వ్యర్థాల నుంచి కళాఖండాల సృజన

Dec 28,2023 08:07 #Arts, #Jeevana Stories
chalapaka kiran artist jeevana
  • కాగితాలు, దుస్తులు, ఆకులు, చెక్కలపై సూక్ష్మ కళాఖండాలు చూడటానికి ఎంతో అబ్బురంగా ఉంటాయి. అలాంటి సృజనకు పదునుపెట్టే బొమ్మలూ కొలువు తీరితే తనివి తీరా చూడకుండా ఉండలేము. వ్యర్థాలకు అర్థాలకు చెప్పేలా అద్భుతమైన కళాకృతులు సృజియిస్తున్నాడు కృష్ణా జిల్లా గన్నవరం మండలం రారునగర్‌కు చెందిన చలపాక కిరణ్‌. మనం చిన్న చూపు చూసే వ్యర్థాలను ఈ యువకుడు అద్భుత కళాఖండాలుగా మార్చేస్తున్నాడు. తండ్రి వృత్తిరీత్యా బంగారపు వస్తువులను తయారుచేసే నిపుణుడు కావడంతో.. అతడి ప్రతిభకు మరింత ప్రోత్సాహం దొరికింది.

నాల్గో తరగతి వయసు నుంచి తండ్రి చేస్తున్న బంగారు పనిలో ఆకృతులను గమనించేవాడు. అప్పటినుంచి సూక్ష్మ కళపై అభిరుచి ఏర్పడింది. తొలుత మైనంతో చిన్న చిన్న జంతువులు, వృక్షాల నమూనాలు తయారు చేశాడు. తనకు ఒక గుర్తింపు రావాలన్న ఉద్ధేశంతో ఆలోచనకు మరింత పదును పెట్టాడు. మునివేళ్లపై నిలిచే సైజులో ఉండేలా బైక్‌, విమానాలు, కార్లు, బోట్లు, రాకెట్లు వంటి అనేకమైన ఆకృతులు తయారు చేశాడు. పర్యావరణం, నది, సముద్రం వంటి నమూనా బొమ్మలు చూడముచ్చట గొల్పుతున్నాయి. సరికొత్తగా ఆకృతులు తయారుచేస్తూ తన ఇంటిని కళాఖండాలతో నింపేస్తున్నాడు. కిరణ్‌కు ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తిచేశారు.

  • పేపర్‌ ఆర్ట్‌లో అందెవేసిన చేయి

సూక్ష్మకళతో పాటు పేపర్‌ కటింగ్‌ వర్కు కిరణ్‌కు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. చేయి తిరిగిన కళాకారులు కూడా ఔరా అనిపించేలా తన పేపర్‌ కటింగ్‌లో కళాఖండాలు సృష్టిస్తున్నాడు. ఎవరి వద్దా ఎలాంటి తర్ఫీదు తీసుకోకుండానే కేవలం తన అభిరుచి, ఆసక్తిని నమ్ముకుని ఈ నైపుణ్యం సంపాదించాడు. పక్షులు, జంతువుల ప్రతిమలను ఆవిష్కరిస్తున్నాడు. అతికష్టమైన ముఖ చిత్రాలను సైతం చేయగలుగుతున్నాడు. దీనికి 18 నుంచి 36 గంటల సమయం పడుతుందని కిరణ్‌ చెబుతున్నారు. ఎవరి ముఖచిత్రాన్ని అయినా ఒకసారి చూసి, పేపర్‌పై ఆవిష్కృతం చేస్తున్నాడు. ఈ యువకుడి సృజన పట్ల ఎంతోమంది విద్యార్థులు ఆకర్షితులు అవుతున్నారు.

 

అభిరుచి అలవాటుగా మారింది : చలపాక కిరణ్‌, సూక్ష్మకళ నిపుణుడు

తొలుత మైనంతో కళాఖండాలు తయారు చేసేవాణ్ని. మైనంతో చేసే వస్తువులకు ఎక్కువ మన్నిక ఉండదన్న ఆలోచనతో చెక్కను ఎంచుకున్నాను. ఇంట్లో బల్లలు, కుర్చీలు, టేబుళ్లు వంటి వస్తువులు మరమ్మతులకు గురైనప్పుడు వాటి విడిభాగాలు తీసుకుని సూక్ష్మకళకు ప్రాణం పోశా. దీనికి ఇంట్లో దొరికే బ్లేడులు, స్టిక్కరింగ్‌, నైఫ్‌లే ఉపకరణాలుగా మార్చుకున్నాను.

 

– నెక్కలపు శ్రీనివాసరావు, ప్రజాశక్తి విలేకరి, గన్నవరం, సెల్‌ : 94925 25256

➡️