సందేశ్‌ఖలి దురాగతాలు, తృణమూల్‌ అరాచక ముఠాలు

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలి ఇటీవల ప్రముఖంగా మీడియాలో కనిపించింది. అయితే దానికి ఎవరికి తోచిన రంగు వారు ఇచ్చిన పరిస్థితి. పశ్చిమ 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖలి పేదలు ఎక్కువగా వుండే ప్రాంతం. అక్కడ ముస్లిం శ్రామికులు పెద్ద సంఖ్యలో జీవిస్తుంటారు. సందేశ్‌ఖలిలో షేక్‌ షాజహాన్‌ అనే తృణమూల్‌ నాయకుడు స్థానికంగా పెత్తనం చేస్తుంటాడు. నిజానికి అతను గతంలో తృణమూల్‌ మంత్రిగా పనిచేసిన జ్యోతిప్రియ మాలిక్‌ అనుచరుడే. తన ఇలాకా లోని రెండు మండలాలను షేక్‌కు అప్పగించారు. అతనేమో ఉత్తమ్‌ సర్దార్‌ హజ్రా అనే తన బంటుకు ఇందులో ఒక మండలాన్ని కట్టబెట్టాడు. షేక్‌ షాజహాన్‌ హయాంలో అక్కడి పేదలపై ప్రత్యేకించి మహిళలపై పీడన, అత్యాచారాలు నిరంతరం నడుస్తుంటాయి. అతన్ని పట్టుకోవడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడి చేసిన రోజున గూండాల బలగాలు అడ్డుకున్నాయి. ఆ సమయంలోనే మహిళలపైనా అత్యాచారాలు జరిగాయని వెల్లడైంది. ఈ వార్త దేశమంతటినీ కలవరపరిచింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే మమత పోలీసులు వారిని అరెస్టు చేయగా షేక్‌ తప్పించుకుని పోయాడు. అతని మనుషులను పోలీసులు పట్టుకెళ్లాక ఈ దురాగతాలకు నిరసనగా మహిళలు ముందకొచ్చారు. మిగిలిన నేపథ్యం వదలిపెట్టి నిస్సహాయ హిందూ మహిళలపై షేక్‌ షాజహాన్‌ అనే ముస్లిం పెత్తందారు సాగించిన దురాగతాలుగా ఇవి చిత్రించబడ్డాయి. మిగిలిన దేశంలో వలెగాక బెంగాల్‌లో విభజనానంతరం పొట్ట పోసుకోవడానికి వచ్చిన పేద శ్రామికుల పరిస్థితి భిన్నంగా వుంటుంది. వారిని మతాన్ని బట్టి విభజించడం రివాజుగా మారింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బెంగాల్‌లో మమతా ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ధోరణి బాగా ముదిరింది. షాజహాన్‌ మేనమామల కుటుంబానికి చెందినవారు గ్రామ సిపిఎం శాఖలో పనిచేసేవారు. అయితే అతని పెత్తనం పెరిగింది 2011లో టిఎంసి వచ్చాక, 2013లో పంచాయతీలో గెలిచాక. కనుక అతని అరాచక సామ్రాజ్యానికీ సిపిఎం పాలనకూ సంబంధం చూపే కథనాలు దురుద్దేశపూరితమైనవే.

వామపక్ష పాలనలో మత సామరస్యంతో నడిచిన బెంగాల్‌ మమత హయాంలో రకరకాల ముఠాల వర్గాల మధ్య ఘర్షణలు, దౌర్జన్యాలకు నిలయంగా మారింది. ఆ ప్రభావమే ఇక్కడా పనిచేసింది. సందేశ్‌ఖలిలో హిందువులు 70 నుంచి 77 శాతం వుంటారు. మిగిలిన వారిలో ఎస్‌సి, ఎస్‌టి తరగతులు ఎక్కువ. అయినా మమతా బెనర్జీ ముస్లింల పట్ల బుజ్జగింపు విధానాలు అనుసరించారనే మోత మోగింది. నిజానికి ఇది మమత పాలనా పోకడల ఫలితం తప్ప మరొకటి కాదు.

