ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి అభ్యర్థి మాధవిలత అనుచిత ప్రవర్తన .. వైరల్‌ వీడియో

హైదరాబాద్‌ :    కొందరు ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి కె. మాదవి లత అనుచితంగా ప్రవర్తించారు. బురఖా ధరించిన కొందరు ముస్లిం ఓటర్లను ఓటరు ఐడికార్డులపై ఉన్న ఫోటోలతో సరిపోల్చాలంటూ .. బురఖాను తొగించాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమె హైదరాబాద్‌ నియోజకవర్గం నుండి ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీపై పోటీ పడుతున్నారు. ఈ వీడియోపై అసదుద్దీన్‌ ఒవైసీ ఎన్నికల కమిషన్‌ (ఇసి)కి ఫిర్యాదు చేశారు.

ఓటు వేసిన తర్వాత పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన మాదవి లత, అజంపూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆగి, అక్కడ ఓటు వేయడానికి వేచి ఉన్న మహిళల ఐడిలను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఒక వీడియోలో, ఆమె బురఖా ధరించిన స్త్రీని తన ముసుగును  తీయాలని  అడుగుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.   ఐడీ కార్డులను సరిగ్గా తనిఖీ చేసిన తర్వాతే ఓటింగ్‌కు అనుమతించాలని లత పోలింగ్‌ అధికారులను హెచ్చరించారు.  అనంతరం ఆమె ఓటరు జాబితాలో తేడాలున్నాయని, పలువురు ఓటర్ల పేర్లు లేవని పేర్కొన్నారు.

➡️