నారీశక్తి

sc-asks-coast-guard-to-ensure-women-officers-get-permanent-commission editorial

మాటలు కోటలు దాటినా, ఆచరణ అడుగు కూడా పడకపోతే ఏమవుతుందనడానికి అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం ఎదుర్కున్న పరిస్థితే నిదర్శనం. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు పదేపదే చెప్పిన మాటలనే ఉదహరిస్తూ న్యాయమూర్తులు నిలదీస్తుంటే ఏం జవాబు చెప్పాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వ న్యాయవాదులు పడిపోయారు. లింగ వివక్ష కేంద్రంగా దాఖలైన ఒక కేసు విచారణ సందర్భంగా ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. కోస్ట్‌ గార్డ్‌ (తీర రక్షక దళం)లో మహిళా అధికారులు శాశ్వత నియమాకాల్లో ఎదుర్కుంటున్న వివక్షను ఎత్తిచూపుతూ దాఖలైన ఒక పిటిషన్‌ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి తలంటింది. ’21వ శతాబ్దంలో ఉన్నాం…ఇంకా పాతరాతి యుగపు ఆలోచనలేనా?’ అంటూ నిలదీసింది. ఏళ్ల తరబడి షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌లో సేవలందించిన తనతో పాటు అర్హులైన ఇతర మహిళా అధికారులతో శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేసి తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేసేలా ఆదేశించాలంటూ ఒక అధికారిణి దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం స్పందించిన తీరు హర్షణీయం. షార్ట్‌ సర్వీసు కమిషన్‌కు ఎంపికైన అభ్యర్థులు నిర్దేశించిన కాలపరిమితి మేరకు పని చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత కూడా విధుల్లో కొనసాగాలని భావించిన వారు దరఖాస్తు చేసుకుంటే, శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసి, వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేస్తారు. ఇండియన్‌ ఆర్మీలో 1965 ఫిబ్రవరిలో మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. అయితే, ఇది పురుషులకు మాత్రమే పరిమితం. మహిళలను త్రివిధ దళాల్లోకి అనుమతించే వారే కారు. అయితే, 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ పరిస్థితి మారింది. ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీలలోని సాయుధ దళాల్లోకి సైతం మహిళలకు తలుపులు తెరుచుకున్నాయి. కానీ, 1977లో ఏర్పాటైన కోస్ట్‌గార్డ్‌ మాత్రం వివక్షాపూరిత ధోరణినే ఇంకా కొనసాగిం చడం, దానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు తలలాడించడం దారుణం!

మహిళ అన్న కారణంతో తనకు సమాన అవకాశాలు తిరస్కరిం చారంటూ దాఖలైన ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ కోస్ట్‌గార్డ్‌లో నెలకొన్న పరిస్థితికి విస్తుపోయింది. ‘నారీ శక్తి అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతారు కదా! ఇప్పుడు సమయం వచ్చింది. చేసి చూపండి. మీరు నడి సముద్రంలో చిక్కుకున్నారు. మీకు మరో మార్గం లేదు. మహిళలకు వారి వాటా ఇవ్వాల్సిందే. ఈ మేరకు విధానం రూపొందించండి’ అని నిర్దేశించింది. ఈ సూచన చేసిన వారం రోజుల తరువాత జరిగిన మలి విచారణలోనూ కేంద్ర ప్రభుత్వ విధానంలో ఇసుమంత మార్పు కూడా రాకపోవడం మహిళల పట్ల వారి దృష్టి కోణానికి నిదర్శనం. కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకట రమణి ‘త్రివిధ దళాలతో పోలిస్తే కోస్ట్‌గార్డ్‌లో పనిపరిస్థితులు భిన్నంగా ఉంటాయని చెప్పడంతో ‘2024లో అటువంటి వాదనలు పనిచేయవు. మీరు చేయ లేకపోతే మేమే చేస్తాం.’ అని ధర్మాసనం హెచ్చరించింది. ఒక దశలో ఇప్పటికే పది శాతం శాశ్వత ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రభుత్వం తరపు నుండి చెప్పడంతో ’10 శాతమే ఎందుకు? పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువని భావిస్తున్నారా?.’ అని నిలదీసింది. మార్చి ఒకటవ తేదీన ఈ కేసులో తదుపరి విచారణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఏ మేరకు మార్పు వస్తుందో చూడాలి!

నిజానికి, పుట్టినప్పటి నుండి మరణించే వరకు మహిళలకు ఎన్నో కట్టుబాట్లు పెట్టిన సమాజం మనది. కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్ర పోవడానికి, నోరారా నవ్వడానికి కూడా ఎన్నో ఆంక్షలు! ఈ సంకెళ్లను తెంచుకోవడానికి భారతీయ మహిళల పోరాటం కొన సాగుతోంది. 2020లో సుప్రీంకోర్టు తీర్పు తరువాత త్రివిధ దళాల్లో మహిళల సంఖ్య 11,414కు చేరింది. ఆర్మీలోనే 7,054 మంది చేరారు. వీరిలో 10 మంది ఈ ఏడాదే తమతమ విభాగాల్లో అత్యు న్నత స్థాయికి చేరారు. స్వాతంత్ర పోరాటంలో సుభాష్‌ చంద్రబోస్‌ ఏర్పాటు చేసిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ నేతృత్వంలో కదం తొక్కిన ఘన చరిత్ర మన నారీ లోకానిది. అన్ని రంగాల్లోనూ సమాన హక్కుల సాధనకు ఆ పోరాట స్ఫూర్తే ఆదర్శం.

➡️