమపై దాడి చేయడం ద్వారా ఇరాన్‌ కవ్వింపు చర్యకు పాల్పడిందని ఇజ్రాయిల్‌ నిందిస్తోంది. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇజ్రాయిల్‌ కాన్సులేట్‌ లో ఇద్దరు జనరల్స్‌తో సహా 13 మంది సైనిక అధికారులను, దౌత్యవేత్తలను వైమానిక దాడి ద్వారా చంపేసిన తన అరాచక చర్య గురించి ఇజ్రాయిల్‌ మాట్లాడదు. దానిని వెనకేసుకొస్తున్న అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇతర పశ్చిమ దేశాలు ఆ ఊసెత్తవు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం డమాస్కస్‌లో కాన్సులేట్‌పై దాడి ఇరాన్‌పై జరిగిన దాడే అవుతుంది. ఇజ్రాయిల్‌ సాగించిన అరాచక చర్యను మాటమాత్రంగా కూడా ఖండించని ఈ దేశాలు ఇరాన్‌ ప్రతీకార చర్యను మాత్రం వెంటనే ఖండించాయి. డమాస్కస్‌లో జరిగిన దాడిలో 13 మంది ఇరానీ అధికారులు మరణించారు. దౌత్య కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఇరాన్‌ ప్రతీకార చర్యలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ, విధ్వంసం కానీ చోటుచేసుకోలేదు. ఇరాన్‌ ఏదో అకస్మాత్తుగా తీసుకున్న చర్యకాదు ఇది. కొన్ని గంటల ముందే నోటీసు ఇచ్చింది. తన డ్రోన్లను ఇజ్రాయిల్‌ నిర్వీర్యం చేస్తుందని తెలుసు. ప్రతీకార చర్య తరువాత కాన్సులేట్‌పై దాడికి వన్‌టైమ్‌ పనిష్మెంట్‌ పూర్తయిందని, దీనిపై గనుక ఇజ్రాయిల్‌ మళ్లీ దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇరాన్‌ను ముగ్గులోకి లాగడం ద్వారా దీనిని ప్రాంతీయ యుద్ధంగా మార్చాలని ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే డమాస్కస్‌లో కాన్సులేట్‌పై దాడి చేసింది. ఇరాన్‌ను దుష్ట రాజ్యంగా పశ్చిమ దేశాలు చిత్రిస్తున్నాయి నిజానికి ఈ ప్రాంతంలో దుష్ట రాజ్యం ఏదైనా ఉన్నదీ అంటే అది ఇజ్రాయిలే. ఇరాన్‌ డ్రోన్‌ దాడిని ఇజ్రాయిల్‌తోబాటు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ అడ్డుకున్నాయని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ కెమరాన్‌ గొప్పగా చెప్పుకున్నారు. ఇజ్రాయిల్‌కు పలు అంచెల భద్రత కల్పిస్తున్న ఈ దేశాలు గాజాలో ప్రజలను రక్షించడానికి ఎలాంటి రక్షణ ఎందుకు కల్పించలేదు? పశ్చిమ దేశాల కపట వైఖరికి ఇదొక నిదర్శనం.
లెబనాన్‌, సిరియా, ఇరాక్‌లపై పలుమార్లు దాడులు చేసి, ఇరాన్‌ను రెచ్చగొట్టి, మధ్య ప్రాచ్యంలో సంఘర్షణలను పెంచడం ద్వారా అమెరికా, పశ్చిమ దేశాల నుంచి మరింత సాయం పొందడం, దేశీయంగా తన అధికారం కొనసాగించుకోవడం లక్ష్యంగా నెతన్యాహు ఎత్తులు వేస్తున్నాడు. యుద్ధం ఆగితే నెతన్యాహు నేతృత్వంలోని మితవాద సంకీర్ణాన్ని గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్న ఇజ్రాయిలీలు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారు. అమాయకులను ఊచకోత కోయడం మినహా, బందీలందరినీ విడిపిస్తానని, హమాస్‌ నాయకత్వాన్ని నాశనం చేస్తానని పెట్టుకున్న యుద్ధ లక్ష్యాలేవీ నెరవేర్చలేదని, దేశాన్ని అప్రతిష్టపాల్జేస్తున్నారన్న ఆగ్రహం ఇజ్రాయిలీయుల్లో వ్యక్తమవుతోంది.
రంజాన్‌ సందర్భంగానైనా గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐరాస భద్రతా మండలి అత్యధిక మెజారిటీతో తీర్మానం చేసినప్పటికీ, ఇజ్రాయిల్‌ తన దాడులను తీవ్రతరం చేసింది. అమెరికా ఓటింగ్‌కు దూరం గా ఉండి, తీర్మానం ఆమోదానికి అనుమతించినా ఇజ్రాయిల్‌ తీరులో మార్పులేకపోవడం అమెరికా, పశ్చిమ దేశాల గుడ్డి మద్దతు ఫలితమే. నెతన్యాహు యుద్ధ నేరాలపై లాటిన్‌ అమెరికా దేశమైన నికరాగ్వా ఐసిసి బోనులో నిలబెట్టినా, పశ్చిమ దేశాల ఒత్తిళ్లతో శిక్షించలేని దుస్థితిలో ఉంది.
దౌత్యపరంగా తటస్థం అంటూనే పెగాసస్‌ తదితర స్పైవేర్లతో ఇజ్రాయిల్‌తో అల్లుకున్న మితవాద బంధాన్ని మోడీ సర్కారు కొనసాగిస్తోంది. ఇంత చేస్తున్నా ఇరాన్‌ సంయమనం పాటిస్తూనే… ఇజ్రాయిల్‌ నౌకలో ఉన్న భారతీయులు 17 మందిని కలుసుకోవడానికి అనుమతించింది. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి వస్తున్న పాలస్తీనా అనుకూల వైఖరిని విడనాడడం ద్వారా యూదు దురహంకారానికి మద్దతు ఇవ్వడం దేశానికి ప్రమాదకరం. నౌకలో ఉన్న వారిని త్వరగా స్వదేశాలకు తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. అమెరికా తొత్తుగా మారకుండా స్వతంత్రవైఖరిని తీసుకోవాలి. పాలస్తీనాపై దాష్టీకానికి ఇప్పటికైనా ముగింపు పలకాలి. పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్‌కు ఆయుధాలు అందించడం మానాలి.

➡️