నైజీరియాలో ఆహారం కోసం అల్లర్లు

May 2,2024 08:05 #edit page, #Food riots, #Nigeria

నైజీరియా! ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం. పశ్చిమ ఆఫ్రికా తీరంలో చమురు సంపన్న దేశం. అలాంటిది తీవ్ర ఆహార కొరత కారణంగా అశాంతితో అల్లాడిపోతోంది. దేశ వాణిజ్య రాజధాని లాగోస్‌, రాజకీయ రాజధాని అబుజాతో సహా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దేశవ్యాప్తంగా ఆహారం కోసం ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. గోడౌన్లు, హోల్‌సేల్‌ సెంటర్లు, సూపర్‌ మార్కెట్లే కాకుండా ఆహార ధాన్యాలను తరలించే ట్రక్కులను కూడా లూటీ చేస్తున్నారు. మరోవైపు ప్రెసిడెంట్‌ బోలా అహ్మద్‌ టినుబు ప్రభుత్వం దీనిని శాంతిభద్రతల సమస్యగా భావించి…పోలీసులను, సైన్యాన్ని మోహరించి పరిస్థితిని అదుపు చేయాలని చూస్తోంది.
గిడ్డంగులకు ఆహారధాన్యాల లోడ్లు వచ్చినప్పుడు… పగలైనా, రాత్రయినా జనం భారీ సంఖ్యలో గుమిగూడసాగారు. ఈ గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించినా ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. లాఠీ ఛార్జి చేసినా ఫలితం వుడడంలేదు. ఇలా వుండగా జనం రాళ్లు రువ్వి పోలీసులను వెంబడించారన్న ప్రత్యక్ష సాక్షుల మాటలను మీడియా ఉటంకిస్తున్నది. కొన్ని చోట్ల సైన్యం కాల్పులు జరిపినప్పటికీ ఆగ్రహించిన గుంపు చెదరకపోగా ట్రక్కుల్లోని ఆహార ధాన్యాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. నైజీరియాలో ఆకలితో నకనక లాడుతున్న వారి ముందు…బాష్పవాయువు, లాఠీలు, బుల్లెట్లు ఏవీ పనిచేయడం లేదు.
2023 మొదటి త్రైమాసికంలో, 6.6 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతతో ఇబ్బందులు పడ్డారు. 2024 మొదటి త్రైమాసికం నాటికి, ఈ అన్నార్తుల సంఖ్య 10 కోట్ల పైకి చేరుకుంది. అంటే, నైజీరియా మొత్తం జనాభాలో దాదాపు 45 శాతం మంది తీవ్ర ఆహార కొరతలో వున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం నివేదిక ప్రకారం, ఆ దేశంలో 1.86 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆకలితో ఉన్నారు. మరో 4.37 కోట్ల మంది తీవ్రమైన ఆకలి అంచున ఉన్నారు. కాగా, ఆహార ధాన్యాల ధరలు అంతకంతకు పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తు న్నాయి. ద్రవ్యోల్బణం రేటు ఈ ఫిబ్రవరిలో 39 శాతం వుండగా ఫిబ్రవరి 2023లో 25 శాతం వుంది. కేవలం ఒక్క సంవత్సరంలోనే 14 శాతం పెరుగుదల వుంది.
