‘వైతాళిక’తో కళాకారులకు ప్రోత్సాహం

Nov 17,2023 10:03 #Arts, #Jeevana Stories, #Women Stories

మరుగున పడిపోతున్న కళలు, కళాకారులను ప్రోత్సహించే వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అటువంటి బాటలో హైద్రాబాద్‌కు చెందిన పదిహేడేళ్ల అమ్మాయి ప్రీతిక పవిరాల చేస్తున్న కృషి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతాం. యుక్త వయసు పిల్లలు సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. కొంత అభిరుచి ఉన్న వారైతే కళలు, కళాకారులు పెట్టే పోస్టులను, ఫొటోలను ఇష్టపడుతూ, షేర్‌ చేస్తూ తమ మద్దతు తెలియజేస్తారు. కానీ ప్రీతిక అంతటితో ఊరుకోలేదు.

ఐదేళ్ల క్రితమే ప్రీతిక కుటుంబం అమెరికా నుంచి భారత్‌కి చేరింది. కళల పట్ల మక్కువ ఉన్న ప్రీతిక కూచిపూడి నృత్యం, సంగీతం పట్ల చిన్నప్పటి నుండే ఆసక్తి పెంచుకుంది. అలా అమెరికాలో పుట్టి పెరిగినా, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ఒంటబట్టించుకుంది. స్కూల్లో డ్యాన్స్‌ కాంపిటీషన్స్‌ను లీడ్‌ చేసిన అనుభవం ఉంది.
‘నేను 11 ఏళ్లుగా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నాను. 10 స్టేజ్‌ షోలలో పాల్గొన్నాను. 2000కి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. ఇంత చేసినా ఇప్పుడు చేస్తున్న కృషే ఎక్కువ సంతృప్తినిస్తోంది’ అంటున్న ప్రీతిక హైద్రాబాద్‌కు వచ్చిన తరువాత ఓ అనాథ శరణాలయాన్ని సందర్శించింది. అక్కడ ఓ డ్యాన్స్‌ ప్రదర్శన చేసింది. ఆమెతో పాటు అక్కడి పిల్లలు కూడా డ్యాన్స్‌ చేశారు. ‘వారంతా అనాథలు, వాళ్లెలా నృత్య సాధన చేశారు’ అన్న ఆలోచన ఆమెను మరింత దురాలోచన చేసేలా పురికొల్పింది. అవగాహన ఉన్న అనాథ శరణాలయాల్లో విద్య, సంరక్షణతో పాటు కళలను సాధన చేయిస్తారు. అదే అవకాశాలు లేని చోట.. అక్కడ ఉన్నవారికి కళల పట్ల ఆసక్తి ఉన్నా, సాధన చేసే వీలు ఉండదు. అటువంటి వారిని వెలుగులోకి తీసుకురావాలి. అప్పుడే నిజమైన కళాకారులు బయటికి వస్తారు’ అని ఆలోచించింది. కానీ, ఆ దిశగా అడుగులు వేయడం ఎలా?
‘వైతాళిక’ ఇలా మొదలైంది !

కళ పట్ల అభిమానం అయితే ఉంది. కానీ కళలను, కళాకారులను ప్రోత్సహించడం సవాలుతో కూడుకున్న పని. అయినా వెనుకంజ వేయలేదు. ‘వైతాళిక’ పేరుతో ఒక సంస్థను స్థాపించి, ఆసక్తి ఉన్న తన ఈడు వారందరినీ అందులో భాగస్వామ్యం చేసింది. గ్రామీణ కళలు, కళాకారులను వెతికి పట్టుకుంటోంది. బృందాలు, బృందాలుగా అనాథ శరణాలయాలకు వెళుతోంది. అక్కడ ఔత్సాహిక కళాకారులతో ప్రదర్శనలు ఇప్పిస్తూ, ఆసక్తి ఉన్న వారికి నేర్పిస్తామని చెబుతుంది. కళ పట్ల ప్రేమ ఉన్న విద్యార్థులు ముందుకు వస్తే వారు సాధన చేసే వీలుగా ఓ టీచర్‌ని నియమిస్తోంది. ఇలా గతేడాది అక్టోబరులో ప్రారంభించిన ‘వైతాళిక’ సేవలు ఇప్పటివరకు ఐదు గ్రామాలకు చేరాయి. 250 మంది గ్రామీణ మహిళా కళాకారులు, ఐదు అనాథశరణాలయాల భాగస్వామ్యంతో 300 మంది అనాథ పిల్లలు సాంస్కృతిక కళల్లో తర్ఫీదు పొందుతున్నారు. నిష్ణాతులైన శిక్షకులతో వారికి శిక్షణ ఇప్పిస్తోంది. సోషల్‌మీడియాలో ఆ కార్యక్రమాలను పోస్టు చేస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటోంది.

