కార్మికోద్యమంతో మమేకమైన మహిళా ఉద్యమం

Feb 22,2024 07:53 #Editorial

కార్మికవర్గ పోరాటాలు, ఉద్యమాలు లేకుండా విశాఖపట్నం లేదు. ఆ పోరాట విజయాలు లేకుండా ప్రజల జీవితాల్లో ఇంత గొప్ప మార్పు లేదు. మహిళా పోరాటాలు, ఉద్యమాలు…వాటికి కార్మిక సంఘ నేతల తోడ్పాటు ఎంతో వుంది. కార్మికోద్యమానికి భుజం భుజం కలిపి నడిచిందిక్కడ మహిళా ఉద్యమం. అది సారా ఉద్యమమైనా, విశాఖ నగరంలో పేదలకు ఇళ్ల స్థలాల పోరాటమైనా మహిళ చురుకైన పాత్ర పోషిస్తూ వస్తోంది.

గుంటూరు జిల్లా చిలుమూరులో 1947 ఫిబ్రవరిలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలో విజయన గరానికి చెందిన డాక్టర్‌ లక్ష్మి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, దిగుమర్తి సువర్ణబాయి కార్యవర్గ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. నెలరోజుల పాటు జరిగిన మహిళా రాజకీయ శిక్షణా తరగతుల్లో ప్రకృతి, సమాజం, ప్రపంచ రాజకీయ, చరిత్ర అంశాలతో పాటు ప్రసూతి, శిశు పోషణపై డాక్టర్‌ అచ్చమాంబ బోధించేవారని, అది నేర్చుకొని ఎంతోమందికి పురుడు పోసేవారమని వైదాడ ధర్మారం చెప్పారు. ధర్మారం నివశించిన గొల్లలపాలెం, కర్రి పార్వతమ్మ స్వగ్రామం తిమ్మరాజుపేటలో మహిళా సంఘ కార్యక్రమాలు జరుగుతుండేవి. ఆ ప్రాంతంలో అప్పయ్యమ్మ, వెంకటరత్నం, అనకాపల్లిలోని గవరపాలెంలో పెంటకోట చిట్టెమ్మడు పనిచేశారు. మహిళా ఉద్యమం, వామపక్ష ఉద్యమంలో అనేక ఆటుపోటులు ఎదురవడంతో ఉద్యమ పునర్నిర్మాణం కోసం 1967లో గట్టి ప్రయత్నం జరిగింది. పూర్వ గుంటూరు జిల్లా కాజలో కొద్దిమంది మహిళా కార్యకర్తలతో రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి. ఆ తరగతులకు మల్లు స్వరాజ్యం, మోటూరు ఉదయం, మానికొండ సూర్యావతి వచ్చారు. ఆనాడు విశాఖపట్నం జిల్లా మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా ధర్మారం, కర్రి పార్వతమ్మతో కమిటీ ఏర్పాటైంది. వీరు ఉద్యమానికి బాట వేశారు. 1976 నుంచి కార్మికోద్యమంతో మమేకమైన చరిత్ర ఇక్కడ మహిళా ఉద్యమానికి వుంది. దీనికి ముందు నుంచీ పోర్టు వర్కర్సు యూనియన్‌ కాలం నుంచి కూడా వుంది.

విశాఖ నగరంలో కార్మికోద్యమంతో పాటు మహిళా ఉద్యమం మమేకమై, గర్వించదగ్గ పాత్ర పోషించింది. మహిళలు, మహిళా ఉద్యమం పాత్ర లేకుండా కార్మిక పోరాటాలు జరగలేదనడంలో అతిశయోక్తి లేదు. కార్మిక నాయకులు, కుటుంబాలు ‘రండి మా ఇంటికి’ అని తీసుకెళ్లి కుటుంబంలోని మహిళలు, దగ్గర బంధువులను పరిచయం చేసి మహిళా ఉద్యమానికి అప్పజెప్పేవారు. గ్రామీణ ప్రాంతంలోని అనకాపల్లి, మునగపాకలో రైతాంగ, కార్మిక పోరాటాల ప్రభావం ఆ కుటుంబాల మహిళల్లో వుండేది. విశాఖపట్నం కార్మికవర్గ చరిత్ర, మహిళా ఉద్యమ చరిత్ర నుంచి నేర్చుకోవాల్సింది, గుర్తించుకోవాల్సింది కుటుంబ సంబంధాలు. ఈ కుటుంబ సంబంధాలకు ఎవరిది ఏ ప్రాంతం, ఏ కులం, ఏ మతం అని లేదు. కష్టసుఖాల్లో ఇతర కుటుంబాలు దన్నుగా నిలబడ్డ ఘనమైన ఉద్యమ చరిత్ర విశాఖలో ఉంది.

