ఉదారవాదపు సంక్షోభం

May 14,2024 04:10 #editpage

ప్రతీ రాజకీయ కార్యాచరణ ప్రక్రియా ఏదో ఒక ఒక రాజకీయ తాత్విక సిద్ధాంతం చూపే వెలుగులో కొనసాగుతూ వుంటుంది. ప్రత్యేకించి ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రతీ రాజకీయ తాత్విక సిద్ధాంతమూ ప్రపంచంలో వ్యక్తం ఔతున్న ఆర్థిక ధోరణులను విశ్లేషిస్తుంది. ఆ విశ్లేషణ ఆధారంగా ఆ తాత్విక సిద్ధాంతం కొన్ని లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఆ లక్ష్యాలను సాధించడానికి పోరాడవలసి వుంటుంది. ఆ పోరాటాన్ని సంబంధిత రాజకీయ కార్యాచరణ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తారు. అలా నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం కష్టతరం కావచ్చు. కొన్ని పరిస్థితుల్లో చాలా కష్టం కూడా కావచ్చు. ఆ కష్టాలు ఆ రాజకీయ కార్యాచరణ ప్రక్రియకు ఆటంకంగా ఉంటాయి. కాని ఆ ఆటంకాలను బట్టి ఆ రాజకీయ తాత్విక సిద్ధాంతం సంక్షోభంలో పడింది అన్న నిర్ధారణకు రాలేము. ఒకానొక లక్ష్యాన్ని సాధించడంలో ఉండే కష్టాలను బట్టి ఆ సిద్ధాంతం సంక్షోభంలో ఉంది అని చెప్పలేం. ఆ రాజకీయ తాత్విక సిద్ధాంతంలోనే పరిష్కరించలేని అంతర్గత వైరుధ్యం తలెత్తినప్పుడు, ఆ వైరుధ్యాన్ని పరిష్కరించడం కోసం ఆ సిద్ధాంతం ప్రతిపాదించే మార్గం అదే సిద్ధాంతంలోని మరో అంశానికి భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ రాజకీయ తాత్విక సిద్ధాంతం సంక్షోభంలో ఉందని అంటాం.
మార్క్సిజం ముందుకు తెచ్చిన రాజకీయ తాత్విక సిద్ధాంతం నిర్దేశించిన సోషలిజం లక్ష్యాన్ని సాధించడం ప్రస్తుత పరిస్థితులలో మరింత కష్టతరంగా మారింది. వామపక్ష శక్తుల బలహీన పడ్డాయి. కాని ఈ ఆటంకాలను బట్టి మార్క్సిజం ఒక సిద్ధాంతంగా సంక్షోభంలో చిక్కుకుంది అని నిర్ధారించడానికి లేదు. కాని ఉదారవాదం అనే రాజకీయ సిద్ధాంతం మాత్రం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉదారవాదం మానవ స్వేచ్ఛ అనే లక్ష్యాన్ని నిర్దేశించి దానిని సాధించడానికి మార్గాన్ని ప్రతిపాదించింది. కాని ఆ మానవ స్వేచ్ఛను ఉదారవాదం తనకు ప్రాణప్రదం అయిన ప్రస్తుత వ్వవస్థ కొనసాగుతుండగా సాధించడం అసాధ్యంగా పరిణమి ంచింది. ఈ ఆర్థిక వ్యవస్థ పరిణామం చెందే క్రమంలోనే తలెత్తిన ఈ వైరుధ్యానికి ఉదారవాదం దగ్గర సమాధానం ఏదీ లేదు. ఇదే ఉదారవాద సిద్ధాంతం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సిద్ధాంత సంక్షోభపు సారం.
రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ కాలంలో బోల్షివిక్‌ విప్లవం విజయవంతం అయింది. దీనికి ప్రతిస్పందనగా ఆధునిక ఉదారవాదం ఒక సిద్ధాంతం గా ముందుకొచ్చింది. ఆ కాలంలో తలెత్తిన సంక్షోభాలకు గాని, భవిష్యత్తులో తలెత్తబోయే సంక్షోభాలకు గాని, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిని దాటకుండానే ఏవిధంగా పరిష్కరించవచ్చునో మార్గం చూపిన సిద్ధాంతంగా ఈ ఆధునిక ఉదారవాదం ముందుకొచ్చింది. పాశ్చాత్య దేశాలలో ఉనికిలో ఉన్న ఉదార ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ విధానం-ఈ రెండింటికీ తోడు రాజ్యం జోక్యం చేసుకుంటే అప్పుడు అది మానవ స్వేచ్ఛను సాధించగల అత్యుత్తమ చట్రం ఔతుంది అని అది విశ్వసించింది. పాశ్చాత్య దేశాలలో అమలౌతున్న ఉదార ప్రజాస్వామ్యంలోని వ్యవస్థలలో రాజ్యం అనేది ఒక ‘వర్గ’ రాజ్యంగా ఉండదని, అది ఒక సామాజిక హేతుబద్ధతను వ్యక్తం చేసే రూపంగా ఉంటుందని, మరే ఇతర సామాజిక వ్యవస్థలలో కన్నా ఇందులోనే ఆ హేతుబద్ధత బాగా వ్యక్తం ఔతుందని ఉదారవాదం భావించింది. అందుచేత అటువంటి ఉదారవాద ప్రజాస్వామ్య రాజ్య వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోగులుగుతుందని, ఆ విధమైన జోక్యం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థలో అప్రయత్నంగా దొర్లే లోపాలను అది సరి చేయగలుగుతుందని భావించింది. అంతేకాక, అటువంటి లోపాలు ఏవీ ఒకవేళ తలెత్తకపోయినా, సామాజిక హేతుబద్ధత కోరుకునే విధంగా అందుకు కట్టుబడి వ్యవహరించేలా పెట్టుబడిదారీ వ్యవస్థ ను కట్టడి చేయగలుగుతుందని భావించింది. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవాడు జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌. ఈ ఆంగ్లేయ ఆర్థికవేత్త ఈ సిద్ధాంతానికి నయా ఉదారవాదం అని నామకరణం చేశాడు. అంతకు ముందు కాలంలో ఉదారవాదం అనే సిద్ధాంతం ఉనికిలో ఉంది. ఆ పాత ఉదారవాదానికి ఈ కొత్త ఉదారవాదం భిన్నంగా ఉంటుంది. పాత ఉదారవాద సిద్ధాంతాలన్నీ ఆర్థిక వ్యవస్థలో రాజ్యం వీలైనంత పరిమితంగానే జోక్యం కల్పించుకోవాలని చెప్పాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎప్పుడూ ”దాదాపు పూర్తి స్థాయి”లో ఉపాధి కల్పన కల్పిస్తూ వుంటుందన్న పొరపాటు అభిప్రాయంతో ఆ పాత సిద్ధాంతాలు ఉండేవి.
ఉదారవాదపు ప్రస్తుత కొత్త రూపం ఎంతవరకూ సహేతుకమైనది అని గాని, ఈ వాదం పెట్టుబడిదారీ వ్యవస్థ చట్రం లోపల చెల్లుతుందా లేదా అన్నది కాని నేనిప్పుడు చర్చించబోవడం లేదు (నిజానికి ఈ నయా ఉదారవాదం ఇప్పుడు ఎంత మాత్రమూ చెల్లదు. ఎందుకంటే ఈ నయా ఉదారవాదం సామ్రాజ్యవాదం అనే ఒక పెట్టుబడిదారీ దశను ఏ మాత్రమూ పరిగణనలోకి తీసుకోలేదు, దానిని గుర్తించలేదు, ఊహించనూ లేదు.). కాని ద్రవ్య పెట్టుబడితో సహా పెట్టుబడి యావత్తూ ప్రపంచీకరించబడ్డాక ఈ సిద్ధాంతం ఏ మాత్రమూ చెల్లదు. నయా ఉదారవాదం ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థలో రాజ్యం జోక్యం చేసుకోవాలి. ఈ రాజ్యం ఎప్పుడూ జాతి రాజ్యంగానే ఉంటుంది. ఏ దేశానికి ఆ దేశం ఒక రాజ్య వ్యవస్థను కలిగి వుంటుంది. ఒకసారి ద్రవ్య పెట్టుబడి ప్రపంచీకరించబడిన తర్వాత ఈ పెట్టుబడి చెప్పినట్టు దానికి లోబడి ఆ యా జాతి రాజ్యాలు వ్యవహరించాలే తప్ప ఆ రాజ్యాల నియంత్రణకు ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి లోబడి నడుచుకోదు. ఒకవేళ ఏ రాజ్యం అయినా నియంత్రించడానికి పూనుకుంటే, ద్రవ్య పెట్టుబడి అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తుంది. అందుచేత రాజ్యం ఇంకెంత మాత్రమూ సామాజిక హేతుబద్ధతకు ప్రతిరూపంగా వ్యవహరించలేదు.
