‘ఎవల్యూషన్‌ డే’ తప్పక జరుపుకోవాలి !

చార్లెస్‌ డార్విన్‌ తన జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రకటించిన రోజు 1859 నవంబర్‌ 24. ఈ ఆధునిక వైజ్ఞానిక కాలానికి ఆ సిద్ధాంతం ఎంత ముఖ్యమో గ్రహించడానికి, ఆ శాస్త్రవేత్త మీద ఉన్న గౌరవం ప్రకటించుకోవడానికి 24 నవంబర్‌ను ‘ఎవల్యూషన్‌ డే’గా ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటున్నాయి. దీన్ని పెద్ద ఎత్తున మన దేశంలో కూడా జరపడం చాలా అవసరం. ఎందుకంటే వైజ్ఞానిక దృక్పథం దేశంలో బలపడాలని చెప్పిన భారత తొలి ప్రధాని నెహ్రూ స్థాయిని తగ్గించాలని ప్రయత్నిస్తున్న-ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ చర్యల్ని తిప్పికొట్టడానికి సామాన్య ప్రజలు వివేకవంతులై ఇలాంటి వైజ్ఞానిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పనిసరి! జీవ పరిణామ సిద్ధాంతం (థీరీ ఆఫ్‌ ఎవల్యూషన్‌) పనికిరానిదని ప్రభుత్వం-సిలబస్‌ నుండి తొలగిస్తోంది. భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని ప్రవేశపెడతామంటోంది. ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే, ప్రగతిశీల భావాలు గల వారంతా వైజ్ఞానిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలి.
ఈ విషయాల్లో మన దేశ పరిస్థితులు మరీ దిగదుడుపుగా ఉన్నాయి. మతపరమైన పండుగలకు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవులిస్తూ అర్థరహితమైన పండుగల్ని ప్రభుత్వాలు ప్రమోట్‌ చేస్తున్నాయి. దేవుళ్ల శోభాయాత్రల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం లభిస్తోంది. వివేకవంతమైన, అర్థవంతమైన వైజ్ఞానిక కార్యక్రమాలు విద్యాసంస్థల్లో గానీ, పౌర సమాజాల్లో గానీ, కుటుంబాల్లో గానీ ఏ ఒక్కటైనా నిర్వహిస్తున్నారా? లేదు కదా? అందుకే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సైన్సు కార్యకర్తలు, బాధ్యతగల పౌరులు, వివేకవంతమైన అధికారులు, మరీ ముఖ్యంగా మహిళలు పూనుకుని-దేశంలో కొనసాగుతున్న విషమ పరిస్థితులను అర్థం చేసుకుని, ఎక్కడికక్కడ ఎవరికివారు వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలి. ఉట్టి ఆలోచనలతో పని జరగదు. వాటిని ఆచరణలో పెట్టాలి. విద్యాసంస్థల్లో పనిచేసే వారిపై బాధ్యత మారింతగా ఉంది. విద్యార్థులకు జీవ పరిణామంపై, డార్విన్‌పై, సందర్భాన్ని బట్టి ఇంకా అనేక వైజ్ఞానిక అంశాలపై వ్యాస రచన/ఉపన్యాస పోటీలు పెడుతూ వారిలో వైజ్ఞానిక జిజ్ఞాస పెంచాలి. వారిని హేతుబద్దంగా ఆలోచింపజేయాలి. మానవ వాదులుగా తీర్చిదిద్దుకోవాలి.
ఎవరి వ్యక్తిగత విశ్వాసాలనో దెబ్బ తీయాలని మనం అనుకోవడం లేదు. అవి వాటి పరిధిలో అవి ఉంటే సంతోషిద్దాం-అంతే! మత విశ్వాసాలెప్పుడూ వ్యక్తిగత స్థాయిలో ఉండాలి. అంతేగాని, వికృతంగా సమాజ స్వరూపాన్ని మార్చేంత దుర్మార్గంగా ఉండకూడదు. అయితే, మత విశ్వాసకులతో ప్రపంచం ప్రగతి పథాన నడవలేదని మాత్రం ఖచ్చితంగా చెబుదాం !
