ఆకాశవాణితో ఆత్మీయ బంధం

Feb 17,2024 07:12 #akasavani, #Jeevana Stories

‘ఆమె జీవితం మొదలైనప్పటి నుంచి నాకు తెలుసు. నా జీవిత భాగస్వామి కంటే ముందే తను పరిచయమైంది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆమే నా లోకం. నేను నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నాతోనే ఉంటుంది. భోజనం చేసేటప్పుడు, పని చేసేటప్పుడు కూడా ఆమె నా పక్కన ఉండాల్సిందే’ అని కేరళకు చెందిన 81 ఏళ్ల పెద్దాయన ఇంతలా ప్రేమిస్తున్న ‘ఆమె’ వ్యక్తి కాదు.. ఓ పనిముట్టు. ఆలిండియా రేడియో (ఎఐఆర్‌) బ్రాడ్‌కాస్టింగ్‌ మొదలైనప్పటి నుంచి రేడియోతో ఆయన ఆత్మీయ అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ‘రేడియో నా జీవితాన్ని మార్చేసింది’ అంటున్న ఆ వ్యక్తి పేరు సి.కె.అలెగ్జాండర్‌. విశ్రాంత ఉపాధ్యాయుడు.

ఒక వ్యక్తిపై, వస్తువుపై ప్రేమానురాగాలు పెంచుకోవడం అందరూ చేసేదే. కానీ అలెగ్జాండర్‌ ప్రత్యేకం. రేడియో ప్రసారాలను అనుసరించడంతోనే ఆయన ఆగిపోలేదు. వాటిపై విశ్లేషణాత్మక చర్చలు జరుపుతూ ఎఐఆర్‌కి ఉత్తరాలు రాసేవారు. ఎంతలా అంటే ప్రతి కార్యక్రమంపై ఆయన స్పందించేవారు. అదే ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఉత్తమ రేడియో శ్రోతగా ఎంపికై 1980లో అప్పటి కేరళ కేంద్రమంత్రి పి.వసంత్‌ ద్వారా బహుమతి కూడా అందుకున్నారు.

‘రేడియో పెన్ను’ అని దానికి ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు అలెగ్జాండర్‌. ‘నా భార్య కంటే ముందే ఆమె (రేడియో) నా జీవితంలో భాగమైంది. పదేళ్ల క్రితం నా జీవిత భాగస్వామి నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది (చనిపోయింది). అప్పుడు, ఇప్పుడు కూడా నన్ను విడిచిపెట్టకుండా నాతోనే ఉండిపోయింది’ అంటూ రేడియో గురించి చాలా గొప్పగా చెబుతారు అలెగ్జాండర్‌.

ఎఐఆర్‌ నుంచి అవార్డులు, ప్రశంసలు అందుకోవడం అలెగ్జాండర్‌కి కొత్త కాదు. ఇప్పటికి రెండు సార్లు ఎఐఆర్‌ నుంచి ఉచిత దేశ పర్యటన అవకాశాన్ని కూడా ఆయన అందుకున్నారు. కార్యక్రమాలను వినడంతో సరిపెట్టక, తన విద్యార్థులకు వాటిని బోధించడం, ఆసక్తి గలవారికి అందులో శిక్షణ ఇచ్చి పలు కళా ప్రదర్శనల్లో వారిని విజేతలుగా నిలిపారు.

రేడియో గురించి ఒక్క మాటలో చెప్పమంటే.. ‘తెల్లవారుజాము 4:30 గంటలకే సుప్రభాతంతో నన్ను మేల్కొల్పుతుంది. నా భోజనం, నిద్ర, పని చేస్తున్నప్పుడు నాతోనే ఉంటుంది. అందుకే ఆమె నా ప్రియమైన నేస్తం.’ అంటారు అలెగ్జాండర్‌. 1995-96 సంవత్సరానికి గాను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అలెగ్జాండర్‌ 2019లో ఎఐఆర్‌ నుంచి ‘శ్రవణశ్రీ’ అవార్డు అందుకున్నారు. వస్తువులతో ఇంతలా బంధం పెనవేసుకునే అలెగ్జాండర్‌ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా తారసపడుతుంటారు.

➡️