మనువాద మస్తిష్కం!

ఒక దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వయానా ఆ దేశాధ్యక్షులు అందజేస్తున్నప్పుడు పక్కనే వున్న వారంతా లేచి నిలబడటం కనీస మర్యాద. ఆ సంప్రదాయం సైతం పదేళ్లపాటు ప్రధానిగా పదవి వెలగబెట్టిన నేతకు తెలియదా అని ప్రపంచం ఎద్దేవా చేస్తోంది. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని 96 ఏళ్ల ఎల్‌కె అద్వానీకి ఆయన నివాసంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆయన… ఆ వయసులో లేచి నిలబడలేకపోవచ్చు. అవార్డు అందజేస్తున్నప్పుడు, ఆ తరువాత ఫొటో తీస్తున్నప్పుడు అద్వానీ పక్కనే ఆశీనులై ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కనీసం లేచి నిలబడలేదు. దేశ ప్రథమ పౌరురాలి పట్ల ప్రధాని తీరు అధ్యక్ష పదవిని, యావత్‌ మహిళలను, ఆదివాసీలను అవమానించడమే. ఆదివాసీ అంటే అంత చులకనా? రాష్ట్రపతి పదవి అంటే అంత లెక్కలేనితనమా? ప్రజాస్వామ్యమంటే అంత ఖాతరులేనితనమా? మనుస్మృతి నిచ్చెనమెట్ల వ్యవస్థలో దిగువున ఉన్న వారి పట్ల తృణీకార ధోరణా?
అంతకుముందు రోజే రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న ప్రకటించిన వారి వారసులకు రాష్ట్రపతి ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. అనారోగ్య కారణాల వల్ల అద్వానీ ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. రాష్ట్రపతి ముర్ము స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి భారతరత్నను ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రదానానికి ప్రధానమంత్రి మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము అవార్డు ప్రదానం చేస్తుండగా, అద్వానీ పక్కనే ప్రధాని కూర్చొనివుండడం, అందునా రాష్ట్రపతి నిలబడి అవార్డు ప్రదానం చేస్తుండగా కూర్చుని వుండడం రాష్ట్రపతిని అవమానించడమే. అంతేకాదు తన రాజకీయ ఉన్నతికి కారణమైన అద్వానీకిసైతం ఆయనేమీ గౌరవం ఇవ్వదలచుకోలేదు. 2002లో గుజరాత్‌ మారణహోమం సాగినప్పుడు అప్పటి ప్రధాని వాజ్‌పేయి ‘రాజధర్మం’ పాటించలేదంటూ సిఎంగా ఉన్న మోడీని పక్కనపెట్టేందుకు సిద్ధమయ్యారని ప్రచారం ఉంది. ఆ సమయంలో అద్వానీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అడ్డుపడి మోడీ పదవికి గండం వాటిల్లకుండా కాపాడారని చెబుతారు. ఆ కృతజ్ఞత సైతం అద్వానీ పట్ల కనిపించదు.
ఆర్‌ఎస్‌ఎస్‌ డిఎన్‌ఎలోనే మనుస్మృతి అంతర్భాగంగా ఉంది. బ్రహ్మ నుదుటి నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు వచ్చారంటూ నిచ్చెనమెట్ల వ్యవస్థను ప్రచారం చేస్తుంది. అందులో మరింత దిగువున ఉన్న దళిత, ఆదివాసీల పట్ల విషం కక్కడం ఆర్‌ఎస్‌ఎస్‌కి అలవాటే. రాష్ట్రపతిగా పనిచేసిన రామ్‌నాధ్‌ కోవింద్‌ వీడ్కోలు సభ సందర్భంగా ఆయనకు అభివాదం చేయలేదంటూ అప్పట్లో ప్రధానిపై విమర్శలు వచ్చాయి. తాజాగా, ఆదివాసీ మహిళ అయిన రాష్ట్రపతి ముర్ము పట్ల అనుసరించిన వైఖరి చర్చనీయాంశమైంది. ఇంతకుముందు కూడా ఆమె పట్ల ఇదేవిధమైన వైఖరిని అనుసరించారు. రాష్ట్రపతి దేశ అత్యున్నత శాసన వ్యవస్థ పరిరక్షకులు. అందుకే రాష్ట్రపతికి పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సైతం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే గౌరవం కల్పించబడింది. అటువంటి రాజ్యాంగాధినేతను నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం సందర్భంగా పిలవకపోవడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తరువాత ప్రధాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకున్న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికీ పిలవలేదు. ఆమె వితంతువైనందున ఆ కార్యక్రమాలకు పిలవలేదా? అనే ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి.
మనుషులందరికీ సమాన గౌరవం ఇవ్వలేదంటూ అంబేద్కర్‌ తగులబెట్టిన మనుధర్మ శాస్త్రాన్ని నెత్తికెత్తుకున్న నేటి పాలకులు అందులోని విద్వేషాన్ని. విషాన్ని తమకు మించి ఎవరూ అమలు చేయలేరని నిరూపించదలచుకున్నారు! ముస్లిములపై, దళితులపై పశువుల మాంసం తింటున్నారంటూ విద్వేషం నింపడం, దాడులు చేసి చంపేయడం బిజెపి పాలనలో నిత్యకృత్యమే! అదే సమయంలో పశువుల మాంసం ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలవడం మోడీ సర్కారు సాధించిన ఘనత! భారతీయులంతా సహోదరులన్న స్పృహ, అందరి పట్ల సమాన గౌరవం, రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం ప్రజాస్వామ్య పాలకులకు అత్యవసరం. అవేవీ కనుచూపు మేరలో కనిపించని నిరంకుశ మనువాద పాలనకు మచ్చుతునకగా మోడీ సర్కారు చర్యలు నిలిచిపోతాయి!

➡️