మొక్కల సంరక్షణ

Jan 28,2024 09:33 #jeevana

పూట కూళ్ళ పెద్దమ్మ తన ఇంటి పెరట్లో బీర, చిక్కుడు, అనప, బెండ మొదలైన కూరగాయ విత్తులను నాటింది. కొన్ని రోజులకు ఆ విత్తనాలు మొలకెత్తాయి. ఒకరోజు ఆడుకోవడానికి అటుగా వచ్చిన రుద్ర, ఆ చిన్న మొక్కలను పీకడం మొదలు పెట్టాడు. అదిచూసిన పెద్దమ్మ ‘ఒరేరు భడవా మొక్కే కదా అని పీకేస్తే తిండిలేక చస్తాం’ అని అరుస్తూ రుద్రని ఇంట్లోకి తీసుకువచ్చింది. పెద్దమ్మ ఎందుకు అరుస్తున్నదో, ఎందుకు తిడుతున్నాదో వాడికి అర్థం కాలేదు. బుజ్జి బుజ్జి మొక్కలు చేత్తో పట్టుకుని పైకి లాగగానే వచ్చేస్తున్నాయి. అదెంతో వింతగాను, సరదాగా అనిపించింది రుద్రకి.ఎప్పుడు ఏ సరదా పని చేసినా ఊరుకునే పెద్దమ్మ ఈసారి ఎందుకు అరిచిందో తెలియక ‘మొక్కలని పీకితే ఏమౌతుంది పెద్దమ్మా’ అని అమాయకంగా అడిగాడు. ‘చచ్చి ఊరుకుంటాయి’ అని కోపంగా జవాబిచ్చింది పెద్దమ్మ. ‘పెద్దమ్మా నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ మొక్కలు పీకుతుంటే నాకు భలే సరదాగా అనిపిస్తోంది. అందుకే అలా చేశాను’ అంటూ ఏడుపు లంకించుకున్నాడు రుద్ర.’విషయం చెప్పకుండా పిల్లాడిమీద ఊరికే విసుక్కుంటే ఏం లాభం!’ అని ఆలోచించింది పెద్దమ్మ. ఇంట్లోకి వెళ్లి కోడి పట్టు(పొదగడానికి ఉంచిన గుడ్లు)లో నుంచి ఒక గుడ్డును తెచ్చి రుద్రకి చూపించింది. ‘చూడూ దీన్ని పగల కొడితే ఏమౌతుంది?’ అని అడిగింది. ‘పగిలి పోతుంది’ అని సమాధానమిచ్చాడు రుద్ర. ‘గుడ్డును పగలగొట్టడం వల్ల అందులోని నుంచి పిల్ల రాదు. అదే గుడ్డు 21 రోజులు కోడి పెట్ట కింద ఉంటే ఆ గుడ్డులో నుండి పిల్ల బయటికి వస్తుంది. కోడి పిల్ల పెరిగి పెద్దదైతే మళ్లీ మనకు బోలెడు గుడ్లు పెడుతుంది. వాటిని ఆహారంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ చిన్న చిన్న మొక్కలు ఎంతో ఉపయోగకారిగా ఉంటాయి. కూరగాయలు, పూలు, ఆకుకూరలు ఇచ్చే ఈ మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెరట్లో పచ్చని మొక్కలు ఉంటే స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చుకోవచ్చు. కాబట్టి చిన్నవైనా, పెద్దవైనా మొక్కలను పీకకూడదు’ అని వివరించి చెప్పింది. పెద్దమ్మ మాటలు శ్రద్ధగా విన్న రుద్ర ఆ రోజు నుండి మొక్కలను పీకడం మానేశాడు. పెద్దమ్మతో పాటు పాదులు తీసి, నీళ్లు పోశాడు. పెద్దమ్మ పెరటంతా కూరగాయలు, పూల మొక్కలతో ఎంతో ఆహ్లాదంగా తయారైంది. నీతి : ప్రకృతిని సంరక్షించుకోవాలంటే మొక్కలను రక్షించుకోవాలి.                     – కాశీ విశ్వనాథం పట్రాయుడు,94945 24445.

➡️