నయా ఉదారవాదం ప్రతిపాదించబడినప్పుడు ఆ యా దేశాల పరిధుల్లోనే అక్కడి పెట్టుబడి కార్యకలాపాలు ప్రధానంగా కొనసాగేవి. కీన్స్‌ తన సిద్ధాంతాన్ని గురించి చర్చిస్తున్న కాలంలో ఈ విషయాన్నే ప్రత్యేకించి చెప్పేవాడు. కాని పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా సంచరించడం పెరిగాక ఈ ప్రాతిపదిక ఇంకెంత మాత్రమూ పనికిరాకుండా పోయింది. ఇప్పుడు ఒకవేళ దేశంలో ప్రజలందరూ కోరుతున్నారు గనుక సామాజిక హేతుబద్ధత ప్రాతిపదికన మన దేశం వరకూ ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని నియంత్రిద్దాం అని ప్రభుత్వం భావించినా, అందుకు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒప్పుకోదు.
అందుచేత ఉదారవాద సిద్ధాంతపు ప్రస్తుత సంక్షోభపు మూలాలు ప్రపంచీకరణ అనే ప్రక్రియలో ఉన్నాయి. ఐతే నయా ఉదారవాద సంక్షోభం ఫలితంగా భారీ స్థాయిలో నిరుద్యోగం తలెత్తినప్పుడే ఈ సిద్ధాంతమూ సంక్షోభంలో చిక్కుకుందన్న సంగతి స్పష్టంగా బైటపడింది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆయువు పట్టు అంతా ఈ నిరుద్యోగ సమస్య దగ్గరే ఉంటుందని కీన్స్‌ కూడా భావించాడు. రాజ్యం జోక్యం చేసుకుని దానిని గనుక పరిష్కరించకపోతే బోల్షివిక్‌ విప్లవం తరహాలో మొత్తం పెట్టుబ డిదారీ వ్యవస్థలో విప్లవాలు సంభవిస్తాయని హెచ్చరించాడు.
పెట్టుబడిదారీ వ్యవస్థలో మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు మించి జరిగే అధికోత్పత్తి ఫలితంగా ఏర్పడే సంక్షోభానికి పరిష్కా రంగా డిమాండ్‌ను పెంచాలని కీన్స్‌ సూచించాడు. డిమాండ్‌ను పెంచేవిధంగా రాజ్యం జోక్యం ఉండాలని ప్రతిపాదించాడు. అందుకోసం రాజ్యం తన ఖర్చును పెంచాలని, ఆ ఖర్చుల కోసం అవసరమైన ఆదాయాన్ని, పన్నులను పెంచడం ద్వారా రాబట్టాలని చెప్పాడు. సంపన్నుల మీద అదనంగా పన్నులను వేయడం సాధ్యం కాకపోతే ప్రభుత్వం లోటు బడ్జెట్‌ ద్వారా ఖర్చు పెంచాలని చెప్పాడు. శ్రామిక ప్రజల మీద అదనంగా పన్నులను విధిస్తే వారు మామూలుగా సరుకులను కొనుగోలు చేయడానికి వినియోగించే సొమ్ము నుంచే ఆ పన్నులు చెల్లించవలసి వస్తుంది. అప్పుడు మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గుతుంది. అందుచేత శ్రామిక ప్రజల మీద అదనపు పన్నులను విధించడం వలన డిమాండ్‌ పెరగదు. సంక్షోభమూ నివారించబడదు.