అరాచక దోపిడీ రాజ్యం

వామపక్ష పాలనలో ఒక బాధ్యతాయుత పాలనా వ్యవస్థ వుండటంతో ఆ నీడలో సామాన్య ప్రజలు జీవనం సాగించేవారు. సిపిఎం ప్రజా సంఘాల అండ పుష్కలంగా వుండేది. పార్టీ శ్రేణుల్లో మధ్య తరగతి బుద్ధిజీవులు, విద్యాధికులు వారికి అవసరమైన సహాయం అందిస్తుండేవారు. ఆ విధంగా అరాచక శక్తులకు, ఆధిపత్యాలకు పగ్గాలు పడ్డాయి. కానీ వామపక్ష ప్రభుత్వం స్థానే మమతా రాజ్యం వచ్చాక ఇదంతా మారిపోయింది. దిగువ స్థాయి దౌర్జన్యకారులను అడ్డం పెట్టుకుని పెత్తందార్లు, ధనస్వాములు, అవినీతిపరుల హవా పెరిగిపోయింది. ఈ బాపతు మొత్తం టిఎంసిలో చేరిపోయారు. నిర్మాణాత్మకమైన సిపిఎం వంటి వ్యవస్థ లేకపోవడంతో మమతా బెనర్జీ తన హంగుదార్లయిన అధికారులు, పోలీసులు అవినీతి నేతలతో సమాంతర పాలనా చట్రం ఏర్పాటు చేసుకున్నారు. తమ పార్టీ నాయకులకన్నా వారికే పెద్ద పీట వేశారు. మరోవైపున కుల మత ప్రాంతీయ ముఠాదార్లను చేరదీశారు. తనకు విశ్వాసంగా వుండే పార్టీ నేతలు స్థానికంగా ఎన్ని అక్రమాలకు పాల్పడినా యథేచ్ఛగా సాగనిచ్చారు. ఈ ముఠాలు స్థానిక అధికారులు, పోలీసులపైనా పట్టు పెంచుకుని విచ్చలవిడిగా డబ్బు దండుకోవడం పరిపాటి అయింది. చాలా చోట్ల లాగే ఇక్కడా ఇసుక, మద్యం, మత్స్య పరిశ్రమ, పంటలు, కాంట్రాక్టులు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అన్నీ జుర్రుకుంటున్నారు. అంతకు ముందు వామపక్ష ప్రభుత్వ హయాంలో భూ సంస్కరణల వల్ల పెద్ద కమతాలు పోగొట్టుకున్న వారే ఇప్పుడు అధికార పీఠాలలో కుదరుకున్నారు. వాస్తవానికి వీరే తృణమూల్‌ పెరుగుదలకు మొదట సహకరించారు కూడా. పరిశ్రమలు క్షీణించిన తర్వాత అసంఘటిత రంగం, రోజువారీ పనులు ప్రధానమై శ్రామికులు ఈ శక్తుల మీదే ఆధారపడవలసి వచ్చింది. అధికారం, అధిక లాభాలు కలిసిన ఈ సరికొత్త ముఠాలే ఇప్పుడు బెంగాల్‌ గ్రామాలు, చిన్న పట్టణాలలో చక్రం తిప్పుతున్నాయి. మమతా బెనర్జీ ఆధిపత్యాన్ని అడ్డుపెట్టుకుని ఈ ముఠాలు సంపదలూ వనరులు కొల్లగొడుతూ ఎదురు తిరిగి వారిని వేటాడుతుంటాయి. స్థానిక ఎన్నికలలో పోటీ పడే ప్రతిపక్ష అభ్యర్థులను ఉపసంహరించుకునేలా చేస్తుంటాయి.

