వెండితెరపై ఎర్రజెండా పాటలు

Apr 29,2024 08:30 #movie

సినిమా చరిత్రలో కార్మికుల కథాంశంతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. మన తెలుగులో అయితే ప్రముఖ హీరోలు కార్మిక నాయకులుగా, కార్మికులుగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు కూడా. కార్మికుల పాత్రల్లో అలరించిన కథానాయకులలో అలనాటి హీరోలు ఎన్‌టిఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు తదితరులు ఉన్నారు. వారు పోషించిన పాత్రలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ పాత్రలకు తగ్గట్లు- పాటల రచయితలు వాళ్ల తరపున కలం ఎత్తితే, గాయకులు తమ గళాన్ని బలంగా వినిపించారు.

‘శెభాష్‌ రాముడు’ చిత్రంలో ఘంటసాల గళంతో ‘జయమ్ము నిశ్చయమ్మురా.. జంకు గొంకు లేక నువ్వు సాగిపొమ్ము రా’ అంటూ సాగే పాటలో ఎన్‌టిఆర్‌ కార్మికుల పక్షాన కదం తొక్కడం చూపించారు. ఈ పాటలో ఆయన రిక్షా కార్మికుడిగా కనిపిస్తారు. యమగోల సినిమాలోనూ అక్కడ కార్మిక సంఘం పెట్టి, హక్కులకై యమకింకరులందరినీ కదిలిస్తాడు. నాగేశ్వరరావు, శోభన్‌బాబు, తదితరులు కార్మికులుగా ఆయా పాత్రల్లో ఒదిగిపోయేవారు. మేడే సందర్భంగా ఆయా చిత్రాల్లో వచ్చిన గీతాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తాయి. అభ్యుదయ సినిమాల నిర్మాణం విరివిరిగా జరుగుతున్న కాలంలో కఅష్ణ అనేక సాంఘిక చిత్రాల్లో కర్మాగార కార్మికుడిగా నటించారు. ‘ఎన్‌కౌంటర్‌’ చిత్రంలోనైతే నక్సలైట్‌గానూ నటించారు.

మేడే పాటలు

ఎర్రజెండా సినిమాలు అనగానే గుర్తొచ్చే పేర్లు మాదాల రంగారావు, ఆర్‌.నారాయణమూర్తి. వీళ్లు నమ్మిన సిద్ధాంతం కోసం తీసిన ప్రతి సినిమా కార్మిక, శ్రామిక, బడుగు, బలహీన వర్గాల పక్షమే నిలుస్తుంది. చివరికంటూ కార్మికులు, శ్రామికులు, రైతుల పక్షాన నిలిచే సినిమాలు అందించిన వారిలో వీరి తరువాతే ఎవరైనా! ‘అన్యాయం.. అక్రమాలు.. దోపిడీలు.. దురంతాలు.. ఎన్నాళ్లని ఎన్నేళ్లని నిలదీసినదీ రోజే మేడే..’ అంటూ కార్మిక దినోత్సవానికి సిసలైన అర్థం చెబుతూ సాగుతుంది ‘ఎర్రమల్లెలు’ చిత్రంలోని పాట. ఈ చిత్రంలో మురళీమోహన్‌ కూడా కీలక పాత్రలో కనిపిస్తారు.

విప్లవ పాటల నాయకుడు
వెండితెరపై మేడే అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఆర్‌.నారాయణ మూర్తి. ఆయన పాట, పాత్ర.. ఎప్పుడూ పీడితుల పక్షమే.. శ్రమ జీవుల హక్కుల కోసమే. నారాయణమూర్తి పాత్రకు వందేమాతరం శ్రీనివాస్‌ గళం తోడై కదం తొక్కిన పాటలెన్నో. ‘ఎర్ర సైన్యం’లో ‘బంజారే బంజో.. వోనారే బంజా’ అటూ సాగే పాట ఆద్యంతం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ‘ఒరేరు రిక్షా’ సినిమాలో ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను..’ అంటూ సాగే పాటలో రిక్షా కార్మికుల బతుకువెతలను కళ్లకు కట్టినట్లు చూపించారు.
‘చీమల దండు’ చిత్రంలో ‘ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీయాళ్లో.. ఎర్రెర్రనిదీ జెండెన్నీయల్లో’ అంటూ సాగిన పాట అభిమానుల నాల్కలపై కొన్ని దశాబ్దాల పాటు నాట్యమాడింది. సామాన్య జనాన్ని ఉర్రూతలూగించిన పాటల్లో ఇదొకటి. ‘సింగన్న’ చిత్రంలో .. ‘ఆయారే మేడే.. ఆయుధమై నేడే..” అంటూ సాగిన పాటలో కార్మికులను సంఘటిత శక్తిగా చాటిచెబుతుంది.

కార్మిక నాయక పాత్రల్లో ప్రముఖ నటులు
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ కూడా కార్మిక పాత్రలు పోషించి, అభిమానులను అలరించారు. సింగరేణి కార్మికుడిగా బాలకృష్ణ నటించిన సినిమా ‘నిప్పురవ్వ’. ‘రండి కదలి రండి.. నిదుర లెండి.. కలసి రండి’ అంటూ ఆ చిత్రంలో సాగిన పాటలో కార్మిక నాయకుడిగా బాలకృష్ణ మెప్పించారు. మోహన్‌బాబు నటించిన ‘శ్రీరాములయ్య’ చిత్రంలోని ‘భూమికీ పచ్చాని రంగేసినట్టే ఓయమ్మా లాలో.. ‘ అనే పాట ప్రతి కార్మిక దినోత్సవ వేడుకల్లో మార్మోగుతూనే ఉంటుంది. శ్రమను నమ్ముకున్న ప్రతి ఒక్కరి గుండె తడుతూనే ఉంటుంది. కేజే ఏసుదాస్‌ గళం నుంచి జాలు వారిన ఈ గీతం కర్షకుల కష్టం గురించి చెబుతూ సాగుతుంది. శ్రీహరి నటించిన ‘కుబుసం’ సినిమాలో పల్లె వృత్తుల వెతల్ని కళ్లకు కట్టేలా, గోరటి వెంకన్న అల్లిన పాట ‘పల్లె కన్నీరు పెడుతుందో.. ఓ యమ్మలాలా.. ‘ అంటూ సాగే పాటలో వలస బతుకుల కష్టాలను చాటిచెప్పారు.
ఇలా ఎన్నో గీతాలు కార్మికుల జీవితాన్ని, పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరించాయి. శ్రామికుల హక్కులు తెలియజేస్తూ.. ప్రజలను చైతన్యం చేశాయి.

➡️