నోట మాట రాలేదు..

Apr 3,2024 19:15 #Megastar Chiranjeevi, #movie

మహానటి సావిత్రి సినీ జీవితంపై వచ్చిన తాజా పుస్తకం ‘సావిత్రి క్లాసిక్స్‌’. ఈ పుస్తకాన్ని సంజయ్ కిషోర్‌ రచించారు. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ప్రచురణ చేశారు. తాజాగా ఈ బుక్‌ లాంచ్‌ వేడుక జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సావిత్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘మహానటి సావిత్రి గారిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పుస్తక ఆవిష్కరణకు వారధిగా నిలబడడం నాకు దక్కిన అమూల్యమైన అవకాశంగా భావిస్తాను. సావిత్రి గారి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. నాకు తల్లిలాంటి ఆమె గురించి చెప్పడానికి ఉద్వేగంతో మాటలు రావడం లేదు. నా యాక్టింగ్‌ కోర్స్‌ పూర్తి కాకుండానే నాకు ‘పునాదిరాళ్లు’ సినిమాలో హీరోగా ఛాన్స్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ వెళ్లేటప్పుడు నేను సావిత్రి గారితో కలిసి నటిస్తున్నానని తెలిసింది. ఆ విషయం తెలియగానే షాక్‌ కొట్టినట్లు అనిపించింది. షూటింగ్‌ అనంతరం నన్ను సావిత్రి గారి వద్దకు తీసుకువెళ్లగా.. ఆవిడను చూడగానే నాకు మాట రాలేదు. ఈ మహానటినేనా ఇన్నాళ్లు నేను ఆరాధించేది అనుకున్నాను. నన్ను చూడగానే, ‘నీ పేరేంటి బాబు’? అని అడిగారు. ‘చిరంజీవి’ అని చెప్పాను. ఆమె ‘శుభం’ అన్నారు. ఆ తర్వాత సినిమా షూటింగ్‌లో వర్షం పడింది. అక్కడ డ్యాన్స్‌ చేస్తూ కింద పడ్డాను.. కిందపడ్డా డ్యాన్స్‌ చేయడం ఆపలేదు. ఇది చూసిన సావిత్రి గారు నా దగ్గరకు వచ్చి ఫ్యూచర్‌లో మంచి నటుడివి అవుతావు అని మెచ్చుకున్నారు’ అంటూ చిరంజీవి సావిత్రి గారి గురించి కొన్ని విషయాలు ఆ కార్యక్రమంలో ముచ్చటించారు. ఈ వేడుకకు రచయిత సంజయ్ కిశోర్‌, నిర్మాత అల్లు అరవింద్‌, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, సావిత్రి కుమారుడు సతీశ్‌ కుమార్‌, మురళీ మోహన్‌, జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి తదితరులు హాజరయ్యారు.

➡️