సవాళ్లు ఎదురయ్యాయి

‘దక్షిణాసియా సాంస్కృతిక కళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘వైతాళిక’ పనిచేస్తోంది. విదేశాల్లో ఉన్న నా స్నేహితుల ద్వారా భారత్‌, యుఎస్‌లో ఆరు బ్రాంచీలు ప్రారంభించి నిధులు సేకరించాను. 100 మందిని వాలంటీర్లుగా చేర్చుకున్నాను. మొట్టమొదటిసారే రూ.3 లక్షల సొమ్ము వచ్చింది. ఆ మొత్తం, ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. మరుగున పడిపోతున్న గ్రామీణ కళలను ఉద్ధరిస్తున్నానని చాలామంది నాకు మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే ఆసక్తి ఉండి అవకాశాలు లేని వారిని ప్రోత్సహిస్తున్నానని అభినందిస్తున్నారు. మొదట్లో టీచర్ల కొరత వుండేది. వాళ్లు అడిగినంత వేతనాలు ఇవ్వలేకపోయేవాళ్లం. ఈ సమస్య చాలారోజులు నన్ను బాధించింది. ఆ తరువాత కొంతమంది స్వచ్ఛందంగా ముందుకువచ్చారు.

అప్పుడే అనుకున్నాను

హైద్రాబాద్‌కు వచ్చిన తొలి రోజుల్లో అనాథ శరణాలయాల్లో నృత్య ప్రదర్శనలో ఇచ్చాను. ఓ చోట నాతో పాటు అక్కడి పిల్లలు కూడా డ్యాన్స్‌ చేశారు. ఆ తరువాత శిల్పారామం సందర్శించినప్పుడు అక్కడ గ్రామీణ కళాకారుల అద్భుత ప్రతిభ చూశాక, కళల పట్ల మక్కువ ఉన్న నిరుపేద వ్యక్తులకు నా వంతు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా ‘వైతాళిక’కి బీజం పడింది. అనాథ శరణాలయాల గురించి కొంతమందికైనా అవగాహన ఉంటుంది. కానీ గ్రామాల్లో ఉన్న కళాకారుల గురించి ఎవరికీ తెలియదు. ఇంటర్‌నెట్‌ ఉన్నా వాళ్ల సమాచారం దొరకదు. అందుకే మా బృందాలు గ్రామాల చుట్టుపక్కల ఉన్న స్వచ్ఛంద సంస్థలను కలుస్తాము. వాళ్ల దృష్టికి వచ్చిన కళాకారుల వివరాలు తెలుసుకుని ఆయా గ్రామాలకు వెళుతున్నాం. వాళ్ల ఆసక్తి తెలుసుకుని ప్రోత్సహిస్తున్నాం. ఇదంతా ఒక్కరోజులో జరగదు. వారాలు, నెలల తరబడి పనిచేయాల్సి వుంటుంది. ఈ కార్యక్రమాల్లో మా బృందం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది’ అంటూ తన ప్రయాణం గురించి ప్రీతిక చెబుతోంది.
కళాకారులకు సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్న ప్రీతికకు మొదట్లో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. నిధులు, టీచర్లు, కళాకారులను వెతికి పట్టుకోవడం కంటే, ‘చిన్న వయసులో ఇంత పెద్ద పని చేస్తున్నావా’ అంటూ ప్రతికూల వాతావరణం ఎదురైంది. ఎంతోమంది నుండి అనేక సందేహాలను ఎదుర్కొంది. కానీ కళ పట్ల ప్రేమ, కళాకారులను సాధికారత కల్పించాలన్న ఆమె అంకితభావానికి కుటుంబం, స్నేహితులు అండగా నిలబడ్డారు. వారిచ్చిన మద్దతుతో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని నమ్మకంగా చెబుతోంది. ఆమె సంకల్పం ఎంతోమంది కళాకారులకు కొండంత చేయూతనివ్వాలని మనమూ ఆశిద్దాం.
ఇదే కాకుండా ఇస్కారా పేరుతో సంస్కృతి- ఆధారిత చర్మసంరక్షణ సామాజిక సంస్థకు ప్రీతిక సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. అలాగే 7 కప్స్‌ అనే మానసిక ఆరోగ్య వెబ్‌సైట్‌ కమ్యూనిటీ మెంటార్‌గా ఉంది. ఈ రోజుల్లో ఎంతోమంది యుక్తవయసు పిల్లలు ఎన్నో అపోహలకు లోబడి జీవితాలను దుర్భరం చేసుకోవడం చూస్తున్నాం. వారందరికీ భిన్నంగా ప్రీతిక అనుసరిస్తున్న మార్గం ఎంతో అభినందనీయం

➡️