ధర్మారం ఇంట్లో నేనున్నప్పుడు జీవితాలను అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడింది. హిందూస్తాన్‌ షిప్‌ యార్డులో ఆఫ్‌లోడ్‌ సమస్య ముందుకొచ్చినప్పుడు మహిళా సంఘం విశాఖ జిల్లా కమిటీ చొరవ తీసుకొని షిప్‌యార్డు కుటుంబాల్లోని మహిళలతో పోస్టుకార్డు ఉద్యమం నడిపింది. ఒక్కొక్క పోస్టు కార్డుపై పది పదకొండు సంతకాలు చేయించి, వెయ్యి కుటుంబాలను కలిసి 11 వేల సంతకాలు సేకరించి ‘సేవ్‌ షిప్‌యార్డు’ (షిప్‌యార్డును రక్షించండి) అనే నినాదంతో ప్రధానమంత్రికి ఉత్తరాలు పంపించాం. దీనికి ప్రధాన భూమిక డి.శారద పోషించారు. బిహెచ్‌పివి లాకౌట్‌ చేసినప్పుడు కార్మికుల నిరాహార దీక్షల్లో కార్మిక కుటుంబాల మహిళలతో నిరాహార దీక్షలో పాల్గొన్నాం. బిహెచ్‌పివిని ‘ఎల్‌ అండ్‌ టి’ కి ఇవ్వడానికి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నా లను అడ్డుకోవడంలో సిఐటియు, కార్మికవర్గం భీకరమైన పోరాటం చేసినప్పుడు ఆ యా కుటుంబాల మహిళలను సమీకరించి రోడ్డుకు అడ్డంపడి ఎల్‌ అండ్‌ టి వాహనాలను అడ్డుకున్నాం. ఈ పోరాటంలో పాల్గొన్న వారంతా మహిళా ఉద్యమంలో ఆరితేరిన వారు కాదు. సాధారణ కార్మిక కుటుంబాల నుంచి వచ్చిన వారే. రోడ్డుకు అడ్డం పడ్డప్పుడు శరీరం గీసుకు పోతుందా? రోడ్డుపై మట్టి వుందా? ఉమ్ములున్నాయా? అని మహిళలు ఆలోచించలేదు. ఎల్‌ అండ్‌ టి ని ప్రతిఘటించి, బిహెచ్‌పివిని రక్షించుకోవాలన్న పట్టుదలతో వీరోచితంగా పోరాడి వాహనాలను అడ్డుకున్నారు.

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీ కరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ పగలు, రాత్రి కలవరిస్తున్నారు. ప్లాంట్‌ పరిరక్షణకు కార్మికులు, కార్మిక కుటుంబాలు, మహిళలు పోరాడుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణ కాలం నుంచి జరుగుతున్న ప్రతీ పోరాటంలోనూ మహిళల భాగస్వామ్యం వుంది. కాంట్రాక్ట్‌, నిర్మాణ కార్మికుల కనీస వేతనాల కోసం జరిగిన పోరాట సందర్భంగా కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో రక్తమోడుతున్న కార్మికులను…శారద, శేషారత్నం సహా పలువురు మహిళలను మోసుకొని వెళ్లారు. వైద్యం అందక ఒక మహిళ చనిపోవడంతో, ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని చేసిన పోరాటంలో మహిళలందరినీ పోలీసు స్టేషన్‌లో పెట్టినందుకు నిరసనగా స్టీల్‌ప్లాంట్‌ సిఎమ్‌డి ఇంటిని ముట్టడించినప్పుడు, సిఎమ్‌డి తప్పించుకొని వెళ్లాలన్న ప్రయత్నాలపై శారద, జి.మణి ఆయన కారుకు అడ్డంపడ్డారు. మహిళల వీరోచిత పోరాటంతో కార్మికులు పెద్ద ఎత్తున కదిలారు. ట్రాలర్స్‌ వర్కర్ల సమ్మెలో కార్మిక కుటుంబాల మహిళలు పాల్గొనేలా మహిళా సంఘం కృషి చేసింది. తొలుత పదుల సంఖ్యలో వచ్చిన జాలారిపేట మత్స్యకార మహిళలు, కలెక్టరేట్‌ ప్రదర్శనకు వందలాదిగా వచ్చారు. పోలీసు లాఠీ ఛార్జీలో ఓ మహిళ చెవిపోగు తెగి రక్తం కారుతున్నా లెక్క చేయకుండా ఎంతో ధైర్యంగా పోలీసు స్టేషన్‌లో వున్న మహిళల మాటలు నేటికీ గుర్తుకొస్తున్నాయి. డిఫెన్స్‌ కార్మికుల సమ్మెలో ఆ కుటుంబాల మహిళలు గేటు దగ్గర బైఠాయించారు.

కార్మికవర్గ పోరాటాలు, ఉద్యమాలు లేకుండా విశాఖపట్నం లేదు. ఆ పోరాట విజయాలు లేకుండా ప్రజల జీవితాల్లో ఇంత గొప్ప మార్పు లేదు. మహిళా పోరాటాలు, ఉద్యమాలు…వాటికి కార్మిక సంఘ నేతల తోడ్పాటు ఎంతో వుంది. కార్మికోద్యమానికి భుజం భుజం కలిపి నడిచిందిక్కడ మహిళా ఉద్యమం. అది సారా ఉద్యమమైనా, విశాఖ నగరంలో పేదలకు ఇళ్ల స్థలాల పోరాటమైనా మహిళ చురుకైన పాత్ర పోషిస్తూ వస్తోంది. బూతు సినిమాలు ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్లకు వెళ్లి పేడ పోసి ఆ తరహా సినిమాలు ఆపడంలో మహిళా సంఘం కార్యకర్తలు చురుగ్గా పనిచేశారు. స్త్రీల సమస్యలు, వరకట్నం, అత్యాచారాలు, వేధింపులు, హత్యలు జరిగినప్పుడు జోక్యం చేసుకొని కేసులు కట్టించి శిక్ష పడేలా పనిచేస్తోంది. హత్య చేసి ఆత్మహత్య అని చిత్రీకరించి తప్పించుకోవాలని చూసినప్పుడు న్యాయం కోసం గొంతెత్తి నినదిస్తోంది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. 2001 నవంబరులో జరిగిన ఐద్వా ఏడవ మహాసభకు స్టీల్‌ప్లాంట్‌ అతిథ్యమివ్వగా, రెండు దశాబ్దాల తరువాత ఈ ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జరగనున్న ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలకు విశాఖపట్నం వేదికైంది.

 

ఎస్‌. పుణ్యవతి
ఎస్‌. పుణ్యవతి
➡️