అయోమయంలో భూహక్కులు!

May 4,2024 05:59 #edit page, #land title act

భూ రికార్డుల ఆధునీకరణ సాకుతో నీతిఆయోగ్‌ సూచించిన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం భూ యజమానులకున్న హక్కులను అయోమయంలో పడేసింది. భూ హక్కు విషయమై సివిల్‌ కోర్టుల్లో కేసు సైతం వేయడానికి వీలులేదని చట్టం పేర్కొనడంతో రెవెన్యూ మాయాజాలంతో తమ భూములు ఏమైపోతాయోనన్న గందరగోళం రైతాంగంలో ఏర్పడింది. దాంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇది ఒక ప్రచారాంశంగా మారింది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’ పోర్టల్‌పై ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర వివాదం నడిచిన సంగతి గుర్తు చేసుకుంటే భూ హక్కులకు భూ యజమానులు ఎంత ప్రాధాన్యతనిస్తారో బోధపడుతుంది. అయితే, తెలంగాణలో ధరణి తెచ్చింది టిఆర్‌ఎస్‌ కాగా కాంగ్రెస్‌కు దానితో సంబంధం లేదు కాబట్టి ప్రతిపక్షం గట్టిగా ఎదుర్కోగలిగింది. అదే ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ఆ చట్టం చేసింది వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వమే అయినా మూల చట్టం రూపొందించింది కేంద్ర బిజెపి సర్కారు. ప్రధాని మోడీ ఏరికోరి ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ నమూనా చట్టాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించి ఆమోదించాలని ఆదేశించగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మారుమాటాడకుండా అసెంబ్లీలో వెంటనే ఆమోదించేసింది. అదే బిజెపితో ఇక్కడి ప్రతిపక్ష టిడిపి, జనసేన కూటమి కట్టాయి. కాబట్టి ప్రమాదకరమైన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి బిజెపి, వైసిపి, టిడిపి, జనసేనలదే బాధ్యత అవుతుంది.
రైతాంగంలో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్న ఈ చట్టంపై వామపక్షాలు తొలినుండీ అభ్యంతరపెడుతూనే ఉన్నాయి. ప్రజా సంఘాలు పలు ఆందోళనలు చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోయింది. వివాదాస్పద చట్టం విషయంలో కాంగ్రెస్‌ పాత్ర కనిపించదు. కనుక ఇండియా వేదికగా ఏర్పడిన పార్టీలకే ఆ చట్టాన్ని విమర్శించే లేదా ఎదిరించే దమ్ముంటుంది. అంతేతప్ప ఇటు వైఎస్‌ఆర్‌సిపి, అటు ఎన్‌డిఎ కూటమి పార్టీలూ నేరం చేసినవే! ఈ చట్టంతో భూములపై సొంత హక్కులు ప్రశ్నార్థకం అవుతాయని, తాత ముత్తాతల రికార్డులు చూపించి నిరూపించుకోకపోతే భూములపై హక్కులను పెండింగ్‌లో పెడతారని రైతులు ఆందోళనగా ఉన్నారు. దాంతో ఇక ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుతో భూములు లాగేసుకుంటారని తెలుగుదేశం,జనసేన నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఆ చట్టాన్ని తీసుకొచ్చిన బిజెపితో కలిసి ఎందుకు కూటమి కట్టారో మాత్రం వారు ప్రజలకు చెప్పకపోవడం నయవంచనే కదా!
నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలుతో భూమిని ఒక ఉత్పత్తి వనరు, జీవనాధారం అన్నది కాకుండా కొని అమ్మే ఒక సరుకుగా మార్చే ప్రయత్నం తీవ్రతరమైంది. భూ రికార్డుల ఆధునీకరణ, కంప్యూటరీకరణ పేరుతో కేంద్రం రాష్ట్రాలపై రకరకాల ఒతిళ్లు తీసుకొచ్చింది. దానికితోడు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం ప్రపంచంలో ఎక్కడున్నవారైనా ఇక్కడి భూమి గురించిన సకల సమాచారం తెలుసుకోవడమే కాకుండా దాన్ని కొనుకోవడానికి చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్‌ అవకాశం కూడా కల్పించాలన్నది ముందుకొచ్చింది. చంద్రబాబు హయాంలో వచ్చిన ‘మీభూమి’ పోర్టల్‌ ఆ క్రమం లోనిదే! దాన్ని ఆయన ఎంతగానో ప్రస్తుతించుకునేవారు. ఆ తరువాత వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు ఈ టైట్లింగ్‌ చట్టాన్ని చేసింది. సివిల్‌ కోర్టుల పరిధి నుండి తొలగించడం, ఇతరత్రా పారదర్శకత కొరవడడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అటువంటి స్థితిలో ప్రజాస్వామిక పాలనలో అన్ని విషయాలనూ గ్రామసభలో వివరించి, సందేహాలను నివృత్తి చేశాక రికార్డుల్లో నమోదు చేయడం, వివరాలన్నిటినీ గ్రామ సచివాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడంతోపాటు దిద్దుబాటు ప్రక్రియ కూడా స్థానికంగా అందుబాటులో ఉండేలా చేయడం జరగాలి. కానీ వివిధ పాలనాపరమైన అంశాల్లో నిరంకుశ పోకడలు పోతున్న వైసిపి ప్రభుత్వం భూ హక్కుల విషయంలోనూ ఏకపక్షంగానే వ్యవహరించింది. పైపెచ్చు సర్వే రాళ్లపైన, పట్టాదారు పాస్‌బుక్‌పైన సిఎం ఫొటో ప్రచురించడం మరిన్ని సందేహాలకు కారణమైనాయి. భూ యజమానుల్లో తీవ్ర గందరగోళానికి కారణమైన వివాదాస్పద ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని ఇప్పటికైనా నిలుపుదల చేయాలి. అందుకోసం ఆ నాలుగు పార్టీలపై మరింతగా ప్రజల ఒత్తిడి పెరగాలి.

➡️