విలువైన కానుక

Dec 24,2023 10:05 #Jeevana Stories

రంగాపురం అనే గ్రామంలో రాజేష్‌, రమేష్‌ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి బడికి వెళ్లేవారు. రాజేష్‌ ధనిక కుటుంబంలో జన్మించాడు. రమేష్‌ చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు. రాజేష్‌ ఖరీదైన బట్టలు వేసుకునేవాడు. ఖరీదైన తిండి తినేవాడు. రమేష్‌ మధ్యాహ్నం ఒక్కోసారి భోంచేసేవాడు కాదు.

స్నేహితుల దినోత్సవం రోజున బడిలో ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిల్లలందరూ ఇష్టమైన కానుకలు తెచ్చుకొని ఒకరికొకరు పంచుకొని గౌరవించుకోవాలి అని నియమం పెట్టారు. విద్యార్థులందరూ చాలా సంబరపడ్డారు. ఆ రోజు కోసం ఎదురు చూశారు. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. బడిలో ప్రార్ధన ముగిసిన తర్వాత అందరూ వరుసగా నిలబడ్డారు. ఇక మిగిలింది ఒకరికొకరు కానుకలు పంచుకోవడం.

రాజేష్‌ పెద్ద చాక్లెట్‌ బాక్స్‌ తెచ్చాడు. అవి చాలా ఖరీదైనవి. మరికొందరు బిస్కెట్స్‌ తెచ్చారు. ఇలా ఎవరికి తోచినది వారు తెచ్చుకున్నారు. ఒకరికొకరు పంచుకున్నారు. రమేష్‌ మాత్రం ఖాళీ చేతులతో వచ్చాడు. ఉపాధ్యాయుడు పిలిచి ”నువ్వు ఏమి తీసుకురాలేదా’ అని అడిగారు. ”తెచ్చాను సార్‌. మా నాన్న తీసుకొస్తారు” అన్నాడు. అంతలోపే రమేష్‌ తండ్రి ఒక సంచి తెచ్చి అక్కడ పెట్టాడు. ఆ సంచిలో ఏమి తెచ్చాడా అని అందరూ ఆసక్తిగా చూశారు. రమేష్‌ తండ్రి సంచిలో నుంచి మొక్కలు బయటికి తీశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ‘మేము పేదవాళ్లం, ఇవి తప్ప వేరే కానుకలు ఇచ్చుకోలేం. ఈ ప్రత్యేకమైన రోజు ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలని నా కోరిక’ అని రమేష్‌ అనగానే ఉపాధ్యాయులు అందరూ చప్పట్లు చరిచారు. ‘నువ్వు తెచ్చిన కానుక చాలా విలువైనది. భావితరాలకు పనికి వచ్చే చక్కటి కానుక’ అంటూ రమేష్‌ని ప్రశంసించి, ఆ రోజు బహుమతికి ఎంపిక చేశారు.

– బళ్ల కృష్ణవేణి 93989 05803.

➡️