దాహం..దాహం!

Apr 11,2024 06:04 #artical, #edit page, #water crisis

మండుటెండలు ముంచుకు రావడంతో రాష్ట్రం దాహంతో అంగలారుస్తోంది. ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటగా, చెరువులు వట్టిపోయాయి. భూగర్భజలాలు ఏటికేడాది పాతాళం వైపు పరుగులు తీస్తున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం తాగునీటి కోసం ప్రజలు వెంపర్లాడక తప్పని స్థితి ఏర్పడుతోంది. అయితే, గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. సార్వత్రిక ఎన్నికలు కూడా ఈ సమయంలోనే జరుగుతుండటంతో అధికార యంత్రాంగం దృష్టి అటువైపు కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. మరోవైపు రానున్న రోజుల్లో ఎండలు, వడగాడ్పులు మరింత ఉధృతంగా ఉంటాయన్న హెచ్చరికలు వాతావరణ శాఖ నుండి అందుతున్నాయి. జూన్‌ నెలాఖరులోనో, జులైలోనో రుతుపవనాలు పలకరించేంత వరకు ఈ స్థాయిలోనో, మరింత ఎక్కువగానో ఎండలు మండనున్నాయి. అదే జరిగితే తాగునీటి కొరత రాష్ట్రంలో మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మార్చి నెల మధ్యలోనే రాష్ట్రంలో నీటి కొరత ప్రారంభమైంది. ఏప్రిల్‌ రెండవ వారానికే రాష్ట్రంలోని సగానికన్నా ఎక్కువ భాగంలోని ప్రజానీకం తాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు. రాయలసీమలోని దాదాపుగా అన్ని జిల్లాలోనూ నీటి కొరత ఇప్పటికే తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రంలోని 679 మండలాలకుగాను దాదాపుగా 500 మండలాల్లో తాగునీటికి కటకట ఏర్పడింది. సుమారుగా 400 మండలాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని మార్చి నెలాఖరులోనే సంబంధిత జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదించారు. వాటిలో అధిక భాగం ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైనాయని, వంద మండలాల్లో కూడా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను ప్రారంభించలేదని సమాచారం!
పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లోని ఏడింటిలో మూడు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కేంద్రమైన కడపతో పాటు పలమనేరు, పెనుగొండ, పొదిలి, హిందూపూర్‌, ఒంగోలు, పొదిలి పట్టణ స్థానిక సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటన్నింటిలో ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో 35 మున్సిపాల్టీల్లో రెండు, మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ జాబితాలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ కేంద్రం పులివెందులతో పాటు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గ కేంద్రం కుప్పం కూడా ఉండటం గమనార్హం. పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లే తిరుపతిలో కూడా రెండు, మూడు రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు. మరో 52 పట్టణ పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒక పూట ప్రస్తుతానికి నీటిని ఇస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న నీటి నిల్వలను పరిశీలిస్తే ఈ మాత్రపు ఊరట కూడా ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు. అధికారిక సమాచారం ప్రకారమే ఏప్రిల్‌ నెలాఖరు నాటికి దాదాపుగా 20, మే నెల రెండు, మూడు వారాలకి మరో 25 పట్టణ స్థానిక సంస్థల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటనున్నాయి. అంటే, రానున్న రోజుల్లో ఏ స్థాయిలో నీటి ఎద్దడి ఉంటుందో ఊహించుకోవచ్చు.
ప్రజల దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన ఈ సమస్యను ముఖ్యమంత్రిగాని, ప్రతిపక్ష నేతగాని నామమాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. అక్కడక్కడ నిలదీసిన వారికి ఆపద మొక్కులతో ముఖ్యమంత్రి సరిపెట్టారు. వేసవిలో నీటి కొరత ఈ ఏడాది కొత్తగా వచ్చిందేమి కాదు. పైగా డిసెంబర్‌ నెలలోనే వేసవి, వడగాడ్పుల తీవ్రత గురించి వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినా, ప్రభుత్వ యంత్రాంగంలో నామమాత్రపు చలనం కూడా లేదు. మార్చి నెల వరకు ఈ అంశంపై పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశాన్ని అధికార యంత్రాంగం నిర్వహించలేకపోయిందంటే ఏ స్థాయిలో నిర్లక్ష్యం నెలకొందో అర్ధం చేసుకోవచ్చు. రెండు, మూడు రోజుల క్రితం సాగర్‌ రిజర్వాయర్‌ నుండి చెరువులకు వదలిన నీరు ఎంతకాలం ఆదుకుంటుందో చూడాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ లతో కలిపి రాష్ట్రంలో ఉన్న 108 రిజర్వాయర్లలో ప్రస్తుతం నామమాత్రపు నీటి నిల్వలే ఉన్నాయి. అధికార యంత్రాంగం ఇప్పటికైనా ఈ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. వాతావరణ మార్పుల కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనంలో ఉంచుకుని, కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలు చేయాలి.

➡️