నాటి బాల్యం

May 19,2024 05:30 #feachers, #jeevana

కోడికూత గోలలోన
చుక్క పొద్దుయాలలేసి
చద్దిబువ్వ చంకనేసి
సాలుపోయ కదిలాము

పేడ పిడక మంటలోన
చలి మంటలు కాగాము
ఊబిలోన నీరు తాగి
ఊసులెన్నో చేశాము

ఈతమట్ట చేతబూని
గేదెనంత తోమాము
గెచ్చి కొట్టి గుర్రమెక్కి
దున్నపోతు తోలాము

బొంగరాల ఆటలోన
గింగిరాలు తిరిగాము
ఉంగరాల జుట్టు కొరకు
రింగులెన్నో తిప్పాము

వాన నీటి జాడిలోన
ఓడలెన్నో వదిలాము
రోత పుట్టి రోవ చేస్తే
రక్కి రక్కి విసిగాము

ఇసుకలోన ఈతగింజ
మొలకలెన్నో తిన్నాము
ఈత కొరకు ఊరు చుట్టు
చెరువులెన్నో ఈదాము

ఇరవై ఎక్కాలు వస్తే
ఐనస్టీన్‌ అయ్యాము
ఏ బీ సీ డీలు వస్తే
ఎదురే లేదన్నాము

పొద్దు వాలారాగానే
ఆటలెన్నో ఆడాము
బుద్దిలేక ఇద్ధిమరచి
బాసలెన్నో చేసాము

పండగేల సోడితోప
జుర్రుకొని తిన్నాము
ఉన్నవాడు లేనివాడు
కలసి మెలసి బతికాము

చల్లంబలి తాగిన
చల్లగానే బతికాము
చిల్లిగవ్వ లేకున్నా
చేయి చేయి కలిపాము

– వినోద్‌ కుత్తుం,పలాస, శ్రీకాకుళం జిల్లా
9634314502

➡️