ఆస్తమాను అశ్రద్ధ చేయొద్దు

Dec 10,2023 10:42 #Jeevana Stories

ఆస్తమా లేదా ఉబ్బసం చాలా మందిని బాధించే ఆరోగ్య సమస్య. ఇది ప్రాణాంతకం కాకపోయినా, తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. వ్యాధి ప్రారంభంలోనే గుర్తిస్తే తీవ్రతను చాలావరకూ తగ్గించటానికి మందులు ఉన్నాయి. దీర్ఘకాలంగా ఇబ్బందులకు గురిచేసే ఈ వ్యాధిని అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్సతో అదుపులో పెట్టుకుని వీలైనంత సాధారణ జీవనాన్ని గడపే అవకాశాలు కూడా ఉన్నాయి.

             ఏటేటా శీతాకాలం ముదిరేకొద్దీ వాతావరణంలో చల్లటి వాతావరణం, ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి తగ్గిపోతుండటం తెలిసిందే. ఈ కాలంలో సామాన్యంగా ప్రతి ఒక్కరిలో రోగ నిరోధక శక్తి మరింత పడిపోయి ఆస్తమా తీవ్రరూపం దాల్చుతుంది. ఇలాంటి సమయంలోనే ప్రతి ఒక్కరిలోనూ తమలో ఉన్న అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తుంటాయి. గాలి, నీటిలో క్రిమికీటకాల వ్యాప్తి ద్వారా కూడా వ్యాధులు వ్యాపిస్తుండటం సర్వ సాధారణంగా జరిగేదే. అయితే దగ్గు, జలుబు, ప్లూ వంటి ఇన్ఫెక్షన్లు చలికాలంలో అతిత్వరగా వ్యాప్తి చెందుతాయి. సైనస్‌ వంటి సమస్యలు ఉన్న వారు ఈ కాలంలో అత్యంత జాగ్రత్తగా మెలగటం ఉత్తమం. కీళ్ల నొప్పులు, చర్మవ్యాధుల సమస్యలు కూడా మామూలుగా ఉన్నవి తీవ్రంగా మారుతుంటాయి. పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వ్యాధి ముదరకముందే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లోని నిపుణులైన వైద్యుల సలహాలు తీసుకుంటే తద్వారా వాటిని సకాలంలో నియంత్రించటానికి అవకాశం ఉంటుంది. తీవ్రత పెరిగితే నియంత్రణకు కొంత సమయం పడుతుంది. జ్వరాలు, కీళ్లనొప్పులు, చర్మ సంబంధిత వ్యాధులు మొదలైన సమస్యలు ఉన్నప్పటికీ ఈ కాలంలో మరింతగా బాధించే సమస్యల్లో ఆస్తమా (ఉబ్బసం) ఒకటి.

Do not neglect asthma
Do not neglect asthma

ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే …

ఆస్తమా వ్యాధి చిన్న పిల్లల నుంచి పెద్ద వారిలో వచ్చే శ్వాస సంబంధితమైన వ్యాధి. ఇది వస్తే ఊపిరితిత్తుల్లో వాపు వల్ల వాయు మార్గాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడి రోగి సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఆస్తమా ఉన్న వారిలో ఆయాసం, దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి. వర్షాకాలం, శీతాకాలాల్లో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్‌-డి తగ్గిపోతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పడిపోయి ఆస్తమా తీవ్ర రూపం దాల్చుతుంది. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 30 నుంచి 35 సంవత్సరాల పెద్దవారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో వస్తే దానిని చైల్డ్‌ హుడ్‌ ఆన్సెట్‌ ఆస్తమా అని, పెద్దల్లో అయితే అడల్డ్‌ ఆన్సెట్‌ ఆస్తమాగా పిలుస్తారు. న్యూమోనియా, జలుబు వంటివి కూడా ఎక్కువగా పీడిస్తుంటాయి. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు తగ్గకుండా ముదిరితే ఆస్తమాకు దారితీస్తుంటుంది.

ఎందుకు వ్యాప్తి చెందుతుందంటే..