చంద్రయాన్‌-3 విజయవంతమైందని, అందుకు కారణం తనే అన్నట్టు అనవసరంగా అసందర్భంగా ఆన్‌లైన్‌లో దేశ ప్రజలకు కనబడి, భారతీయ మువ్వన్నెల జెండా ఊపిన నేటి ప్రధాని మోడీ చేసిన నిర్వాకం ఈ దేశ ప్రజలు గ్రహించాలి. ఇస్రో శాస్త్రవేత్తల జీతాల్లో కోతలు విధించడం గురించి-ఇస్రోకు ముడిసరుకు అందించిన వేల మంది సాంకేతిక నిపుణులకు, కార్మికులకు జీతాలివ్వకపోవడం గురించి-ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలి. వారంతా పొట్ట పోసుకోవడానికి రోడ్ల మీద టీలు, టిఫిన్లు అమ్ముకోవడం, బయట మెకానిక్‌లుగా, డ్రైవర్లుగా పని చేయడం గురించి-ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలి. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని శ్లాఘించకుండా, దాన్ని తన ఎలక్షన్‌ ఎజెండాలో చేర్చుకోవడం గురించి-ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలి. పైగా, పురాతన భారతీయ విమానయాన శాస్త్రంలో ఇవన్నీ రాసిపెట్టే ఉన్నాయని అబద్దాలు ప్రచారం చేసుకుంటూ ఉండడం గురించి-ఈ దేశ ప్రజలు తప్పక తెలుసుకోవాలి. ఈ విషమ పరిస్థితుల్లోంచి బయటపడే మార్గాల్ని అన్వేషించుకోవాలి. రాబోయే కాలాలలో విద్యావంతులతో ముఖ్యంగా వైజ్ఞానిక పిపాస గల వివేకవంతులతో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసుకునే విధంగా చూసుకోవాలి.
‘నిన్ను నువ్వు తెలుసుకో’-అని లేని దేవుణ్ణి ధ్యానిస్తూ కళ్లు మూసుకోవడం కాదు. నువ్వెవరు? ఎన్ని పరిణామాలు జరిగి, నువ్వు ఇలా మారావు-అన్నది తెలుసుకుంటే-నీ కళ్లు తెరుచుకుంటాయి! ఎన్నెన్ని మానవ జాతులు ఉద్భవించి అంతరించాయి. ఎన్ని వలసల తర్వాత నీ జాతి ఇప్పుడు నువ్వున్న ప్రాంతానికి చేరింది వంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే, తప్పదు-జీవ పరిణామం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ భగవంతుడి సృష్టిలో నీ పుట్టుక ఒక భాగమని నువ్వింకా భావిస్తూ ఉంటే గనక, నీ మెదడులోని చీకటి తొలగిపోలేదని అర్థం. చీకట్లోనే జీవితం బాగుందనుకునే వారితో మనకు పేచీ లేదు. జీవితంలో వెలుగులు కావాలనుకునే వారు తప్పక వైజ్ఞానిక స్పృహ పెంచుకుంటారు. జీవ పరిణామం గురించి తెలుసుకుంటారు. మత మౌఢ్యాన్ని చావుదెబ్బ తీసిన డార్విన్‌ పరిణామ సిద్ధాంతం వెలువడిన ఆ రోజును గుర్తు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ‘ఎవల్యూషన్‌ డే’ జరుపుకుంటారు.
ఎక్కడి పాట అక్కడ పాడడం. అధికారం కోసం నానా గడ్డి కరవడం రాజకీయ నాయకులకు అలవాటు. శాస్త్రవేత్తలు అలా చేయరు. ఒక నిబద్దతతో, నిజాయుతీగా, నిజాల్ని మాత్రమే వెల్లడిస్తారు. అలాంటి వారిలో మహోన్నతుడు చార్లెస్‌ డార్విన్‌! ఆయన మతాలకున్న విలువను తగ్గించాలనుకోలేదు. మూఢ నమ్మకాల్ని నిర్మూలించగలననీ కూడా అనుకోలేదు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతమే కాలక్రమంలో ఆ పనులు చేస్తూ వచ్చింది. అందుకే సంప్రదాయ వాదులకు డార్విన్‌ అన్నా, డార్విన్‌ సిద్ధాంతమన్నా పడదు. వారు సృష్టి/దైవ సిద్ధాంతం కావాలనుకుంటారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నవారి పాలసీ కూడా అదే! సిలబస్‌ నుండి ‘ఎవల్యూషన్‌’ చాప్టర్‌ తొలగిస్తున్నారని తెలియగానే, హైదరాబాద్‌లో పెద్దపెద్ద విద్యాసంస్థల్లో జెవివి వారు ‘ఎవల్యూషన్‌’ మీద నా లెక్చర్లు ఏర్పాటు చేశారు. నేను కూడా సంతోషంగా వెళ్ళి ఉపన్యసించి వచ్చాను. సిలబస్‌ నుండి తీసివేయగానే పిల్లలు ఇక ఏ రకంగానూ నేర్చుకోలేరన్న భ్రమలో ప్రభుత్వం వారుంటే- ఉండనివ్వండి. బాధ్యత గల పౌరులుగా మన పిల్లలకు మనం, ఏం నేర్పుకోవాలో మనకు తెలుసు కదా? ప్రభుత్వాలు తాత్కాలికం- వైజ్ఞానిక స్పృహే శాశ్వతం! అందువల్ల మనం, వీలైనన్ని ఎక్కువగా వైజ్ఞానిక కార్యక్రమాలు అన్ని స్థాయిల్లో నిర్వహించుకుంటూనే ఉండాలి.

(వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌) (మెల్బోర్న్‌ నుంచి)
డా|| దేవరాజు మహారాజు

➡️