ప్రముఖ కోలీవుడ్‌ సినీ నటుడు అరుల్‌మణి కన్నుమూత

తమిళనాడు : ప్రముఖ కోలీవుడ్‌ సినీ నటుడు అరుల్‌మణి (65) గుండెపోటుతో కన్నుమూశారు. అరుల్‌ మణికి నిన్న రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను రాయపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

10 రోజులుగా ఎన్నికల ప్రచారం…
అరుల్‌ మణి మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. అరుల్‌మణి ప్రస్తుతం అన్నాడీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటున్నారు. గత పది రోజులుగా పలు నగరాల్లో ఆయన నిర్విరామంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గురువారం చెన్నైకి వచ్చిన అరుల్‌ మణి అస్వస్థతకు గురయ్యారు.

అరుల్‌మణి ప్రముఖంగా సింగం- 2, సామాన్యన్‌, స్లీప్‌లెస్‌ ఐస్‌, థెండ్రాల్‌, తాండవకొనే, రజినీకాంత్‌ లింగతో సహా పలు తమిళ చిత్రాలలో నటించారు. సూర్య సింగం, సింగం 2 సినిమాల్లో విలన్‌గా నటించారు. అరుల్‌మణి తమిళ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించారు. ‘అళగి’ సినిమా అరుల్‌ మణి కెరీర్‌ను మలుపు తిప్పింది. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు అళగి, తెనారల్‌, పొన్నుమణి, ధర్మశీలన్‌, కరుపు రోజా, వేల్‌, మరుదమలై, కత్తు తమిళ్‌, వన యుద్ధం సహా 90 చిత్రాల్లో నటించారు. దాదాపు అందరు ప్రముఖ హీరోలతో ఆయన నటించారు.

➡️