ఆస్తమా రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని తెలుసుకోవచ్చు. మరికొన్నింటిని గుర్తించటం కష్టం కూడా. వంశపారంపర్యంగా కూడా ఇది సంక్రమిస్తుంది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి ఉన్నా పిల్లలకు రావొచ్చు. గాలి, నీరు, వాయు కాలుష్యాల ద్వారా కూడా వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక జలుబు, సైనస్‌ ఇన్ఫెక్షన్స్‌, దుమ్ము, ధూళి, బూజు, పెంపుడు జంతువులు, ఆహార పదార్థాల్లోని రసాయనాల వల్ల కూడా వస్తుంది. ఇంట్లో ఉండే కుక్కలు, పిల్లలు, ఇతర జంతువుల వల్ల కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. చర్మ వ్యాధులు ఉంటే చిన్నారులకు కూడా వచ్చే అవకాశం ఉంది. జలుబు వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా రావొచ్చు. సిగరెట్‌ పొగ, సెంటు వాసనల ద్వారా కూడా సోకొచ్చు. నొప్పి తగ్గించే మందులు (పెయిన్‌ కిల్లర్లు), బిపి నియంత్రణకు వాడే మందుల ద్వారా వచ్చే అవకాశం ఉంది. అజీర్తి, గ్యాస్‌ట్రబుల్‌, మానసిక ఒత్తిళ్లు వంటివి కూడా కారణం కావొచ్చు.

Do not neglect asthma
Do not neglect asthma

చికిత్సా పద్ధతులు ఇవే…

ఆస్తమాను తగ్గించటానికి నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఇన్‌హెలేషన్‌ థెరపీ, మాత్రల ద్వారా చేసే చికిత్స, ఇంజక్షన్లతో వైద్యం.

ఇన్‌హెలేషన్‌ థెరపీ : ఇన్‌హెలేషన్‌ థెరపీ నేడు ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తున్న అత్యున్నత చికిత్సా విధానం. దీనిలో రిలీవర్స్‌, ప్రివెంటర్స్‌ ఉన్నాయి. వీటివల్ల నేరుగా మందు వాయు మార్గం నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తక్షణం పనిచేస్తుంది. రిలీవర్స్‌ తాత్కాలికంగా ఉపశమనం కలిగించేవి. ప్రివెంటర్స్‌ దీర్షకాలం వ్యాధిని అదుపులో ఉంచుతాయి. ఇతర ఔషధాలతో పోల్చితే ఈ ఇన్‌హేలర్స్‌ ద్వారా ఇచ్చేవి తక్కువ మోతాదుతో ఉంటాయి. నిరభ్యంతరంగా ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఈ విషయం ఇప్పటికే అనేక పరిశోధనల్లో వెలుగులోకి వచ్చింది.

ఔషధాలతో చికిత్స : ఔషధాలను తీసుకుంటే అవి మొదట రక్తంలోకి వెల్లి చిట్ట చివరకు ఊపిరితిత్తులను చేరుకుని పనిచేస్తాయి. అందుకు కొంత ఎక్కువ సమయం పడుతుంది. .

ఇంజక్షన్‌తో వైద్యం : సిరప్‌లు, ఇంజక్షన్ల ద్వారా తీసుకునే మందు మొదట రక్తంలో కలిసి చివరగా లంగ్స్‌పై ప్రభావాన్ని చూపుతాయి. ఈ మందులు రక్తంలో కలవడం వల్ల శరీరంలోకి ఇతర భాగాలకు చేరిపోయి దుష్ప్రచారం చూపే అవకాశం ఉంది.

వ్యాధి లక్షణాలు ఇవే…

  • ఉదయం, రాత్రి వేళల్లో దగ్గు తీవ్రత పెరగటం ఛాతీ బిగుసుకుపోయినట్లుగా ఉండటం.
  • శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు
  • తరచూ ఆయాసం రావటం
  • గురక తీవ్రత ఎక్కువగా ఉండటం
  • ఊబకాయ ఇబ్బందులు
  • గొంతు నుంచి ఈల వంటి శబ్ధం రావటం
  • అలవాట్లు మార్చుకోవాలి
  • విటమిన్లు ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి
  • తాజా ఆకుకూరలు, కాయగూరలు, చిరుధాన్యాలు వంటివి మేలు చేస్తాయి
  • విటమిన్‌ సి ఉండే కమలాలు, నిమ్మ, బత్తాయి తినాలి
  • ధూమపానం, మద్య పానానికి దూరంగా ఉండాలి
  • ఆయిల్‌ ఫుడ్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌ వంటివి మానుకోవాలి
  • ఇంట్లో వండిన తాజాగా వేడి వేడిగా ఉండే పదార్థాలను భుజించాలి
  • పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి
  • కాలుష్య ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటే మంచిది
  • వీలైనంతవరకూ మాస్కులు ధరించటం మేలు
  • చలిగాలుల్లో బయట తిరగటం మంచిది కాదు
- డాక్టర్‌ మోదిని వెంకట్రావు, ప్రొఫెసర్‌,సిద్ధార్థ మెడికల్‌ కళాశాల, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పల్మనాలజీప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, విజయవాడ.
– డాక్టర్‌ మోదిని వెంకట్రావు, ప్రొఫెసర్‌,సిద్ధార్థ మెడికల్‌ కళాశాల, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పల్మనాలజీప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, విజయవాడ.
➡️