ఐ.ఎం.ఎఫ్‌ 1990 ప్రారంభం నుంచి అనుసరించిన నయా ఉదారవాద విధానాలు ఈ పరిస్థితికి దారితీశాయి. నైజీరియాలో 40 శాతానికి పైగా భూమి వ్యవసాయ యోగ్యమైనది. సారవంతమైనది కూడా. జనాభాలో 70 శాతానికి పైగా పని చేసే వయస్సు గల యువత. ఐ.ఎం.ఎఫ్‌, ప్రపంచ బ్యాంకు నేతృత్వంలోని నయా ఉదారవాద విధానాలను గుడ్డిగా అమలు చేసినందుకు పర్యవసానంగా ఈ దేశం తీవ్రమైన ఆహార కొరత కోరల్లో చిక్కుకుంది. వ్యవసాయోత్పత్తిని, ముఖ్యంగా ఆహారధాన్యా లను పెంచడం ద్వారా ఆహార స్వయంసమృద్ధిని సాధించడానికి బదులుగా అంతర్జాతీయ మార్కెట్‌ నుండి దిగుమతులపై ఆధారపడటం ప్రస్తుత సంక్షోభానికి కారణం.
ఐ.ఎం.ఎఫ్‌ సలహా మేరకు 2023 మే మాసంలో టినుబు ప్రభుత్వం ఇంధన సబ్సిడీని పూర్తిగా తొలగించి వేసింది. దీంతో దేశీయ ఆహార పదార్థాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడింది. ఆ తరువాత, నైజీరియన్‌ కరెన్సీ ‘నైరా’ విలువ 2023 జూన్‌లో సరళీకృతం చేయబడింది. ఫలితంగా ‘నైరా’ మారకం విలువ పతనమైంది. దీంతో దిగుమతులపై ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. టినుబు ప్రభుత్వం దిగుమతులను తగ్గించడమే పరిష్కారంగా భావించింది. అదే దేశాన్ని తీవ్ర ఆహార కొరతలోకి, ఆపై అల్లర్లలోకి నెట్టింది.
ఫిబ్రవరి ప్రారంభం నుండి, ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించారు. ఫిబ్రవరి 5న, నైజర్‌ రాష్ట్ర రాజధాని మిన్నాలో మహిళలు ఆహార కొరతను నిరసిస్తూ ప్రధాన రహదారిని అడ్డుకున్నారు. ఈ నిరసనలో ముందు వరుసలో వున్న 25 మంది మహిళలను అరెస్టు చేయడంతో, ఆందోళన ఇతర నగరాలకు కూడా వ్యాపించింది. ఫిబ్రవరి 21న, చేపల ధరల పెరుగుదలను నిరసిస్తూ, నైజర్‌ స్టేట్‌ లోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన సులేజాలో రద్దీగా ఉండే అబుజా-సులేజా-కడునా రహదారిని ఆగ్రహించిన యువకులు దిగ్బంధించారు. తరువాత ఫిబ్రవరి 27న, వేలాది మంది కార్మికులు, విద్యార్థులు, చిన్న దుకాణాల యజమానులు వీధుల్లోకి రావడం కనిపించింది.
ఆకాశాన్నంటుతున్న ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా ‘నైజీరియన్‌ లేబర్‌ కాంగ్రెస్‌’ (ఎన్‌.ఎల్‌.సి) దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ప్రకటించినప్పుడు సమ్మె సరైన దిశను తీసుకుంది. నైజీరియాలో తాము సమ్మెకు దిగాల్సిన పరిస్థితి గురించి ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ నాయకుడు జో అజైరో మాట్లాడుతూ, ”ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారి జీతాలతో రోజుకు మూడు పూటలూ తినలేని పరిస్థితి వుంద”న్నాడు. కార్మికులు రోడ్లపై బైఠాయిస్తున్నారు. సంఘటిత కార్మికుల నోళ్లు మూయిస్తే ప్రజలు వీధిన పడకుండా అడ్డుకోగలమని పాలకులు భావిస్తున్నారని ఎన్‌.ఎల్‌.సి చైర్‌పర్సన్‌ యూసుఫ్‌ అంటున్నాడు. రెండు నెలలకు పైగా గడిచినా ఆందోళన ఇంకా కొనసాగుతోంది. నిరసనలు తెలియచేయడాన్ని నేరపూరితంగా మార్చకుండా చూసేందుకు సంఘటిత కార్మిక ఉద్యమం ముందుకు వచ్చింది.

/’థాట్‌ వీక్లీ’ సౌజన్యంతో/

ఆర్య జినదేవన్‌

➡️