వాస్తవ ప్రతీకలు

Jun 23,2024 09:29 #Real symbols

నిజం నిష్టూరంగానే కాదు…నగ్నంగానూ ఉంటుంది. అణచివేత ఎప్పుడూ ఆక్రోశం, ఆగ్రహజ్వాలగానే మారుతుంది. అల్లకల్లోలం సృష్టిస్తుంది. నిర్భయంతో వుండే గుండెలను నిర్బంధం ఎప్పుడూ నియంత్రించలేదు. అంతేకాదు… నియంతలెప్పుడూ నిటారుగా నిలువలేరు. నిలిచిన దాఖలాలు చరిత్రలో లేవు. విమర్శ, వ్యంగ్యం, ప్రశ్నించేతత్వం కళలకు జీవం పోస్తాయి. అలాంటి కళలకు ఒకప్పుడు విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి గొప్ప ప్రోత్సాహం లభించేది. వీధిలోనైనా విశ్వవిద్యాలయంలోనైనా…నిగ్గదీసి అడిగేది, పిడికిలి బిగించి ప్రశ్నించే గొంతుక కళా రూపమే. ప్రఖ్యాత నాటకకర్త షేక్స్‌పియర్‌ ‘నాటక రంగస్థలం ప్రకృతికి పట్టే అద్దం వంటిది’ అంటాడు. ఈ పాత్రలు నిజమైన వ్యక్తులు కారు. నిజమైన వ్యక్తులవలె రూపొందించబడి, వ్యవహరించే ప్రతీకలు. ‘అవస్థాను కృతిర్నాట్యమ్‌’ అంటాడు ధనుంజయుడు. అంటే ‘నాట్యం జీవితంలోని విభిన్న అవస్థలకు అనుకృతి’. ప్రజల అవస్థల రూపాన్ని వ్యంగ్యంగానో, చురుక్కుమనేలాగో ప్రతీక పాత్రలు రూపుకట్టిస్తాయి.
భారతీయులకు విస్తారమైన సాంస్కృతిక వారసత్వం వుంది. సాహిత్యం, కళారూపాలు, నాటకాలను నిత్యం సజీవంగా వుంచే బుద్ధిజీవులు ఈ గడ్డపై వున్నారు. కళ కళకోసం కాదు… ప్రజలకోసం అంటూ వీధి నాటక కేతనమైన సఫ్దర్‌ హష్మీ హత్య భారతదేశ మనస్సాక్షిని కదిలించింది. దేశంలోని ప్రతి నాడినీ తాకింది. ‘నా గుండెల్లో సూది గుచ్చుకుంటే చాలు… ఏ శ్రీశ్రీ కలం కరిగో విప్లవ గేయాన్నైపోయుందును’ అంటాడో కవి. ప్రజా చైతన్యానికి వీధి నాటికను అత్యంత చైతన్యవంతంగా వినియోగించిన గొప్ప కళాకారుడు హష్మీ. స్వేచ్ఛా స్వాతంత్య్రం, రాజకీయాలు-నేర సంబంధాలపై అసహనం, ఉదారవాద ప్రజాస్వామ్యంపై స్వారీ చేసే క్రూరమైన శక్తులతో ఘర్షణ పడినందునే హష్మీ హత్యగావించబడ్డాడు. ప్రశ్నించే గొంతులు, నినదించే పిడికిళ్లు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వుంటాయి. అయితే, హత్యలు, నిరంకుశ అణచివేతలు ఇప్పుడు మరింత పెరిగాయి. ఈ కోవలో వెల్లువెత్తిన అనేక ఉద్యమాలను చూశాం. రైతుల సుదీర్ఘ ఉద్యమం, హిజాబ్‌ ఆంక్షలకు ఎదురు తిరిగిన అమ్మాయిల చైతన్యం ఈ నేలపైనే చూశాం. నిజం కోసం నిలబడి ప్రాణాలర్పించిన కల్బుర్గి, పన్సారే, దబోల్కర్‌, గౌరీ లంకేష్‌ వంటి వారినీ చూశాం. తాజాగా రామాయణాన్ని, అందులోని రాముడి గుణగణాలను ప్రశ్నిస్తూ ‘రాహౌవన్‌’ పేరిట వ్యంగ్య నాటకాన్ని ప్రదర్శించిన 8 మంది విద్యార్థులకు ఐఐటి- బాంబే భారీ జరిమానా విధించింది. ఈ ఏడాది మార్చి 31న పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌ (పిఎఎఫ్‌)లో భాగంగా ఈ నాటకం ప్రదర్శించారు. అయితే ఈ నాటకం రాముడిని, రామాయణాన్ని కించపర్చేలా ఉందని సంఘ్ పరివార్‌కి చెందినవారు విద్యాసంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి విద్యార్థులపై చర్యలకు ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు నాటకం ప్రదర్శించిన విద్యార్థులకు జరిమానా విధించారు. గతంలో బెంగళూరు జైన్‌ విశ్వవిద్యాలయం, అస్సాంలోని బోడోలాండ్‌ విశ్వవిద్యాలయం వంటి చోట్ల కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి.
ఒక కళారూపం ప్రదర్శించిన విద్యార్థులకు జరిమానా అంటే…అది భావప్రకటనా స్వేచ్ఛ అణచివేత… అరాచకత్వానికి పరాకాష్ట. భావప్రకటనను నియంతృత్వంతో అంతం చేయాలని కంకణం కట్టుకుంది మోడీత్వ హిందూ సామ్రాజ్యవాదం. దీన్ని ఎదుర్కోవాలంటే…వేల గొంతుకలు చైతన్య ప్రతీకలుగా మారతాయి. ‘పువ్వులకో కాయలకో గాయాలైతే/ కావ్యాలైపోయిన దేశంలో నేను పువ్వుగానో/ ఆకుగానో పుట్టాల్సింది’ అంటారు కలేకూరి ప్రసాద్‌. వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ… కవల పిల్లలు. ఈ రెంటినీ కలిపివుంచే సాహిత్య రూపమే కళారూపం. అందుకే ‘నాటకాంతంహి సాహిత్యం’ అన్నారు. తమ రూపానికి ప్రతీకలుగా మారిన భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడానికి సిద్ధంగా వుండే ధనాఢ్యశక్తులకు ప్రభుత్వాలు కొమ్ము కాస్తుంటాయి. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం, సంఘ్ పరివార్‌ శక్తులు నగంగా వ్యవహరిస్తున్నాయి. ‘స్వేచ్ఛను త్యజించడం అంటే మనిషిగా వుండటాన్ని త్యజించడం’ అంటారు ఫ్రెంచ్‌ తత్వవేత్త జీన్‌ జాక్వెస్‌ రూసో. భావప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించేతత్వం కళలకు జీవం పోస్తాయి. మనిషితత్వాన్ని నిలబెడతాయి. ఈ సత్యాన్ని విస్మరిస్తే…ప్రజల రాజకీయ హక్కులు కూడా అణచివేతకు గురవుతాయి.

➡️