తొలిసారి ఓటేస్తున్నారా..?

ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు
  • అయితే ఇవి తెలుసుకోండి..!

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు వచ్చే అతిపెద్ద పండగ ఓటు. అటువంటి పండగలో ఓటు హక్కును విధిగా వినియోగించుకోవడం పౌరునిగా మన కర్తవ్యం. తొలిసారి ఓటు వేసే వారికి ఈ ప్రక్రియ పూర్తిగా కొత్త. మీట నొక్కడమే కాదు, ఓటు ఎవరికి పడిందో నిర్ధారించుకునే హక్కు కూడా ఓటరుగా మన బాధ్యత. ఇంతకీ ఇవిఎంలో ఓటు ఎలా పడుతుందో, ఆ విధానమమేంటో ఇప్పుడు చూద్దామా…?. ఓటు వేసే ముందు పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించాక ఏం చేయాలో తెలుసుకుందామా..?. ఓటరు చీటీ, ఏదైనా గుర్తింపు కార్డుతో పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించాక, మొదట పోలింగ్‌ అధికారి-1 వద్దకు వెళ్లాలి. ఓటరు వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న ఓటర్ల జాబితాలో పరిశీలిస్తారు. ఓటరు పేరు, జాబితాలో వరుస సంఖ్యను బిగ్గరగా చదువుతారు. ఆ కేంద్రంలో పార్టీల వారీగా ఉన్న పోలింగ్‌ ఏజెంట్లు ఆ ఓటరు పేరు, నంబరును తమ వద్ద ఉన్న ఓటరు జాబితాలో సరిచూసుకుంటారు.అనంతరం పోలింగ్‌ అధికారి-2 వద్దకు ఓటరు వెళ్లాలి. అతని వద్ద ఉన్న స్లిప్పులోని వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న రిజిస్టర్‌లో సరిచూసుకుని, సంతకం తీసుకుంటారు. ఒకవేళ ఓటరు నిరక్షరాస్యులైతే వేలిముద్ర తీసుకుంటారు. ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఓటర్లకు ఎన్నికల అధికారులు రెండు వేర్వేరు రంగుల స్లిప్పులు ఇస్తారు. వాటి ఆధారంగా రెండు బ్యాలెట్‌ యూనిట్లలో వారు ఓటు హక్కును వినియోగించుకుంటారు.అక్కడ్నుంచి పోలింగ్‌ అధికారి-3 వద్దకు వెళ్లాలి. ఆ అధికారి ఓటరు వద్ద ఉన్న చీటీని పరిశీలిస్తారు. తన వద్ద ఉన్న కంట్రోల్‌ యూనిట్‌లో మీట నొక్కి, ఓటును విడుదల చేస్తారు. (ఓటు రిలీజ్‌ చేయకముందు కంట్రోల్‌ యూనిట్‌పై ఎడమవైపు ఆకుపచ్చ రంగు ఎల్‌ఇడి బల్బు వెలుగుతూ ఉంటుంది. ఓటు రిలీజ్‌ చేశాక కుడివైపు రెడ్‌ లైట్‌ వెలుగుతుంది. దీన్ని ఓటరు చూడవచ్చు.)ఇవిఎంలో ఓటు ఎలా పడుతుందంటే…ఆ తర్వాత బ్యాలెట్‌ యూనిట్‌ వద్దకు ఓటరు వెళ్లాలి. ఈ యూనిట్‌ పైభాగంలో ఆకుపచ్చని ఎల్‌ఇడి బల్బు వెలుగుతూ ఉంటుంది. బ్యాలెట్‌ యూనిట్‌పై అతికించిన బ్యాలెట్‌ కాగితంపై తాను ఓటు వేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థి పేరు పక్కనే ఉన్న మీటను నొక్కాల్సి ఉంటుంది. మీటను నొక్కగానే, దాని పక్కనే ఉన్న బాణం గుర్తులో రెడ్‌ కలర్‌ లైటు వెలుగుతుంది. బీప్‌ సౌండ్‌ వస్తుంది. బ్యాలెట్‌ యూనిట్‌పై ఉన్న గ్రీన్‌ కలర్‌ లైటు ఆగిపోతుంది. బ్యాలెట్‌ యూనిట్‌పై సమీపంలోనే ఉన్న వివి ప్యాట్‌ యంత్రంలో ఒక స్లిప్‌ కనిపిస్తుంది. అందులో ఓటరు ఓటు వేసిన పార్టీ సింబల్‌, అభ్యర్థి పేరు కనిపిస్తాయి. ఈ చీటీ ఏడు క్షణాల పాటు కనిపిస్తుంది. ఆ తర్వాత దానికి అమర్చిన డబ్బాలో పడిపోతుంది. దాన్ని పరిశీలించి, తాను వేసిన ఓటు సరిగ్గా పడిందా, లేదా అన్నది ఓటరు నిర్ధారించుకోవచ్చు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రెండు బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేర్వేరుగా ఓటు వేయాల్సి ఉంటుంది.

➡️