ఐతే రాజ్యం డిమాండ్‌ను పెంచడం కోసం చేయవలసిన అదనపు ఖర్చుకు సరిపడా ఆర్థిక వనరులను సమీకరించడానికి కీన్స్‌ ప్రతిపాదించిన రెండు మార్గాలూ ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి అంగీకారం కావు. అది సంపన్నుల మీద అదనపు పన్నులను విధించడానికీ ఒప్పుకోదు, బడ్జెట్‌లో ద్రవ్య లోటు పెంచడానికీ ఒప్పుకోదు. అంటే సంక్షోభ నివారణకు రాజ్యం ఏ విధంగానూ జోక్యం చేసుకోరాదన్నదే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి భావిస్తుంది. అందుచేత కీన్స్‌ ప్రతిపాదించిన నయా ఉదారవాదం పెట్టుబడి ప్రపంచీకరణ జరిగిన ప్రస్తుత కాలంలో పనికిరాకుండా పోయింది. నయా ఉదారవాద విధానాలు కొనసాగడానికి ముందు దారి లేకుండా మూసుకు పోయింది. ఇది నయా ఉదారవాద రాజకీయ, తాత్విక సిద్ధాంతానికి పట్టిన సంక్షోభం.
ఈ ఆర్థిక సంక్షోభం ఏవిధంగా పరిణమిస్తోందో యూరప్‌ను పరిశీలిస్తే బాగా బోధపడుతుంది. 1970 దశకం మధ్య కాలం వరకూ (అంటే సుమారు 1975 వరకూ) యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో నిరుద్యోగం 3 శాతంగా చాలా కాలంపాటు కొనసాగింది. 1970 దశకం చివరి నుండీ, 1980 దశకం అంతా ఈ నిరుద్యోగం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ కాలంలోనే అక్కడ ప్రపంచీకరణ క్రమం అమలు మొదలైంది. అలా పెరిగి 7 శాతానికి నిరుద్యోగం చేరింది. (ప్రస్తుతం ఇది 15 శాతంగా ఉంది) అక్కడి ప్రభుత్వాలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా, నిరుద్యోగం తగ్గలేదు.
ప్రపంచీకరణ అమలులో ఉన్నాక, ఏ ఒక్క ప్రభుత్వమో విడిగా తన దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి జోక్యం చేసుకునేందుకు పూనుకుంటే అది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో తలపడవలసి వస్తుంది. అప్పుడు ఆ ద్రవ్య పెట్టుబడి సదరు దేశాన్ని విడిచిపెట్టి బైటకు పోతుంది. దానివలన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. ఇలా జరగకుండా ఉండడానికి అన్ని దేశాలూ ఒక దగ్గరకు వచ్చి ఒకే విధమైన విధానాన్ని అమలు చేస్తే అప్పుడు ద్రవ్య పెట్టుబడి బైటకు పోయే అవకాశాలకు చెక్‌ పెట్టవచ్చు. అన్ని దేశాలూ తమ ఆర్థిక వ్యవస్థల్లో జోక్యం పెంచుకుని నిరుద్యోగాన్ని తగ్గించేందుకు పూనుకోవచ్చు.
ఈ విధంగా చేయాలంటే కాస్త ముందో, వెనుకో, ఆ దేశాలు తమ వాణిజ్యం మీద కూడా నియంత్రణ చర్యలు చేపట్టాలి. కొన్ని ఆంక్షలు విధించాలి. ఈ విధంగా చేయడం అంటే అది పెట్టుబడి తన ఇష్టం వచ్చినట్టు సంచరించగల పరిస్థితి లేకుండా చేయడమే ఔతుంది. దీనిని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మొత్తంగా వ్యతిరేకిస్తుంది. ఐనా లెక్క చేయకుండా ప్రభుత్వాలు ముందుకు సాగాలంటే, ఆ ప్రభుత్వాలు అంతర్జాతీయ గుత్త పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా తక్కిన వర్గాలను కూడగట్టి ప్రత్యామ్నాయాన్ని రూపొందించాల్సి వుంటుంది.