  • మహిళల ప్రతిఘటన, సర్కారు రక్షణ

ఈ విధంగా విభిన్న శక్తులకు లీజుకిచ్చిన ప్రాంతీయ గొలుసులో పెత్తనాలు చేయడం, లాభాలు పొగేసుకోవడంపైనే టిఎంసి బలం ఆధారపడి వుంటుంది. ఈ వ్యవస్థ మొత్తం ప్రత్యక్ష లాభార్జన ప్రాతిపదికనే నడుస్తుంటుంది. దీదీ ప్రజల కోసమే పనిచేసే త్యాగమూర్తి అన్న భావనాత్మక ప్రచారంతో పనిచేస్తుంది. ప్రొఫెసర్‌ ద్వైపాయన్‌ భట్టాచార్య దీన్నే ఫ్రాంచైజీ రాజకీయంగా అభివర్ణించారు. సందేశ్‌ఖలి ఇందుకు సరైన ఉదాహరణ అని ఆయనంటారు. ఇ.డి అధికారులు షాజహాన్‌ నివాసానికి వెళ్లడంతో అది మొదలైంది, స్థానిక దుండగులు వారిపై దాడి చేశారు. పాత్రికేయులను కూడా వదలిపెట్టకుండా చితక్కొట్టారు. మొదట్లో చెప్పిన మాజీ మంత్రి జ్యోతిప్రియ మాలిక్‌ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు సందర్భంగా అతని పేరు బయటికి వచ్చింది. ప్రజల కోసం ఉద్దేశించిన ఆహారధాన్యాలు భారీ ఎత్తున మార్కెట్‌కు తరలించినట్టు తేలింది. నిజానికి షేక్‌ షాజహాన్‌ అతని తరపునే పనిచేసే స్థానిక దాదా వంటి వాడు మాత్రమే. మాలిక్‌ అరెస్టు తర్వాత అతను తప్పించుకుని పోయాడన్నారు. నిజానికి అతను పోలీసుల పహారాతోనే వెళ్లినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. ఏమైనా అతను లేకపోవడంతో తాత్కాలికంగా ముఠా బలం సన్నగిల్లింది. మీడియా తనదైన శైలిలో బిజెపి తరహా వాదనలతో ప్రచారం ఇచ్చింది. మరోవైపున సిపిఎం నాయకత్వంలోనూ నిరసనలు మొదలైనాయి. ప్రజలు కూడా బయటికి వచ్చి ఆ ముఠా దుశ్చర్యలను చెప్పడానికి నోరు విప్పారు. చీపుళ్లు, రోకళ్లతో వీధుల్లోకి వచ్చారు. పోలీసుల సమక్షంలోనే గూండాలు తమపై గాజుసీసాలు విసరడంతో వారి ఆగ్రహం మిన్నంటింది. ఆ కోపానికి దుండగులు జీపుల్లో పరారైపోవలసి వచ్చింది.

టిఎంసి నేతలైన హజ్రా సర్దార్‌ వంటివారు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే తమ భూములను ఆక్రమించుకుని చేపల చెరువులుగా మార్చారని వెల్లడించారు. వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిమితికి మించిన ప్రైవేటు భూములను భూమి లేని పేదలకు పంచి పెట్టడం గ్రామీణ దృశ్యాన్ని మార్చింది. ఇప్పుడు తృణమూల్‌ ఆ భూ పంపిణీ ప్రక్రియను తలకిందులు చేసింది. ఇక మరోవైపున టిఎంసి చోటా మోటా నాయకులు మహిళలను రాత్రివేళ తమ కార్యాలయాలకు పిలిపించి లైంగికంగా వేధించేవారని మహిళలు రోదనలతో నివేదించారు. ఏ విధమైన నైతిక, సైద్ధాంతిక నిబద్దత లేని ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల విశృంఖల పురుషాహంకార నేరాలివి.

ఈ దారుణాలన్నీ బయటికి వచ్చిన తర్వాత షాజహాన్‌, హజ్రా, సర్దార్‌లతో తమకేమీ సంబంధం లేదని చెప్పుకునేందుకు టిఎంసి తంటాలు పడుతున్నది. 19 రోజుల పాటు అతను దొరకలేదంటే ప్రజలెవరూ నమ్మలేదు. ఆఖరుకు అతన్ని తమ పార్టీ నుంచి బహిష్కరించినట్టు ప్రకటించిన తర్వాతనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో కీలకమైన పత్రాలు అక్కడి నుంచి మాయం చేసి వుంటారని ఇ.డి అనుమానిస్తున్నది. మరోవైపున బిజెపి ఇదేదో హిందూ మహిళలపై ముస్లింలు చేసిన దురాగతాలుగా చూపిస్తున్నది. కేంద్రంలో అధికారం, బెంగాల్‌లో ప్రతిపక్షంగా ఎక్కువ స్థానాలు గల బిజెపి ప్రచారానికి సహజంగానే మీడియాలో అత్యధిక స్థానం లభిస్తుంది. పంచాయతీ ఎన్నికలను ప్రహసనంగా మార్చిన రోజున కూడా బిజెపి ఏదో నిరసనలంటూ హడావుడి చేస్తూనే టిఎంసి అరాచకాలను యథేచ్ఛగా సాగిపోనిచ్చింది. తమకు షేక్‌ షాజహాన్‌తో సంబంధం లేదంటున్న ఆ పార్టీ ప్రభుత్వ పోలీసులు తనను ఇ.డి కి అప్పగించడానికి నిరాకరిస్తున్నారు. కేసు సుప్రీం కోర్టు ముందు వుందని సాకు చెబుతున్నారు. మరో వంక బెంగాల్‌ హైకోర్టు సందేశ్‌ఖలి అల్లర్ల దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది.

  • సిపిఎం, ఐద్వా పోరాటం

ఇన్ని రకాల అవకాశవాదాలు, అరాచకాల మధ్య సిపిఎం, ఐద్వా నాయకులు ఆ పేదలకు, మహిళలకు న్యాయం కోసం గట్టిగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంఎల్‌ఎ, రాష్ట్ర కమిటీ సభ్యుడు నిరపద సర్దార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో ఒకరైన శివప్రసాద్‌ హజ్రా ఫిర్యాదుపై ఈ అరెస్టు జరగడం విచిత్రం. అది కూడా 9న అరెస్టు జరిగితే 10న ఫిర్యాదు అందడం మరింత విశేషం. ఈ వైపరీత్యాన్ని బెయిలు పిటిషన్‌ విచారించిన హైకోర్టు న్యాయమూర్తి దేవాంశువాసక్‌ నిశితంగా విమర్శించారు. ఆయనను ఫిబ్రవరి ఏడున విడుదల చేయాలని ఆదేశిస్తూ ఇప్పటికీ చేయకపోతే కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హెచ్చరించారు. విడుదలైన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ టిఎంసి పాలనలో సాగుతున్న అఘాయిత్యాలను తీవ్రంగా ఎండగట్టారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ బాధిత మహిళలను పరామర్శించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకుని తీవ్ర నిరసన తర్వాతనే అనుమతించారు. స్థానిక పరిస్థితులను పరిశీలించిన బృందా మీడియాతో మాట్లాడుతూ పోలీసులు యూనిఫారం వేసుకున్నా టిఎంసి కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే దుండగులను రక్షిస్తూ తమ బాధ్యత సమర్థంగా నిర్వహిస్తున్నారని అపహాస్యం చేశారు. బాధిత మహిళల గృహాలను సందర్శించిన తర్వాత ఆమె మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో యోగి పాలనలో హత్రాస్‌ అత్యాచారం ఎలా జరిగిందో ఇక్కడా పరిస్థితి అలాగే వుందని ఆగ్రహించారు. ఆయనలాగే మమత కూడా నిజాలు దాచిపెట్టడానికి పాకులాడుతున్నారన్నారు. మహిళా యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు బాధితులను సమీకరించి ఈ అత్యాచారాలపై ధైర్యంగా పోరాటం కొనసాగిస్తున్నారు.

  • ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌
➡️