ఆ విధంగా ప్రపంచ దేశాల నడుమ ఒక నిజమైన సమన్వయం ఏర్పడి ఆ యా ప్రభుత్వాలు తమ తమ ఆర్థిక వ్యవస్థల్లో బలంగా జోక్యం కల్పించుకోవాలంటే ఒకవిధమైన అంతర్జాతీయత అవసరం. కాని పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక స్వత:సిద్ధమైన లక్షణం ఉంది. ముందుగా అభివృద్ధి చెందిన దేశాలు తమకన్నా వెనుకబడిన దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి. ఈ మాదిరి ఆధిపత్యం కొనసాగుతున్నంత కాలమూ పెట్టుబడిదారీ విధానంలో అంతర్జాతీయ సమన్వయం, సహకారం నిజమైన అర్ధంలో సాధ్యం కాదు. మహా అయితే, సంపన్న పెట్టుబడిదారీ దేశాల వరకూ తమలో తాము ఒకమేరకు సహకరించుకుంటూ, రెండోపక్క వెనుకబడిన దేశాల ఆర్థిక వ్యవస్థలలో తాము నిర్దేశించిన ద్రవ్య నియంత్రణ చర్యలు కొనసాగేట్టు చేయగలుగుతాయి. అంటే సామ్రాజ్యవాదం మూడో ప్రపంచ దేశాల మీద తన పట్టును మరింత బిగిస్తుంది. మరి ఆవిధంగా కొన్ని దేశాల మీద సామ్రాజ్యవాదపు పట్టు బిగించడం అంటే ఉదారవాదం ప్రబోధించే మానవ స్వేచ్ఛకు విఘాతం కాదా? అంటే ఉదారవాదం ప్రబోధించే మానవ స్వేచ్ఛకు, పెట్టుబడిదారీ విధానం కొనసాగడానికి నడుమ పొంతన లేకుండా పోవడమే కదా?
ఇలా ఎటూ తేల్చుకోలేకుండా ఉన్న పరిస్థితి ఉదారవాద సిద్ధాంత సంక్షోభపు సారాంశం. నిరుద్యోగం విపరీతంగా పెరుగుతూ వున్నప్పుడు, దాని ఫలితంగా శ్రామికుల వేతనాలు కూడా తగ్గిపోతూ వున్నప్పుడు, ఇదంతా కలిసి శ్రమజీవుల జీవితాలను అంతకంతకూ దుర్భరం చేస్తున్నప్పుడు మానవ స్వేచ్ఛ వర్ధిల్లుతోందని ఉదారవాదం చెప్పుకోలేదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే నయా ఉదారవాద చట్రం పరిధి నుండి బైటపడి ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను రూపొందించాలి. అంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను దాటి సమాజాన్ని ఒక కొత్త దశ వైపు నడిపించే ప్రత్యామ్నాయ శక్తుల కలయిక జరగాలి (అలా కాకుండా మళ్ళీ నయా ఉదారవాద దశకు ముందు ఉన్న దశవైపు వెనక్కి పోవాలనే వాదన కూడా ఉంది. కాని అలా వెనక్కి పోవడం అంటే మళ్ళీ స్వేచ్ఛాయుత పోటీ నెలకొన్న పెట్టుబడిదారీ దశకు పోవాలని అర్ధం. మరి ఆ పోటీ లోంచే కదా గుత్త పెట్టుబడిదారీ దశ వచ్చింది? అక్కడి నుండే కదా ప్రస్తుత సమస్యలన్నీ వచ్చాయి? అందుచేత అది పరిష్కారం కాజాలదు. పోనీ, వెనుకబడ్డ దేశాలను మినహాయించి సంపన్న దేశాల వరకూ సహకరించుకుంటూ నిరుద్యోగాన్ని అదుపు చేయాలనుకుంటే, అది ఉదారవాద ఆదర్శాలకే భిన్నం కదా?
గతంలో మహా మాంద్యం నెలకొన్నప్పుడు సాంప్రదాయ ఉదారవాదం దిక్కు తోచని స్థితిలో నిస్సహాయంగా ఉండిపోయింది. మళ్ళీ ప్రస్తుతం నెలకొన్న మహా మాంద్యంలో నయా ఉదారవాదం అదే మాదిరిగా నిస్సహాయంగా ఉంది. మరి వేరే ఇతర ఉదారవాదమూ పరిష్కారం చూపడానికి ముందడుగు వేయడం లేదు. అది సాధ్యం కూడా కాదు. ఈ పెట్టుబడిదారీ చట్రాన్ని యథాతథంగా కొనసాగిస్తూ ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం చూపగలిగే మందు ఎక్కడా లేదు.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

➡️